
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ‘అన్‌లీషింగ్ ద పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ పేరిట మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలపై భారంగా మారిన నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
టెక్నాలజీతో పేదలకు లబ్ధి
అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. 5జీ, కృత్రిమ మేధ(ఏఐ)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్‌తోపాటు జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నెంబర్(జేఏఎం)కు టెక్నాలజీయే ఆధారమని అన్నారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏఐ ద్వారా పరిష్కరించగలిగిన పదింటిని గుర్తించాలని నిపుణులకు సూచించారు. 21వ శతాబ్దాన్ని టెక్నాలజీ ముందుకు నడిపిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రతి బడ్జెట్‌లోనూ పెద్దపీట వేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఒక అవరోధంగా పరిగణించవద్దని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment