Finance Commission funds
-
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం రూ. 988 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 13,097 గ్రామ పంచాయతీలకు రూ. 689 కోట్లు, 650 మండల పరిషత్‌లకు రూ. 148.30 కోట్లు, ఉమ్మడి 13 జిల్లా పరిషత్‌లకు రూ. 150.75 కోట్లను ఆయా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో 15 రోజుల కిత్రమే జమ చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. వీటికి తోడు గతంలో ఆయా స్థానిక సంస్థలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఖర్చు కాని మొత్తం రూ. 126.99 కోట్లు కలిపి.. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల వద్ద మొత్తం రూ. 1,115 కోట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు వివరించారు. ఆన్లైన్లోనే బిల్లులు నమోదు.. నేరుగా సర్పంచులే డబ్బులు బదిలీ గ్రామ పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసింది. తాజాగా బిల్లుల చెల్లింపులు పీఎఫ్ఎంఎస్ విధానంలో చేస్తారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ నిబంధనల ప్రకారం పీఎఫ్ఎంఎస్ విధానంలో.. ఏ పని చేపట్టినా వాటి బిల్లులు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆ బిల్లుల మొత్తాలను గ్రామ పంచాయతీలలో సర్పంచి, మండల, జిల్లా పరిషత్‌లలో అక్కడి మండల, జిల్లా స్థాయి అధికారులు నేరుగా పనిచేసిన వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయవచ్చు. అయితే, చేసిన పనికి ఆన్లైన్లో బిల్లుల నమోదులో కట్టుదిట్టౖమైన ఏర్పాట్లు ఉన్నాయి. పని జరిగిన ప్రాంతం వివరాలు జియో ట్యాగింగ్‌తో సహా ముందుగానే ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, ఎం–బుక్ వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఆ పనులను ముందుగా గ్రామ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ), లేదంటే ఎంపీడీపీ లేదంటే జెడ్‌పీడీపీలో పేర్కొనాలి. ఈ ప్రణాళికలలో పేర్కొనని పనులకు ముందుగా ఆమోదం తీసుకోవాలి. ఆ పని చేసిన తర్వాత నిధులు డ్రా చేయడానికి అభివృద్ధి ప్రణాళికలో సప్లిమెంటరీ ప్లాన్లను తయారు చేసుకొని ఆ వివరాలను ఆ పోర్టల్ నమోదు చేసే వెసులుబాటు ఉందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.379.34 కోట్లు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సహా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.379.34 కోట్లను కేంద్రం మంగళవారం విడుదలచేసింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలవారీగా జనాభా ప్రాతిపదికన 70 : 15 : 15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు కేటగిరీల గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. గతేడాది జూలైకు ముందు తొలి విడతగా కేవలం రూ. 969.51 కోట్లు విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు ఆరి్థక సంవత్సరం ముగిసినా రెండో విడత నిధులివ్వలేదు. ఇలా రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రెండో విడతగా రూ. 969.51 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు బేసిక్ గ్రాంట్‌గా రూ.379.34 కోట్లు విడుదల చేసింది. మరో రూ.590.15 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాదికి రూ.2,010 కోట్లు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత (2022–23) ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 2,010 కోట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం రెండు విడతల్లో నాలుగు భాగాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. చదవండి: ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు -
జీతం రాక పస్తులు
సాక్షి, అమరచింత : ఒకటి కాదు.. రెండు కాదు.. 11 నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో రక్షిత తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాల కోసం ఎదురుచూస్తు అర్దాకలితో అలమటిస్తు ఆందోళనలకు పూనుకునే పరిస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా పరిదిలోని 20 రక్షిత తాగునీటి పథకాలలో నాలుగువేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.6500 నుండి రూ.8500 ల వరకు నెలనెలా వేతనాలను సంబందిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెల్లించేవారు. ప్రస్తుతం నెలసరి వేతనాలను చెల్లించడానికి ప్రభుత్వం విముఖత చూపుతూ 14వ ఆర్థికసంఘం నిధులలోనే గ్రామపంచాయతీ ఆధీనంలో వాటర్వర్కర్లకు వేతనాలను చెల్లించాలని ఆదేశించారు. దీంతో 11 నెలలుగా ఇటు గ్రామపంచాయతీ గానీ, అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గాని వేతనాల వ్యవహారంలో స్పష్టత చూపలేక పోతున్నారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని అనుసంధానం చేస్తున్నామని రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా నెరవేరక పోవడంతో 11 నెలల వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. పాలమూరు ఉమ్మడి జిల్లాలో 20 సంవత్సరాల క్రితం కొడంగల్ వద్ద కాగ్నా వద్ద రక్షిత తాగునీటి పథకాన్ని మొట్టమొదటి సారిగా ప్రారంభించారు. వీటితో పాటు రామన్‌పాడు, రాజోలి, రేవులపల్లి, మక్తల్, ఆత్మకూర్, దేవరకద్ర, బాలకిష్టాపురం, గోపన్‌పేట, అచ్చంపేట, ఆమన్‌గల్లు, కల్వకుర్తి, కోయిలకొండ, జడ్చర్ల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ లలో రక్షిత తాగునీటి పథకాలను ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాను అందచేస్తున్నారు. వీటిలో సత్యసాయి తాగునీటి పథకానికి సంబందించిన వర్కర్లు ఎల్అండ్టీ కంపెనీ ఒప్పందంతో కేవలం 6 నెలల వేతనాలు పొందాల్సి ఉంది. మిగతా స్కీంలలో పనిచేస్తున్న సిబ్బంది 11 నెలలుగా వేతనాల కోసం పరితపిస్తున్నారు. కొంపముంచిన 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీకి మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధుల ద్వారానే రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వాటర్వర్కర్స్కు ఆ యా గ్రామపంచాయతీలకు అందుతున్న తాగు నీటి సరఫరా ద్వారా సిబ్బందికి వేతనాలను పంచాయతీ ద్వారానే చెల్లించాలి. కాగా 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు తక్కువ మొత్తంలో వస్తున్న కారణంగా ఒక్కో కార్మికుడికి రూ.8,500 ఉన్న వేతనాన్ని చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్పట్లో రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వర్కర్లకు వేతనాలను చెల్లించేవారు. పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులనే వేతనాల కోసం వాడుకోవాలని ఆదేశించడంతో కార్మికుల వేతనాల సమస్య తీవ్రరూపం దాల్చింది. -
16 కోట్లు.. 20 రోజులు
మార్చి నెలాఖరు గడువు దగ్గర పడటంతో హడావుడిగా నిర్మాణాలు 11 నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు 20 రోజుల్లో రూ. 16 కోట్లకు టార్గెట్ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలు మార్చి నెలాఖరులోగా ఉపాధి హామీ, ఆర్థిక సంఘ నిధులు ఖర్చు చేయాలన్న నిబంధనవల్ల అధికారులు ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చాలాచోట్ల వారి పర్యవేక్షణ లేకుండా జరగడం వల్ల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇలాకాలో పరిస్థితి. నర్సీపట్నం: నర్సీపట్నం డివిజన్లో ఉపాధిహామీ, 13, 14 ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మార్చి నెలాఖరులోగా పూర్తిచేయకుంటే నిధులు రద్దయ్యే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆదర్శ గ్రామాలే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోట్లు కేటాయించడం తెలిసిందే. 20 రోజుల్లో ఎలా పూర్తి? నర్సీపట్నం డివిజన్లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకం, 13,14వ ఆర్థిక సంఘం నుంచి 675 పనులకు రూ.22.7 కోట్లు మంజూరయ్యాయి. 11 నెలల వ్యవధిలో రూ.6 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రూ.16.7 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు పనులు పూర్తి చేయించడానికి అధికారులు హైరానా పడుతున్నారు. ఏడాది కాలంగా పనులు పూర్తి చేయలేని అధికారులు స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి హెచ్చరించినా.. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను నిర్ధేశించిన సమయానికి ఖర్చు చేయకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే నిధులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నిధులను వచ్చే ఏడాది విడుదలయ్యే నిధుల్లోచూపించే అవకాశం ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేవలం 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవటం వారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కానరాని నాణ్యత నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేందుకు అధికారులు ఆదరాబాదరాగా పనులు చేపట్టడంతో వీటిలో నాణ్యత లోపించే అవకాశం లేకపోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలామంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వారంతా అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు జరిపించేస్తున్నారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం పనులు: 675 ఏడాదికి కేటాయించిన నిధులు: రూ.22.7కోట్లు 11 నెలల్లో పూర్తయినవి: రూ.6 కోట్ల విలువైన పనులు 20 రోజుల్లో పూర్తికావాల్సినవి: రూ.16.7కోట్ల విలువైన పనులు లక్ష్యాన్ని అధిగమిస్తాం ఇసుక కొరత వల్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. సాధ్యమైనంత వరకు మార్చి నెలాఖరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. - కె.ప్రభాకర్‌రెడ్డి, ఈఈ, పంచాయతీరాజ్ నర్సీపట్నం డివిజన్