RWS Officers
-
ఫ్లోరైడ్ తగ్గింది.. నీటి నాణ్యత పెరిగింది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించే బోరు బావుల్లో నీటి నాణ్యత గతం కంటే బాగా మెరుగుపడినట్టు తేలింది. ప్రత్యేకించి గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం వినియోగించే వివిధ రకాల నీటి వనరులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా.. ఫ్లోరైడ్ తదితర కాలుష్య కారకాలు అతి తక్కువ చోట్ల ఉన్నట్టు స్పష్టమైంది. తాగునీటి అవసరాలకు ఉపయోగించే వనరులలోని నీటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఒకసారి, ఆరు నెలల తర్వాత మరోసారి తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ చోట్ల మొత్తం 1,80,608 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. వాటిలో 6,432 నీటి నమూనాల్లో ఫ్లోరైడ్ లేదా ఇతర ప్రమాదకర కాలుష్యాలు ఉన్నట్టు తేలింది. అంటే మొత్తం పరీక్షలలో కేవలం 3.5 శాతం నీటి నమూనాలలోనే కాలుష్య కారకాలను గుర్తించారు. గతంలో వివిధ సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో 15 శాతానికి పైగా ఫ్లోరైడ్ వంటి కారకాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారణ అయిన సందర్భాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,432 చోట్ల కాలుష్య కారకాలను గుర్తించగా.. వాటిలో 6,396 చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు కూడా పూర్తి చేసినట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పెరగడం, సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల రాష్ట్రంలో కలుషిత నీటి జాడలు బాగా తగ్గినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్పారు. పరీక్షల్లో మన రాష్ట్రమే టాప్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ముందే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,99,785 నీటి నమూనాలు సేకరించి, వాటిలో 1,80,608 నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రం లక్షన్నర నీటి నమూనాలకు మించి పరీక్షలు నిర్వహించలేదు. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 1.49 లక్షల నీటి నమూనాలను సేకరించి, అందులో 1.26 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించి రెండో స్థానంలో ఉంది. -
బురద నీటి నుంచీ తాగునీటి వరద
సాక్షి, అమరావతి: బురద నీటిని సైతం అంతర్జాతీయ ప్రమాణాల (ఐఎస్వో 10500) స్థాయిలో శుద్ధి చేసి తాగునీటిగా అందించే ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సొంతం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో సాగునీటి కాలువల ద్వారా పారే నీరు బురదమయంగా మారుతుండటంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తోంది. తద్వారా ఐఎస్వో స్థాయికి శుద్ధి చేసిన నీటిని మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉపక్రమించారు. కాలువల్లో ఎక్కువ రోజులు బురద నీరే ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పలు మంచినీటి పథకాలకు సాగునీటి కాలువల ద్వారా నీటిని సేకరిస్తారు. అయితే, నీరు ఏడాదిలో ఎక్కువ రోజులు బురదమయంగా ఉంటోంది. వర్షాకాలంలో తరుచూ కురిసే వర్షాల వల్ల, ఎండకాలంలో స్టోరేజీ ట్యాంకులో నిల్వ ఉంచిన నీరు అడుగంటిన సమయంలో బురదమయంగా మారుతోంది. మంచినీటి పథకాల వద్దకు వచ్చి చేరే ఆ బురద నీటిని సాధారణ పద్ధతులలో శుద్ధిచేసి తాగు నీటిగా అందిస్తున్నారు. స్థానికులు ఆ నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి. అక్కడి గ్రామాల్లో అవసరమైన స్థాయిలో మంచినీటి పథకాలు, నీరు అందుబాటులో ఉంటున్నా గత 10–12 ఏళ్లుగా ఆ జిల్లాల్లోని వందలాది గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసే ముందు ఫిల్టర్ బెడ్ విధానంలో నీటిని శుద్ధి చేస్తారు. కంకర, ఇసుక పొరలతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్లలో నీటిని ఇంకించి.. ఆ తర్వాత బ్లీచింగ్ కలిపి ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విధానంలో వంద లీటర్ల నీటిని ఫిల్టర్ బెడ్‌లోకి పంపితే, తిరిగి దాదాపు అదే స్థాయిలో నీరు తిరిగి అందుబాటులోకి రావాలి. కానీ.. బురద నీటిని నేరుగా పిల్టర్ బెడ్‌లోకి పంపినప్పుడు.. 60–70 శాతం నీరు ఇంకిన తర్వాత ఫిల్టర్ బెడ్లో ఉండే ఇసుక పొరపై బురద పేరుకపోయి మిగిలిన నీరు ఇంకే పరిస్థితి ఉండదు. దీంతో ఆ ఫిల్టర్ బెడ్ల ద్వారా ఇంకే నీరు ఒక రకమైన వాసన వస్తోంది. ఫిల్టర్ బెడ్లో ఇసుక పొరపై పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తే గానీ ఆ మంచినీటి పథకం పనిచేయని పరిస్థితి. ఇదే సమయంలో ఫిల్టర్ బెడ్లోని ఇసుక, కంకర పొరలను తరుచూ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా వ్యయంతో కూడిన వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో వాటిని బాగు చేయించే పరిస్థితి లేక పథకాలు వృథాగా ఉండాల్సి వచ్చేవి. ప్రీ ట్రీట్మెంట్ పద్ధతి విజయవంతం కావడంతో.. సాగునీటి కాలువల ద్వారా వచ్చే బురద నీటి శుద్ధికి మంచినీటి పథకాల వద్ద కొత్త టెక్నాలజీతో కూడిన ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంచినీటి పథకాల వద్ద ఉండే స్లో శాండ్ ఫిల్టర్లకు ముందే ఫ్యాకులేటర్, ట్యూబ్ సెట్లెర్‌లను రెండు వేర్వేరు విభాగాలతో అనుసంధానం చేయడం ద్వారా బురద నీటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని శాండ్ ఫిల్టర్ బెడ్ పైకి పంపడం వల్ల ఐఎస్వో స్థాయి మేరకు పరిశుభ్రమైన తాగునీటిగా శుద్ధి అవుతుంది. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి సఫలం కావడంతో.. గోదావరి జిల్లాల్లో సమస్య ఉన్న ప్రతిచోట ఈ విధానం ద్వారా బురద నీటి శుద్ధి ప్రక్రియను కొత్తగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రూ.88.60 కోట్లతో.. గోదావరి జిల్లాల్లో బురద నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ విధానంలో నీటిని శుద్ధి చేసిన తర్వాతే మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రూ.88.60 కోట్లతో తూర్పు గోదావరి జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 276 మంచినీటి పథకాల వద్ద ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతి రాగానే పనులు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ సీఈ పి.సంజీవరావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
రూ.10,974 కోట్లతో గ్రామాల్లో జలజీవన్
సాక్షి, అమరావతి: జల జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు వేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.10,974 కోట్లను వెచ్చించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు 2024 నాటికల్లా మంచినీటి కుళాయిలు అమర్చి.. ప్రతి రోజూ ఒక్కొక్క వ్యక్తికి 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో జల జీవన్ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరించాల్సి ఉంటుంది. అపెక్స్ కమిటీ తొలి భేటీ ► రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుకు ఉద్దేశించిన అపెక్స్ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆధ్యక్షతన సోమవారం తొలిసారి సమావేశమైంది. ► పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక, ప్రణాళిక, విద్య, వైద్య శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ► ఆర్డబ్ల్యూఎస్ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 95,66,332 ఇళ్లు ఉండగా.. వీటిలో 31,93,400 ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు మంచినీటి కుళాయిలు ఉన్నాయి. ► మిగిలిన 63,72,932 ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా కుళాయి సౌకర్యం కల్పిస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి కేటాయించిన నిధులు ఆర్డబ్ల్యూఎస్ శాఖ వద్ద ఇప్పటికే రూ.976 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ► వీటికి తోడు 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మరో రూ.1,581 కోట్లు దీనికి కేటాయించాయి. ► 2021–24 సంవత్సరాల మధ్య మిగిలిన మూడేళ్ల కాలంలో ఈ పథకానికి రూ.8,417 కోట్ల కేటాయింపులు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం రూ.10,974 కోట్ల ఈ పథకానికి ఖర్చు చేయాల్సి ఉంది. -
అస్తవ్యస్తంగా ’మిషన్ భగీరథ’
