సత్యసాయి తాగునీటి పథకం ఇంటెక్‌వెల్
సాక్షి, అమరచింత : ఒకటి కాదు.. రెండు కాదు.. 11 నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో రక్షిత తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాల కోసం ఎదురుచూస్తు అర్దాకలితో అలమటిస్తు ఆందోళనలకు పూనుకునే పరిస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా పరిదిలోని 20 రక్షిత తాగునీటి పథకాలలో నాలుగువేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.6500 నుండి రూ.8500 ల వరకు నెలనెలా వేతనాలను సంబందిత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెల్లించేవారు. ప్రస్తుతం నెలసరి వేతనాలను చెల్లించడానికి ప్రభుత్వం విముఖత చూపుతూ 14వ ఆర్థికసంఘం నిధులలోనే గ్రామపంచాయతీ ఆధీనంలో వాటర్‌వర్కర్లకు వేతనాలను చెల్లించాలని ఆదేశించారు. దీంతో 11 నెలలుగా ఇటు గ్రామపంచాయతీ గానీ, అటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గాని వేతనాల వ్యవహారంలో స్పష్టత చూపలేక పోతున్నారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని అనుసంధానం చేస్తున్నామని రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా నెరవేరక పోవడంతో 11 నెలల వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
పాలమూరు ఉమ్మడి జిల్లాలో 20 సంవత్సరాల క్రితం కొడంగల్ వద్ద కాగ్నా వద్ద రక్షిత తాగునీటి పథకాన్ని మొట్టమొదటి సారిగా ప్రారంభించారు. వీటితో పాటు రామన్‌పాడు, రాజోలి, రేవులపల్లి, మక్తల్, ఆత్మకూర్, దేవరకద్ర, బాలకిష్టాపురం, గోపన్‌పేట, అచ్చంపేట, ఆమన్‌గల్లు, కల్వకుర్తి, కోయిలకొండ, జడ్చర్ల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ లలో రక్షిత తాగునీటి పథకాలను ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాను అందచేస్తున్నారు. వీటిలో సత్యసాయి తాగునీటి పథకానికి సంబందించిన వర్కర్లు ఎల్‌అండ్‌టీ కంపెనీ ఒప్పందంతో కేవలం 6 నెలల వేతనాలు పొందాల్సి ఉంది. మిగతా స్కీంలలో పనిచేస్తున్న సిబ్బంది 11 నెలలుగా వేతనాల కోసం పరితపిస్తున్నారు.
కొంపముంచిన 14వ ఆర్థిక సంఘం నిధులు
గ్రామపంచాయతీకి మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధుల ద్వారానే రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వాటర్‌వర్కర్స్‌కు ఆ యా గ్రామపంచాయతీలకు అందుతున్న తాగు నీటి సరఫరా ద్వారా సిబ్బందికి వేతనాలను పంచాయతీ ద్వారానే చెల్లించాలి. కాగా 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు తక్కువ మొత్తంలో వస్తున్న కారణంగా ఒక్కో కార్మికుడికి రూ.8,500 ఉన్న వేతనాన్ని చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అప్పట్లో రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వర్కర్లకు వేతనాలను చెల్లించేవారు. పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులనే వేతనాల కోసం వాడుకోవాలని ఆదేశించడంతో కార్మికుల వేతనాల సమస్య తీవ్రరూపం దాల్చింది.
Comments
Please login to add a commentAdd a comment