బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం | AP and Telangana says OK to send DPRs of new projects on Krishna and Godavari | Sakshi
Sakshi News home page

బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం

Published Wed, Oct 7 2020 3:22 AM | Last Updated on Wed, Oct 7 2020 7:18 AM

AP and Telangana says OK to send DPRs of new projects on Krishna and Godavari - Sakshi

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన అపెక్స్‌ కమిటీ భేటీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్, సీడబ్ల్యూసీ అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి రెండు నదుల మేనేజ్‌మెంట్‌ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేసేందుకు నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. రెండు నదులపై చేపట్టే కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎవాల్యుయేషన్‌ కోసం పంపడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి షెకావత్‌ అధ్యక్షతన ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశం మంగళవారం ఇక్కడి శ్రమశక్తి భవన్‌లో జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, హైదరాబాద్‌ నుంచి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. సమావేశానంతరం జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరామ్‌ వెదిరె, కార్యదర్శి యూపీ సింగ్, అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ, సంయుక్త కార్యదర్శి సంజీవ్‌ అవస్తీతో కలిసి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చి జల వివాదాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు వీలు కలిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ఇచ్చిన ఆజ్ఞను పాటించడంలో సఫలీకృతులమయ్యాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక.. ‘గోదావరి, కృష్ణా నదుల అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేయడానికి తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. కానీ, చట్టప్రకారం దీనిపై ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేనందువల్ల రెండు నదుల మేనేజ్‌మెంట్‌ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. ఇందుకు తెలంగాణ సీఎం కూడా సుముఖత వ్యక్తంచేశారు’.. అని షెకావత్‌ తెలిపారు. అలాగే.. ‘కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని సెక్షన్‌–3 కింద ట్రిబ్యునల్‌కు సూచించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అపెక్స్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ 

కేసును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినందువల్ల ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్న అంశాన్ని ట్రిబ్యునల్‌కు సూచించడం వీలుకాదని తెలియచేయడంతో కేసీఆర్‌ ఆ కేసును వెంటనే ఉపసంహరించుకుంటామని చెప్పారు. అంతేకాక, లిఖితపూర్వక హామీ ఇచ్చిన తరువాత దానిని కొత్త ట్రిబ్యునల్‌కు పంపాలా లేక ప్రస్తుత ట్రిబ్యునల్‌కు పంపాలా అన్నదానిపై చట్టపరమైన సలహాలను తీసుకుని నిర్ణయిస్తాం. గోదావరి నది జలాల పంపిణీ వివాదాల పరిష్కారానికి మరో ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేయాలని రెండు రాష్ట్రాలు కోరాయి. ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని మరుసటి రోజే కేంద్రానికి పంపుతానని తెలంగాణ సీఎం తెలిపారు. కృష్ణానది మేనేజ్‌మెంట్‌ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి రెండు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపాయి..’ అని షెకావత్‌ వివరించారు.  

ఏపీ సీఎంతో ఏకీభవించిన షెకావత్‌ 
అంతకుముందు అపెక్స్‌ సమావేశంలో.. కొత్త ట్రిబ్యునల్‌ ఇచ్చేంతవరకు ఏం మాట్లాడినా లాభంలేదని, తాను పంపించిన అంశాలు అజెండాలో లేవని కేసీఆర్‌ ప్రస్తావించారు. అయితే, ఆలస్యంగా వచ్చినందున ఆ అంశాలు రాలేదని, మరోసారి సమావేశమవ్వొచ్చని మంత్రి షెకావత్‌ సూచించారు. ఈ నేపథ్యంలో.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తాను పంపిన అభ్యంతరాలను కేసీఆర్‌ ప్రస్తావించారు. వీటిని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తిప్పికొట్టారు. గోదావరి నదిపై చేపడుతున్న కాళేశ్వరం, సీతారామసాగర్‌ తదితర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విస్తరణ పేరుతో కొత్తగా ప్రాజెక్టులు చేపడుతోందని, ఏపీలో అదే రీతిలో తాము ప్రాజెక్టులు విస్తరిస్తే అభ్యంతరం ఎందుకని తన వాదన వినిపించారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలనేది తన అభిప్రాయం అని చెప్పారు.

కేంద్రమంత్రి ఈ వాదనలతో ఏకీభవించారు. ‘రెండూ ఒకేరీతిలో ఉండాలి. ఒకచోట ఒక విధానం మరొకచోట మరో విధానం ఉండరాదు..’ అని సూచించారు. అలాగే, పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు ఏపీ తరలిస్తోంది... ఇది అక్రమమని కేసీఆర్‌ చేసిన మరో వాదనను కూడా వైఎస్‌ జగన్‌ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా.. కేడబ్ల్యూడీటీ–1 తీర్పులోని 128వ పేజీని చదువుతూ.. ఒక బేసిన్‌ నుంచి ఇంకో బేసిన్‌కు నీటిని తరలించడం న్యాయమేనని ఆ తీర్పు చెప్పిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తుంగభద్ర హెచ్‌ఎల్సీ ద్వారా, కేసీ కెనాల్‌ ద్వారా ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు తరలించారని జగన్‌ గుర్తుచేశారు. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు దశాబ్దాలుగా శ్రీశైలం నుంచి తరలిస్తున్నారని తెలిపారు. దేశంలో రావి, చినాబ్, సట్లెజ్‌ తదితర నదుల నుంచి కూడా నీటిని మళ్లీస్తున్న అంశాన్ని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. అనంతరం.. ‘డీపీఆర్‌లు సమర్పిస్తే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది..’ అని మంత్రి చెప్పగా.. ఇందుకు ఇద్దరు సీఎంలూ సమ్మతించారు. 

ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ పట్టు 
అజెండా అంశాలపై జరిగిన చర్చలో.. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్‌–3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలని తాము చేసిన అభ్యర్థనను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే పట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన సరిగ్గా వినలేదని, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై లోతుగా అధ్యయనం జరగాలని కోరారు. దీనిపై షెకావత్‌ స్పందిస్తూ..  ‘వీటన్నింటినీ ట్రిబ్యునల్‌ ఒక్కటే పరిష్కరించలేదు.. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది..’ అని సమాధానమిచ్చారు.  

అజెండాలో లేని అంశాలపై కేంద్రం అభిప్రాయం.. 
అజెండాలో లేని కొన్ని అంశాలపై కేంద్రం తన అభిప్రాయాన్ని సమావేశంలో పంచుకుంది. అవి.. 
► కృష్ణా బేసిన్‌లో చాలా ప్రాజెక్టులున్నాయని, కానీ.. నదీ జలాలు మాత్రం పరిమితంగా ఉన్నాయని వివరించింది.  
► ఉనికిలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, తద్వారా మరిన్ని కొత్త ప్రాజెక్టులు పనిచేసేలా తిరిగి కేటాయింపులు జరపడం సాధ్యపడుతుందని అభిప్రాయపడింది. 
► గోదావరి బేసిన్‌లో కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక చేసే ముందు.. అనుమతులున్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం ద్వారా లభ్యత ఉన్న మొత్తం జలాలను సరిగ్గా వినియోగించుకోవాలని సూచించింది. 
► గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదన ఉన్నందున.. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలపై శ్రద్ధ చూపాలి. 
► ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు సాగునీటి శాఖ మంత్రి అనిల్‌కుమార్, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, సాగునీటి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

అజెండాలోని అంశాల వారీగా కేంద్రం ప్రతిపాదనలు.. 
మొదటి అంశంపై కేంద్రమంత్రి వివరిస్తూ.. ‘బోర్డులు ఏర్పడి ఆరేళ్లయినప్పటికీ వీటి పరిధి నోటిఫై కాకపోవడానికి కారణం రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడమే. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని నియంత్రించడం, కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అనుమతులివ్వడం ఈ బోర్డుల విధి. అయితే వీటిని నోటిఫై చేయకపోవడం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో నిర్ణయాధికారం కేంద్రానిదే అయినందున ప్రస్తుతం నోటిఫై చేసేందుకు నిర్ణయించాం. దీని ద్వారా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది..’ అని వివరించారు.  

2 అజెండాలోని రెండో అంశం కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించడం. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఆయా ప్రాజెక్టులను సాంకేతికంగా మదింపు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన ఆదేశాలతో సంబంధం ఉన్న ప్రాజెక్టులు.. అలాగే, అనుమతుల్లేని పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా సమర్పించాలి. తొలుత బోర్డులు సాంకేతిక మదింపు జరిపి సమ్మతించిన తరువాత అపెక్స్‌ కౌన్సిల్‌ వాటికి అనుమతిస్తుంది. కేడబ్ల్యూడీటీ–1 ద్వారా కేటాయింపులున్న ప్రాజెక్టులన్నింటినీ పాత ప్రాజెక్టులుగా పరిగణించాలి. ట్రిబ్యునల్స్‌ ద్వారా వాటికి కేటాయింపులు లేనిపక్షంలో.. కేడబ్ల్యూడీటీ–2 ద్వారా కేటాయింపులు తెచ్చుకోవాలి. ఈ రెండు కేటగిరీల్లో లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి. వీటి డీపీఆర్‌లు సమర్పించాలి. 

రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వాటా నిర్ధారించేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయడం. రెండు రాష్ట్రాలు పరస్పరం వీటిపై ఫిర్యాదు చేసినందున అపెక్స్‌ కౌన్సిల్‌ సామరస్యంగా పరిష్కరించేందుకు ఒక మెకానిజం ప్రతిపాదించింది. గోదావరి జలాల విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ద్వారా లేదా కొత్త ట్రిబ్యునల్‌ నిర్ణయించడం ద్వారా గోదావరి జలాలు పంపిణీ చేసుకోవచ్చు. అలాగే, గోదావరి జలాలను కృష్ణా నదికి (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి) మళ్లించినప్పుడు దాని నుంచి వాటా పంచేందుకు మెకానిజం ఏర్పాటుచేయాలి. 

కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించేందుకు అంగీకారం కుదిరింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement