సీఏ ఫైనల్ కోర్సులో మారిన పాఠ్యాంశాలు
* ఆడిటింగ్, అకౌంటింగ్‌లో కొత్త సిలబస్
* ఐసీఏఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎం.దేవరాజరెడ్డి
విజయవాడ: నవంబర్‌లో జరగనున్న సీఏ ఫైనల్ పరీక్షల్లో అకౌంటింగ్, ఆడిటింగ్ సబ్జెక్టుల్లో మార్పులు చేసినట్టు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ దేవరాజరెడ్డి తెలిపారు. నగరంలోని ఎ-కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కంపెనీల చట్టం-2013లో కొన్ని మార్పులు చేశారని, దానికి అనుగుణంగా సీఏ ప్రొఫెషనల్ కోర్సులోనూ మార్పులు చేసినట్లు వెల్లడించారు.
అడ్వాన్స్ ఐటీ కోర్సు...
నేడు ప్రతి రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యమెంతో ఉందని, ఈ నేపథ్యంలో సీఏ ప్రొఫెషనల్స్ కూడా ఐటీలో ముందుండాలనే ఉద్దేశంతో ఐసీఏఐ సంస్థ అడ్వాన్స్ ఐటీ కోర్సును నిర్వహిస్తుందని దేవరాజరెడ్డి తెలిపారు. 2012 ఆగస్టు 1న సీఏ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులంతా ఈ అడ్వాన్స్ ఐటీ కోర్సును తప్పక చేయాలన్నారు. సీఏ ఫైనల్‌లో ఈ కోర్సును నేర్పుతారన్నారు.