Apex committee meeting
-
బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేసేందుకు నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రెండు నదులపై చేపట్టే కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎవాల్యుయేషన్ కోసం పంపడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి షెకావత్ అధ్యక్షతన ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం మంగళవారం ఇక్కడి శ్రమశక్తి భవన్లో జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. సమావేశానంతరం జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరె, కార్యదర్శి యూపీ సింగ్, అదనపు కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ, సంయుక్త కార్యదర్శి సంజీవ్ అవస్తీతో కలిసి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడారు. ‘ఇరు రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చి జల వివాదాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు వీలు కలిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ఇచ్చిన ఆజ్ఞను పాటించడంలో సఫలీకృతులమయ్యాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక.. ‘గోదావరి, కృష్ణా నదుల అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేయడానికి తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. కానీ, చట్టప్రకారం దీనిపై ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేనందువల్ల రెండు నదుల మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. ఇందుకు తెలంగాణ సీఎం కూడా సుముఖత వ్యక్తంచేశారు’.. అని షెకావత్ తెలిపారు. అలాగే.. ‘కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని సెక్షన్–3 కింద ట్రిబ్యునల్‌కు సూచించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అపెక్స్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ కేసును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినందువల్ల ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్న అంశాన్ని ట్రిబ్యునల్‌కు సూచించడం వీలుకాదని తెలియచేయడంతో కేసీఆర్ ఆ కేసును వెంటనే ఉపసంహరించుకుంటామని చెప్పారు. అంతేకాక, లిఖితపూర్వక హామీ ఇచ్చిన తరువాత దానిని కొత్త ట్రిబ్యునల్‌కు పంపాలా లేక ప్రస్తుత ట్రిబ్యునల్‌కు పంపాలా అన్నదానిపై చట్టపరమైన సలహాలను తీసుకుని నిర్ణయిస్తాం. గోదావరి నది జలాల పంపిణీ వివాదాల పరిష్కారానికి మరో ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని రెండు రాష్ట్రాలు కోరాయి. ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని మరుసటి రోజే కేంద్రానికి పంపుతానని తెలంగాణ సీఎం తెలిపారు. కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి రెండు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపాయి..’ అని షెకావత్ వివరించారు. ఏపీ సీఎంతో ఏకీభవించిన షెకావత్ అంతకుముందు అపెక్స్ సమావేశంలో.. కొత్త ట్రిబ్యునల్ ఇచ్చేంతవరకు ఏం మాట్లాడినా లాభంలేదని, తాను పంపించిన అంశాలు అజెండాలో లేవని కేసీఆర్ ప్రస్తావించారు. అయితే, ఆలస్యంగా వచ్చినందున ఆ అంశాలు రాలేదని, మరోసారి సమావేశమవ్వొచ్చని మంత్రి షెకావత్ సూచించారు. ఈ నేపథ్యంలో.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తాను పంపిన అభ్యంతరాలను కేసీఆర్ ప్రస్తావించారు. వీటిని ఏపీ సీఎం వైఎస్ జగన్ తిప్పికొట్టారు. గోదావరి నదిపై చేపడుతున్న కాళేశ్వరం, సీతారామసాగర్ తదితర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విస్తరణ పేరుతో కొత్తగా ప్రాజెక్టులు చేపడుతోందని, ఏపీలో అదే రీతిలో తాము ప్రాజెక్టులు విస్తరిస్తే అభ్యంతరం ఎందుకని తన వాదన వినిపించారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలనేది తన అభిప్రాయం అని చెప్పారు. కేంద్రమంత్రి ఈ వాదనలతో ఏకీభవించారు. ‘రెండూ ఒకేరీతిలో ఉండాలి. ఒకచోట ఒక విధానం మరొకచోట మరో విధానం ఉండరాదు..’ అని సూచించారు. అలాగే, పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు ఏపీ తరలిస్తోంది... ఇది అక్రమమని కేసీఆర్ చేసిన మరో వాదనను కూడా వైఎస్ జగన్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా.. కేడబ్ల్యూడీటీ–1 తీర్పులోని 128వ పేజీని చదువుతూ.. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు నీటిని తరలించడం న్యాయమేనని ఆ తీర్పు చెప్పిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తుంగభద్ర హెచ్ఎల్సీ ద్వారా, కేసీ కెనాల్ ద్వారా ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించారని జగన్ గుర్తుచేశారు. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు దశాబ్దాలుగా శ్రీశైలం నుంచి తరలిస్తున్నారని తెలిపారు. దేశంలో రావి, చినాబ్, సట్లెజ్ తదితర నదుల నుంచి కూడా నీటిని మళ్లీస్తున్న అంశాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. అనంతరం.. ‘డీపీఆర్‌లు సమర్పిస్తే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది..’ అని మంత్రి చెప్పగా.. ఇందుకు ఇద్దరు సీఎంలూ సమ్మతించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ పట్టు అజెండా అంశాలపై జరిగిన చర్చలో.. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్–3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని తాము చేసిన అభ్యర్థనను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే పట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన సరిగ్గా వినలేదని, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై లోతుగా అధ్యయనం జరగాలని కోరారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. ‘వీటన్నింటినీ ట్రిబ్యునల్ ఒక్కటే పరిష్కరించలేదు.. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది..’ అని సమాధానమిచ్చారు. అజెండాలో లేని అంశాలపై కేంద్రం అభిప్రాయం.. అజెండాలో లేని కొన్ని అంశాలపై కేంద్రం తన అభిప్రాయాన్ని సమావేశంలో పంచుకుంది. అవి.. ► కృష్ణా బేసిన్లో చాలా ప్రాజెక్టులున్నాయని, కానీ.. నదీ జలాలు మాత్రం పరిమితంగా ఉన్నాయని వివరించింది. ► ఉనికిలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, తద్వారా మరిన్ని కొత్త ప్రాజెక్టులు పనిచేసేలా తిరిగి కేటాయింపులు జరపడం సాధ్యపడుతుందని అభిప్రాయపడింది. ► గోదావరి బేసిన్లో కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక చేసే ముందు.. అనుమతులున్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం ద్వారా లభ్యత ఉన్న మొత్తం జలాలను సరిగ్గా వినియోగించుకోవాలని సూచించింది. ► గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదన ఉన్నందున.. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలపై శ్రద్ధ చూపాలి. ► ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు సాగునీటి శాఖ మంత్రి అనిల్‌కుమార్, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. అజెండాలోని అంశాల వారీగా కేంద్రం ప్రతిపాదనలు.. 1 మొదటి అంశంపై కేంద్రమంత్రి వివరిస్తూ.. ‘బోర్డులు ఏర్పడి ఆరేళ్లయినప్పటికీ వీటి పరిధి నోటిఫై కాకపోవడానికి కారణం రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడమే. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని నియంత్రించడం, కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అనుమతులివ్వడం ఈ బోర్డుల విధి. అయితే వీటిని నోటిఫై చేయకపోవడం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో నిర్ణయాధికారం కేంద్రానిదే అయినందున ప్రస్తుతం నోటిఫై చేసేందుకు నిర్ణయించాం. దీని ద్వారా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది..’ అని వివరించారు. 2 అజెండాలోని రెండో అంశం కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించడం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఆయా ప్రాజెక్టులను సాంకేతికంగా మదింపు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన ఆదేశాలతో సంబంధం ఉన్న ప్రాజెక్టులు.. అలాగే, అనుమతుల్లేని పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా సమర్పించాలి. తొలుత బోర్డులు సాంకేతిక మదింపు జరిపి సమ్మతించిన తరువాత అపెక్స్ కౌన్సిల్ వాటికి అనుమతిస్తుంది. కేడబ్ల్యూడీటీ–1 ద్వారా కేటాయింపులున్న ప్రాజెక్టులన్నింటినీ పాత ప్రాజెక్టులుగా పరిగణించాలి. ట్రిబ్యునల్స్ ద్వారా వాటికి కేటాయింపులు లేనిపక్షంలో.. కేడబ్ల్యూడీటీ–2 ద్వారా కేటాయింపులు తెచ్చుకోవాలి. ఈ రెండు కేటగిరీల్లో లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి. వీటి డీపీఆర్‌లు సమర్పించాలి. 3 రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వాటా నిర్ధారించేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయడం. రెండు రాష్ట్రాలు పరస్పరం వీటిపై ఫిర్యాదు చేసినందున అపెక్స్ కౌన్సిల్ సామరస్యంగా పరిష్కరించేందుకు ఒక మెకానిజం ప్రతిపాదించింది. గోదావరి జలాల విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ద్వారా లేదా కొత్త ట్రిబ్యునల్ నిర్ణయించడం ద్వారా గోదావరి జలాలు పంపిణీ చేసుకోవచ్చు. అలాగే, గోదావరి జలాలను కృష్ణా నదికి (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి) మళ్లించినప్పుడు దాని నుంచి వాటా పంచేందుకు మెకానిజం ఏర్పాటుచేయాలి. 4 కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు అంగీకారం కుదిరింది. -
పరిమితులకు లోబడే ‘సీమ’కు నీరు
సాక్షి, అమరావతి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీటి సరఫరా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిమితులకు లోబడి వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. మంగళవారం కేంద్ర మంత్రి సమక్షంలో అపెక్స్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయ లబ్ధి కోసం కేంద్రంపై చేసే విమర్శలను తెలంగాణ సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేసింది. అపెక్స్ కమిటీ మీటింగ్‌లో రాయలసీమ అంశంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీటుగా స్పందించాలని కోరింది. రాయలసీమ ప్రాంతానికి న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు జరగాలని, అందుకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారాన్ని కోరుతున్నామని తెలిపింది. రాష్ట్రాల అభివృద్ధి తప్ప ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండరాదని, రాష్ట్రాల్లో వ్యతిరేక భావనలు పెంచడం బీజేపీ విధానం కాదని చెప్పింది. కేంద్ర మంత్రికి సోము వీర్రాజు లేఖ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా వ్యవహరించిన తీరులోనే అపెక్స్ కమిటీ భేటీలో రాయలసీమకు నీటి తరలింపు అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా నీటి కేటాయింపులు జరపాలని లేఖలో పేర్కొన్నారు. -
అపెక్స్ భేటీలో దీటైన సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుంటోంది. అపెక్స్ సమావేశంలో ఆ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడేళ్ల అలసత్వాన్ని ఎండగట్టాలి. తెలంగాణ హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం.. దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలి. 2014, జూన్ 2న తెలంగాణ ఏర్పడితే జూన్ 14న ప్రధానికి లేఖ రాశాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం.. ప్రత్యేక ట్రబ్యునల్ వేసైనా తెలంగాణకు నీటి కేటాయింపులు జరపాలని కోరాం. తెలంగాణ, ఏపీ మధ్య లేదా నదీ పరివాహక రాష్ట్రాల మధ్య అయినా.. నీటి పంపిణీ జరపాలని విజ్ఞప్తి చేశాం. ఏడేళ్లు దాటినా ఆ లేఖకు ఈ నాటికి స్పందన లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారు. కానీ, కేంద్రం చేస్తుంది ఏమీ లేదు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి’అని కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల కమిటీ భేటీ వాయిదా పడిందని సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. కాగా కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం జరగాల్సిన భేటీ వాయిదా పడింది. -
రూ.10,974 కోట్లతో గ్రామాల్లో జలజీవన్
సాక్షి, అమరావతి: జల జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు వేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.10,974 కోట్లను వెచ్చించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు 2024 నాటికల్లా మంచినీటి కుళాయిలు అమర్చి.. ప్రతి రోజూ ఒక్కొక్క వ్యక్తికి 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో జల జీవన్ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరించాల్సి ఉంటుంది. అపెక్స్ కమిటీ తొలి భేటీ ► రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుకు ఉద్దేశించిన అపెక్స్ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆధ్యక్షతన సోమవారం తొలిసారి సమావేశమైంది. ► పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక, ప్రణాళిక, విద్య, వైద్య శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ► ఆర్డబ్ల్యూఎస్ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 95,66,332 ఇళ్లు ఉండగా.. వీటిలో 31,93,400 ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు మంచినీటి కుళాయిలు ఉన్నాయి. ► మిగిలిన 63,72,932 ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా కుళాయి సౌకర్యం కల్పిస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి కేటాయించిన నిధులు ఆర్డబ్ల్యూఎస్ శాఖ వద్ద ఇప్పటికే రూ.976 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ► వీటికి తోడు 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మరో రూ.1,581 కోట్లు దీనికి కేటాయించాయి. ► 2021–24 సంవత్సరాల మధ్య మిగిలిన మూడేళ్ల కాలంలో ఈ పథకానికి రూ.8,417 కోట్ల కేటాయింపులు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం రూ.10,974 కోట్ల ఈ పథకానికి ఖర్చు చేయాల్సి ఉంది. -
పాలమూరును నాశనం చేశారు
చంద్రబాబుపై మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన పాలమూరు జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని మరింత నాశనం చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ , గువ్వల బాలరాజుతో కలసి గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజే సీఎం కేసీఆర్ పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పాలమూరు ప్రజల జీవితాలు బాగుపడుతుంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు అభివృద్ధికి పార్టీలకతీతంగా రాజకీయనేతలంతా కలసిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బుధవారం జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి సీఎం కేసీఆర్ ధీటుగా మాట్లాడారన్నారు. పాలమూరు ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అపెక్స్ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీని టీటీడీపీ నేతలు ఇప్పటికైనా వదిలేయాలని మంత్రి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చంద్రబాబు కపటబుద్ధి బయటపడింది: ఎమ్మెల్యే శ్రీనివాస్ బాబుకు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికావడం ఇష్టం లేదని, ఢిల్లీలో బాబు కపట బుద్ధి బయట పడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఏపీ సర్కారు ఇప్పుడు పాలమూరుపై విషం కక్కుతోందన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు విషయంలో కమిటీని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తుంటే టీటీడీపీ నేతలు నోరు మెదపలేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేత డీకే అరుణ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. -
21న ఢిల్లీలో అపెక్స్ కమిటీ సమావేశం
హైదరాబాద్: ఈ నెల 21న న్యూఢిల్లీలో అపెక్స్ కమిటీ సమావేశం జరుగనుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో కృష్ణా, గోదావరి జలాల వివాదంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ హాజరుకానున్నట్టు సమాచారం.