సాక్షి,ఉప్పునుంతల : నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్లో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వీధుల వెంట వేసిన పైప్‌లైన్ పనులు సరిగా చేయకపోవడంతో లీకేజీలతో త్రాగునీరు వృథాగా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ నల్లా కనెక్షన్లో భాగంగా వేసి ఉంచిన పైప్‌లకు తూతూ మంత్రంగా నల్లాలు అమర్చారని తెలిపారు. కాంట్రాక్టర్ కేవలం వంతుకు గంతేసినట్లు పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించలేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు భగీరథ పనులను నాణ్యతతో చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జీతం రాక పస్తులు
సాక్షి, అమరచింత : ఒకటి కాదు.. రెండు కాదు.. 11 నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో రక్షిత తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాల కోసం ఎదురుచూస్తు అర్దాకలితో అలమటిస్తు ఆందోళనలకు పూనుకునే పరిస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా పరిదిలోని 20 రక్షిత తాగునీటి పథకాలలో నాలుగువేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.6500 నుండి రూ.8500 ల వరకు నెలనెలా వేతనాలను సంబందిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెల్లించేవారు. ప్రస్తుతం నెలసరి వేతనాలను చెల్లించడానికి ప్రభుత్వం విముఖత చూపుతూ 14వ ఆర్థికసంఘం నిధులలోనే గ్రామపంచాయతీ ఆధీనంలో వాటర్వర్కర్లకు వేతనాలను చెల్లించాలని ఆదేశించారు. దీంతో 11 నెలలుగా ఇటు గ్రామపంచాయతీ గానీ, అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గాని వేతనాల వ్యవహారంలో స్పష్టత చూపలేక పోతున్నారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని అనుసంధానం చేస్తున్నామని రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా నెరవేరక పోవడంతో 11 నెలల వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. పాలమూరు ఉమ్మడి జిల్లాలో 20 సంవత్సరాల క్రితం కొడంగల్ వద్ద కాగ్నా వద్ద రక్షిత తాగునీటి పథకాన్ని మొట్టమొదటి సారిగా ప్రారంభించారు. వీటితో పాటు రామన్‌పాడు, రాజోలి, రేవులపల్లి, మక్తల్, ఆత్మకూర్, దేవరకద్ర, బాలకిష్టాపురం, గోపన్‌పేట, అచ్చంపేట, ఆమన్‌గల్లు, కల్వకుర్తి, కోయిలకొండ, జడ్చర్ల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ లలో రక్షిత తాగునీటి పథకాలను ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాను అందచేస్తున్నారు. వీటిలో సత్యసాయి తాగునీటి పథకానికి సంబందించిన వర్కర్లు ఎల్అండ్టీ కంపెనీ ఒప్పందంతో కేవలం 6 నెలల వేతనాలు పొందాల్సి ఉంది. మిగతా స్కీంలలో పనిచేస్తున్న సిబ్బంది 11 నెలలుగా వేతనాల కోసం పరితపిస్తున్నారు. కొంపముంచిన 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీకి మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధుల ద్వారానే రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వాటర్వర్కర్స్కు ఆ యా గ్రామపంచాయతీలకు అందుతున్న తాగు నీటి సరఫరా ద్వారా సిబ్బందికి వేతనాలను పంచాయతీ ద్వారానే చెల్లించాలి. కాగా 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు తక్కువ మొత్తంలో వస్తున్న కారణంగా ఒక్కో కార్మికుడికి రూ.8,500 ఉన్న వేతనాన్ని చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్పట్లో రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వర్కర్లకు వేతనాలను చెల్లించేవారు. పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులనే వేతనాల కోసం వాడుకోవాలని ఆదేశించడంతో కార్మికుల వేతనాల సమస్య తీవ్రరూపం దాల్చింది. -
ఆ ఊరంతా దురదే !
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెయిల్‌పాండ్ నీటిని తాగిన ఆ ఊరి జనమంతా దురదబారిన పడ్డారు. ఊరు ఊరంతా ఒళ్లు దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతోంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండా గ్రామస్తులు టెయిల్‌పాండ్ నీటిని తాగడం ద్వారా గిరిజనులు దురద, వాంతులు, తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి అయిన నీటిని రివర్స్ పంపింగ్ చేయడంతో ఆ నీళ్లు టెయిల్‌పాండ్‌లోకి వచ్చి నిల్వ ఉండడంతో ఆ నీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శుద్ధి చేయకుండా నేరుగా మండలంలోని చింతలపాలెం, నాయకునితండాల్లో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌కు పంపిస్తున్నారు. దీంతో ఆనీరు తాగిన వారికి ఒళ్లంతా ఎర్రని మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు. -
నీళ్లడిగితే అక్రమ కేసులా?
