పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు: ఐసీఏఐ అధ్యక్షుడు దేవరాజరెడ్డి
దేవరాజరెడ్డి, నీలేశ్ వికమ్‌సేను సన్మానిస్తున్న ఎస్‌ఐఆర్‌సీ ప్రతినిధులు, చిత్రంలో సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏ)ది క్రియాశీలక పాత్ర అని, వీరందరూ పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అధ్యక్షుడు ఎం.దేవరాజరెడ్డి అన్నారు. ఐసీఏఐకి తొలిసారిగా అధ్యక్షుడైన తెలుగు వ్యక్తి దేవరాజరెడ్డితో పాటు ఉపాధ్యక్షుడు నీలేశ్ వికమ్‌సేను మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్ ఎస్‌ఐఆర్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దేవరాజరెడ్డి మాట్లాడుతూ.. ‘‘అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఐసీఏఐ అధ్యక్షుడి స్థాయి వరకు రాగలిగా. విధి నిర్వహణలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రధాన దృష్టి పెడతా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్ట్స్(ఐఎఫ్‌ఆర్‌ఎస్)కు అనుగుణంగా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో బోధనా మార్పులు తీసుకొచ్చాం. ఐసీఏఐలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ డెరైక్టరేట్ నుంచి టెక్నికల్ డెరైక్టరేట్ వరకు వివిధ విభాగాల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేశాం’’ అని చెప్పారు. ఐటీ కంపెనీల మాదిరిగానే భవిష్యత్తులో ‘అకౌం టింగ్ హబ్’ వస్తుందని ఉపాధ్యక్షుడు నీలేశ్ అన్నారు. ‘‘సీఏ పరీక్ష నిబంధనలతో ఐదు శాతం మంది మాత్రమే పాస్ అవుతున్నారు. నాలుగేళ్ల పాటు కష్టపడి చదివిన మిగతా 95 శాతం మంది నిరాశకు లోనవుతున్నారు. అందుకే ఐఐటీ, ఐఐఎం మాదిరిగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పరిమిత సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తే బాగుంటుంది. దీంతో చాలా మంది విద్యార్థులకు కెరీర్ ఇచ్చినవారం అవుతాం’’ అని ‘సాక్షి’ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతోపాటు సీనియర్ సీఏ సభ్యులు పాల్గొన్నారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏలది కీలకపాత్ర
Published Wed, Feb 17 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM
Advertisement
Advertisement