![Congress unlikely to be part of Omar Abdullah led cabinet in Jammu and Kashmir](/styles/webp/s3/article_images/2024/10/16/congrees.jpg.webp?itok=pCgEQubL)
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.
కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.
ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు.
![ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం](https://www.sakshi.com/s3fs-public/inline-images/cm_3.jpg)
Comments
Please login to add a commentAdd a comment