► అధికారుల తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా ► ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ఆదోని ఎమ్మెల్యే మండిపాటు ఆదోని టౌన్: ‘ఎండలు మండిపోతున్నాయి. ప్రజలతోపాటు పశువులు దాహంతో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వాలని అధికారులను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తే అక్రమంగా కేసులు బనాయిస్తారా?’ అంటూ అధికారుల తీరుపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కార్యాలయాల్లో ఫ్యాన్ల కింద కూర్చుంటే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొంతులెండిపోతున్నాయని, గుక్కెడు నీళ్లివ్వాలని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సహనం కోల్పోయిన ఢణాపురం మహిళలు, సర్పంచు ఈరన్నగౌడ్, నాయకులు వీరయ్య, నర్సింహస్వామి బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం సబబు కాదన్నా రు. అధికారుల తీరుపై అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రస్తు తం జిల్లా కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సర్పంచ్ ఈరన్నగౌడు, ఆందోళనకారులు వైఎస్ఆర్సీపీ కావడంతోనే అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులను విత్‌డ్రా చేసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. అధికారులు పక్షపాతం వీడకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేషిరెడ్డి పాల్గొన్నారు. -
వాటర్ టెస్ట్ .. వరస్ట్
పల్లెవాసులకు అందని సురక్షిత నీరు పంచాయతీల్లో మూలనపడిన టెస్టింగ్ కిట్లు వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సురక్షితమైన తాగునీరు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇదో సమాధానం లేని ప్రశ్న! అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం అందజేసిన నీటి నమూనా కిట్లు వృథాగా మారి.. పల్లెవాసులకు స్వచ్ఛమైన నీరు అందడం లేదు. ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. తూప్రాన్ మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నీటి పరీక్షలు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తూప్రాన్: పంచాయతీలకు 2012లో గత ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో వాటర్ టెస్టింగ్ కిట్లు పంపిణీ చేసింది. పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు నీటి నాణ్యత పరీక్షలు సంయుక్తంగా నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పద్ధతి ఎక్కడా కొనసాగకపోవడం గమనార్హం. తూప్రాన్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నీటి పరీక్షలు నిర్వహించకపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యాధులు మంచుకొచ్చినప్పుడే.. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాలో లోపాలు ఉన్నారుు. భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు వ్యవసాయ బోరుబావుల నుంచి నీరు తెచ్చుకొని తాగుతున్నారు. అవి కలుషితం అవుతుండటంతో విషజ్వరాలబారిన పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో మాత్రమే పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎ స్, వైద్యశాఖ యంత్రాంగాలు హడావుడి చ ర్యలు తీసుకుంటున్నారు. తప్పితే సమస్య శా శ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేద న్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. నీటి పరీక్ష కి ట్లను సమర్థంగా వినియోగించుకుంటే ఇలాం టి సమస్యలు రావంటున్నరు గ్రామస్తులు. కిట్లు పడేశారు! నీటి పరీక్షల తర్వాత స్వల్పంగా బ్యాక్టీరియా ఉన్నట్లరుుతే.. ఆ నీటిని కాచి చల్లార్చిన తర్వాత వినియోగించుకోవచ్చు. ఒకవేళ అధిక శాతంలో జలాలు కలుషితమైతే ఆ నీటిని వినియోగించకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శులు చర్యలు చేపట్టాలి. ఈ తతంగమంతా భారం అనుకున్నారో? ఏమో? పంచాయతీల్లో కిట్లను మూలన పడేశారు. దీంతో ఒక్కో కిట్‌కు రూ.1200 చొప్పున మండలంలో 22 పంచాయతీలు, జిల్లాలో 46 మండలాల్లో 1,077 గ్రామ పంచాయతీలకు అందించిన కిట్లు వృథాగా మారారుు. ఫలితంగా రూ.12.92 లక్షలు బూడిదలో పోసిన పన్నీరైంది. శిక్షణ ఇచ్చిన చర్యలు శూన్యం ఎక్కడా కిట్లను వినియోగించిన దాఖలాలు లేవు. కిట్ల వినియోగంపై గతంలో మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగాన్‌వాడి వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. కానీ ఉపయోగం మాత్రం శూన్యం. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వాతిని ‘సాక్షి’ఫోన్లో వివరణ కోరగా.. ‘ఇటీవలే తూప్రాన్ మండల బాధ్యతలు స్వీకరించా, గ్రామాల్లో పర్యటించి చర్యలు తీసుకుంటా’అని చెప్పారు. మా ఊళ్ల పరీక్షలు చేయలే మా ఊళ్ల చాలా మంది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విషయం తెలిసినా నీటి పరీక్షలు చేయలే. గ్రామానికి సరఫరా చేసిన కిట్లు పంచాయతీలో పడేశారు. పెద్దసార్లు వెంటనే చర్యలు తీసుకోవాలి. - కృష్ణ, గుండ్రెడ్డిపల్లి