16 కోట్లు.. 20 రోజులు
మార్చి నెలాఖరు గడువు
దగ్గర పడటంతో హడావుడిగా నిర్మాణాలు
11 నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు
20 రోజుల్లో రూ. 16 కోట్లకు టార్గెట్
పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలు
మార్చి నెలాఖరులోగా ఉపాధి హామీ, ఆర్థిక సంఘ నిధులు ఖర్చు చేయాలన్న నిబంధనవల్ల అధికారులు ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చాలాచోట్ల వారి పర్యవేక్షణ లేకుండా జరగడం వల్ల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇలాకాలో పరిస్థితి.
నర్సీపట్నం: నర్సీపట్నం డివిజన్‌లో ఉపాధిహామీ, 13, 14 ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మార్చి నెలాఖరులోగా పూర్తిచేయకుంటే నిధులు రద్దయ్యే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆదర్శ గ్రామాలే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోట్లు కేటాయించడం తెలిసిందే.
20 రోజుల్లో ఎలా పూర్తి?
నర్సీపట్నం డివిజన్‌లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకం, 13,14వ ఆర్థిక సంఘం నుంచి 675 పనులకు రూ.22.7 కోట్లు మంజూరయ్యాయి. 11 నెలల వ్యవధిలో రూ.6 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రూ.16.7 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు పనులు పూర్తి చేయించడానికి అధికారులు హైరానా పడుతున్నారు. ఏడాది కాలంగా పనులు పూర్తి చేయలేని అధికారులు స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి హెచ్చరించినా..
రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను నిర్ధేశించిన సమయానికి ఖర్చు చేయకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే నిధులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నిధులను వచ్చే ఏడాది విడుదలయ్యే నిధుల్లోచూపించే అవకాశం ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేవలం 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవటం వారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
కానరాని నాణ్యత
నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేందుకు అధికారులు ఆదరాబాదరాగా పనులు చేపట్టడంతో వీటిలో నాణ్యత లోపించే అవకాశం లేకపోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలామంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వారంతా అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు జరిపించేస్తున్నారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
మొత్తం పనులు: 675
ఏడాదికి కేటాయించిన నిధులు: రూ.22.7కోట్లు
11 నెలల్లో పూర్తయినవి: రూ.6 కోట్ల విలువైన పనులు
20 రోజుల్లో పూర్తికావాల్సినవి: రూ.16.7కోట్ల విలువైన పనులు
లక్ష్యాన్ని అధిగమిస్తాం
ఇసుక కొరత వల్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. సాధ్యమైనంత వరకు మార్చి నెలాఖరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం.
- కె.ప్రభాకర్‌రెడ్డి, ఈఈ, పంచాయతీరాజ్ నర్సీపట్నం డివిజన్