Devaraja reddy
-
దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏలది కీలకపాత్ర
పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు: ఐసీఏఐ అధ్యక్షుడు దేవరాజరెడ్డి దేవరాజరెడ్డి, నీలేశ్ వికమ్సేను సన్మానిస్తున్న ఎస్‌ఐఆర్‌సీ ప్రతినిధులు, చిత్రంలో సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏ)ది క్రియాశీలక పాత్ర అని, వీరందరూ పారదర్శకంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అధ్యక్షుడు ఎం.దేవరాజరెడ్డి అన్నారు. ఐసీఏఐకి తొలిసారిగా అధ్యక్షుడైన తెలుగు వ్యక్తి దేవరాజరెడ్డితో పాటు ఉపాధ్యక్షుడు నీలేశ్ వికమ్సేను మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్ ఎస్‌ఐఆర్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవరాజరెడ్డి మాట్లాడుతూ.. ‘‘అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఐసీఏఐ అధ్యక్షుడి స్థాయి వరకు రాగలిగా. విధి నిర్వహణలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రధాన దృష్టి పెడతా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్ట్స్(ఐఎఫ్ఆర్ఎస్)కు అనుగుణంగా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో బోధనా మార్పులు తీసుకొచ్చాం. ఐసీఏఐలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ డెరైక్టరేట్ నుంచి టెక్నికల్ డెరైక్టరేట్ వరకు వివిధ విభాగాల్లో సృజనాత్మకతకు పెద్దపీట వేశాం’’ అని చెప్పారు. ఐటీ కంపెనీల మాదిరిగానే భవిష్యత్తులో ‘అకౌం టింగ్ హబ్’ వస్తుందని ఉపాధ్యక్షుడు నీలేశ్ అన్నారు. ‘‘సీఏ పరీక్ష నిబంధనలతో ఐదు శాతం మంది మాత్రమే పాస్ అవుతున్నారు. నాలుగేళ్ల పాటు కష్టపడి చదివిన మిగతా 95 శాతం మంది నిరాశకు లోనవుతున్నారు. అందుకే ఐఐటీ, ఐఐఎం మాదిరిగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పరిమిత సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తే బాగుంటుంది. దీంతో చాలా మంది విద్యార్థులకు కెరీర్ ఇచ్చినవారం అవుతాం’’ అని ‘సాక్షి’ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతోపాటు సీనియర్ సీఏ సభ్యులు పాల్గొన్నారు. -
ఐసీఏఐ అధ్యక్షుడిగా దేవరాజారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్‌వాసి ఎం.దేవరాజారెడ్డి ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఆయన గతేడాది ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అధ్యక్షుడిగా ఏడాది పాటు కొనసాగుతారు. సీఏ విద్యా ప్రణాళికలో మార్పులు తేనున్నట్టు ఈ సందర్భంగా ఆయన మీడియాకు చెప్పారు. కొత్త సిలబస్ రావడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ‘‘విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించడం వల్ల సీరియస్ విద్యార్థులు మాత్రమే కోర్సు ఎంచుకునే అవకాశముంటుంది. సీఏలుగా దేశవిదేశాల్లో పని చేసేందుకు అవకాశాలు విరివిగా ఉన్నాయి. కొత్త కంపెనీ లా ప్రకారం సీఏలకు ఎన్నో బాధ్యతలు వచ్చాయి. దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు సీఏ వెన్నెముకగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు భవిష్యత్తుంది’’ అని పేర్కొన్నారు. -
సీఏ ఫైనల్ కోర్సులో మారిన పాఠ్యాంశాలు
* ఆడిటింగ్, అకౌంటింగ్లో కొత్త సిలబస్ * ఐసీఏఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎం.దేవరాజరెడ్డి విజయవాడ: నవంబర్‌లో జరగనున్న సీఏ ఫైనల్ పరీక్షల్లో అకౌంటింగ్, ఆడిటింగ్ సబ్జెక్టుల్లో మార్పులు చేసినట్టు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ దేవరాజరెడ్డి తెలిపారు. నగరంలోని ఎ-కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కంపెనీల చట్టం-2013లో కొన్ని మార్పులు చేశారని, దానికి అనుగుణంగా సీఏ ప్రొఫెషనల్ కోర్సులోనూ మార్పులు చేసినట్లు వెల్లడించారు. అడ్వాన్స్ ఐటీ కోర్సు... నేడు ప్రతి రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యమెంతో ఉందని, ఈ నేపథ్యంలో సీఏ ప్రొఫెషనల్స్ కూడా ఐటీలో ముందుండాలనే ఉద్దేశంతో ఐసీఏఐ సంస్థ అడ్వాన్స్ ఐటీ కోర్సును నిర్వహిస్తుందని దేవరాజరెడ్డి తెలిపారు. 2012 ఆగస్టు 1న సీఏ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులంతా ఈ అడ్వాన్స్ ఐటీ కోర్సును తప్పక చేయాలన్నారు. సీఏ ఫైనల్లో ఈ కోర్సును నేర్పుతారన్నారు.