దిశ మార్చి వస్తోంది..దశ మార్చబోతోంది..! | CM KCR Dedicates Prestigious Kaleshwaram Project To The Nation | Sakshi
Sakshi News home page

తెలంగాణ గంగమ్మకు జైబోలో..!

Published Sat, Jun 22 2019 2:15 AM | Last Updated on Sat, Jun 22 2019 5:57 AM

CM KCR Dedicates Prestigious Kaleshwaram Project To The Nation - Sakshi

మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో గవర్నర్‌ నరసింహన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ దశాబ్దాల కల సాకారమైంది. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తొలుత ఉదయం 11:23 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం విశిష్ట అతిథి గవర్నర్‌ నరసింహన్, మరో ముఖ్యఅతిథి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు వై.ఎస్‌. జగన్, సీఎం కేసీఆర్‌ కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ గుమ్మడికాయను కొట్టి సరిగ్గా ఉదయం 11:26 గంటలకు రిబ్బన్‌ కట్‌ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అలాగే మధ్యాహ్నం 1:07 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి స్విచాన్‌ చేశారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పంప్‌హౌస్‌ నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభం కావడంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని బటన్‌ నొక్కి ఆవిష్కరిస్తున్న
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ తదితరులు



కన్నెపల్లి వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గోదావరి..

ఘనంగా జల సంకల్ప యాగం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద శృంగేరీ పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితులు పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు సీఎంలను, గవర్నర్‌ను ఆశీర్వదించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన యాగంలో కేసీఆర్‌ దంపతులు, కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర జరిగిన యాగంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను మంత్రి మహమూద్‌ అలీ, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌లను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.

యాగశాలలో కేసీఆర్‌ దంపతుల పూజలు. చిత్రంలో గవర్నర్‌ నరసింహన్, సీఎంలు ఫడ్నవిస్, జగన్, మంత్రులు ఇంద్రకరణ్, ఈటల తదితరులు

ముగ్గురు సీఎంలు కలిసిన సందర్భం..
నదీజలాల వాటాలు, పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరీవాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్య మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వంతోనూ నీటి వివాదాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మహారాష్ట్ర ప్రభుత్వంతో, ఏపీలో కొలువుదీరిన వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్నేహపూర్వక దౌత్య సంబంధాలు నడిపారు.

అతిథులు, బ్యాంకర్లకు సన్మానం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యఅతిథులు గవర్నర్‌ నరసింహన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన కేసీఆర్‌... అతిథులు వెళ్లేటప్పుడు హెలికాప్టర్‌ దాకా వెళ్లి మరీ ఒక్కొక్కరికీ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించిన వివిధ బ్యాంకుల ప్రతినిధులను సీఎం సన్మానించి జ్ఞాపికలు అందించారు.

లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
కన్నెపల్లిలో నిర్మించిన పంపుహౌస్‌ లిఫ్ట్‌లో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇరుక్కుపోయారు. ప్రాజెక్టు ప్రారంభానికి హాజరైన ఆయన... కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్లను చూసేందుకు లిప్టులో కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంటన్నర తర్వాత లిఫ్ట్‌ అద్దాలు పగలగొట్టి అధికారులు వారిని నిచ్చెన ద్వారా మరో ఫ్లోర్‌లోకి ఎక్కించారు. 

సువర్ణాక్షరాలతో లిఖించే రోజు: సీఎస్‌
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన జూన్‌ 21వ తేదీని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే. జోషి అభివర్ణించారు. అతిథులు, బ్యాంకర్లను సన్మానించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ జోషి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డీజీపీ జైస్వాల్, ఎంపీలు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్, బి.వెంకటేష్‌ నేత, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, హరే రామ్, వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ. గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ సూర్యప్రకాశ్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఒకే కారులో ముగ్గురు సీఎంలు, గవర్నర్‌...
మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభోత్సవం సందర్భంగా బ్యారేజీకి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుంచి బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. అనంతరం బ్యారేజీ లోపలికి నీరు నిల్వ ఉంచే చోటును పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అతిథులతో కలిసి సీఎం కేసీఆర్‌ తిలకించారు. గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అతిథులకు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తున్నది విడమరిచి చెప్పారు. 

మేడిగడ్డ బ్యారేజీ గురించి మ్యాప్‌ ద్వారా సీఎంలు ఫడ్నవిస్, జగన్‌లకు వివరిస్తున్న కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రారంభం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లను పంప్‌హౌస్‌ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పంపుల వద్దకు తీసుకువెళ్లి చూపించారు. పంపుల సామర్థ్యం, ఉపయోగంపై విపులంగా చెప్పారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతను వివరించారు. అయితే షెడ్యూల్డ్‌ కార్యక్రమాలు ఉండటంతో ఫడ్నవిస్‌ కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రారంభోత్సవంకన్నా ముందే వెళ్లిపోయారు.

ముక్తీశ్వరుడ్ని దర్శించుకున్న ఫడ్నవిస్‌
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ మేడిగడ్డ బ్యారేజీ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరాలయానికి ఉదయం 11.45 గంటలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, కమిషనర్‌ అనిల్‌ కుమార్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. 

ప్రారంభోత్సవ మధుర ఘట్టాలు..

  • ఉదయం 7:15 గంటలకు : హైదరాబాద్‌ నుంచి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలు దేరారు. అప్పటికే మేడిగడ్డ వద్ద శృంగేరీ పీఠానికి చెందిన ఫణి శశాంక్‌ శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులతో వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ మహాక్రతువు నిర్వహించారు. 
  • 8:30: సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ వద్ద 10 నిమిషాలపాటు ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు.
  • 9:10: హోమంలో కూర్చన్న కేసీఆర్‌ దంపతులు 
  • 9:30: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌లు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. వారికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు.
  • 9:50: యాగశాలలో కూర్చున్న ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్, మంత్రులు
  • 10:45: మహారాష్ట్ర సీఎం పఢ్నవిస్, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌లు మేడిగడ్డ వద్ద నిర్వహిస్తున్న హోమం వద్దకు చేరిక.. వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం.
  • 11:00: జలసంకల్ప హోమం పూర్తి
  • 11:15: ప్రాజెక్టుపై ఫొటో ప్రదర్శ నను తిలకించిన సీఎంలు, గవర్నర్, అతి«థులు.
  • 11:20: ప్రాజెక్టు డాక్యుమెంటరీ వీక్షణ
  • 11:23: వైఎస్‌.జగన్‌ మేడిగడ్డ వద్ద పైలాన్‌ బటన్‌నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
  • 11:26: గేట్ల వద్ద రిబ్బన్‌ కత్తిరించిన సీఎం కేసీఆర్, అంతకు ముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో గవర్నర్, కేసీఆర్, జగన్‌ మహారాష్ట్ర సరిహద్దుకు వెళ్లారు. 
  • మధ్యాహ్నం 12:50: కన్నెపల్లికి చేరుకున్నారు. 12:50 నుంచి 12:53 వరకు ‘మేఘా’ ప్రతినిధులు పంపుల పనీతీరును గవర్నర్, సీఎంలకు వివరించారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసిన సీఎం కేసీఆర్‌ అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రిబ్బన్‌ కట్‌ చేశారు.
  • 12:55: శిలాఫలకం ఆవిష్కరణ. అక్కడి దిగువన ఉన్న మోటార్ల పరిశీలన.
  • 1:07: ఆరో నంబర్‌ మోటార్‌ను స్విచ్‌ ఆన్‌ చేసి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.

    కన్నెపల్లి పంప్‌హౌస్‌ను స్విచ్‌ ఆన్‌ చేస్తున్న సీఎం కేసీఆర్‌. నీటి పంపింగ్‌ అనంతరం ఉరకలెత్తుతున్న గోదావరి జలాలు
     
  • 1:30: మధ్యాహ్న భోజన విరామం, ఆ తర్వాత అతిథులు, ఇంజనీర్లు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రులు, గవర్నర్‌ మాట్లాడారు. అనంతరం అతిథులను సన్మానించారు.
  • 2:00 గంటల తర్వాత నుంచి ఒకరి తర్వాత ఒకరు తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా గవర్నర్‌ నరసింహన్, తర్వాత ఏపీ సీఎం జగన్‌కు సీఎం కేసీఆర్‌ వీడ్కోలు పలికారు.
  • 2:25 గంటలకు బ్యాంకర్లు, కొందరు అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేసిన సీఎం కేసీఆర్‌.. ఆ తర్వాత హైదరాబాద్‌ బయలుదేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement