ఆన్‌లైన్‌లో వీలునామా | It's Easy To Make And Edit A Will Online With Low Cost | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో వీలునామా

Published Wed, Jul 10 2019 10:49 AM | Last Updated on Wed, Jul 10 2019 10:49 AM

It's Easy To Make And Edit A Will Online With Low Cost  - Sakshi

సాక్షి, పెద్దపల్లి: వీలునామా ఒక వ్యక్తి తదనంతర ఆస్తిపాస్తులను వేరొకరికి ఇవ్వడానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించిన తర్వాత ఆయన పేరిట ఉన్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహజం. కోర్టు కేసులూ మామూలే. కాస్తముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. వీలునామా రాయడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది.

కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాస్తే సరిపోదు. దీనిని రిజిస్ట్రార్‌ దగ్గర రిజిస్టర్‌ చేయాలి. అప్పుడే కోర్టుతో సహ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్‌లైన్‌లో తేలిగ్గా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

తర్వాత దాన్ని రిజిస్టర్‌ చేయడం వంటి బాధ్యతలు చేపడుతున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్‌ మినహ వీలునామాకు రూ.15వేల వరకు ఖర్చు అవుతుండగా ఆన్‌లైన్‌లో రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు అవడం గమనార్హం. 

నిజప్రతిలోనూ సవరణలు
మన చేతికొచ్చిన వీలునామా నిజప్రతిలో కూడా ఏమైనా సవరణలు అవసరమైతే సరి చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత రుసుము చెల్లించాలి. దీంతోపాటు అవసరమైన వారికి వీలునామాను రిజిస్ట్రేషన్‌ చేసే బాధ్యతను ఈ సంస్థలు తీసుకుంటాయి. 

ఇ–విల్‌ సౌకర్యం..
ఎస్‌బీఐకు చెందిన ఎస్‌బీఐ క్యాబ్‌ ట్రస్టీ కంపెనీ ఆన్‌లైన్‌ వీలునామా అందుబాటులోకి తేగా.. నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ ఈ గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్, వార్మెండ్‌ ట్రస్టీస్‌ ఎగ్జిక్యూటర్స్‌ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలు అందిస్తున్నాయి. హెచ్‌ఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ సైతం లీగల్‌ జినీ అనే సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తుంది. 

5దశల్లో పూర్తి..
– సంబంధిత వెబ్‌సైట్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న పక్షంలో ఒక లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. 
– అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్దేశించిన రుసుము చెల్లించాలి. 
– ఆ తర్వాత కుటుంబ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. 
– ఆపైన తదనంతరం మన ఆస్తులు, నగదును ఎవరికి ఎంతమేర బదలాయించాలో తెలుపుతూ సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి.
– ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్‌ నిపుణుల వద్దకు చేరుతాయి. వారు మనం ఇచ్చిన వివరాల

ఆధారంగా వీలునామా రాస్తారు. దాని చిత్తు ప్రతిని మనకు ఈ–మెయిల్‌ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైనచో వాటిని తిరిగి కంపెనీకి మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత నిజప్రతి వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ–మెయిల్‌కు లేదా మనం ఇచ్చిన చిరునామాకు 90రోజుల్లో పంపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement