సాక్షి, అమరావతి: జల జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు వేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.10,974 కోట్లను వెచ్చించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు 2024 నాటికల్లా మంచినీటి కుళాయిలు అమర్చి.. ప్రతి రోజూ ఒక్కొక్క వ్యక్తికి 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో జల జీవన్ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరించాల్సి ఉంటుంది.
అపెక్స్ కమిటీ తొలి భేటీ
► రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుకు ఉద్దేశించిన అపెక్స్ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆధ్యక్షతన సోమవారం తొలిసారి సమావేశమైంది.
► పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక, ప్రణాళిక, విద్య, వైద్య శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.
► ఆర్‌డబ్ల్యూఎస్ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 95,66,332 ఇళ్లు ఉండగా.. వీటిలో 31,93,400 ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు మంచినీటి కుళాయిలు ఉన్నాయి.
► మిగిలిన 63,72,932 ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా కుళాయి సౌకర్యం కల్పిస్తారు.
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి కేటాయించిన నిధులు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ వద్ద ఇప్పటికే రూ.976 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
► వీటికి తోడు 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మరో రూ.1,581 కోట్లు దీనికి కేటాయించాయి.
► 2021–24 సంవత్సరాల మధ్య మిగిలిన మూడేళ్ల కాలంలో ఈ పథకానికి రూ.8,417 కోట్ల కేటాయింపులు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం రూ.10,974 కోట్ల ఈ పథకానికి ఖర్చు చేయాల్సి ఉంది.
రూ.10,974 కోట్లతో గ్రామాల్లో జలజీవన్
Published Tue, Jun 30 2020 4:23 AM | Last Updated on Tue, Jun 30 2020 4:23 AM
Advertisement