‘వీలునామా రాయండి‘ అని ఎవరైనా అంటే మనస్సు చివుక్కుమంటుంది. కానీ సకాలంలో వీలునామా రాయకపోతే కుటుంబసభ్యులు చిక్కుల్లో పడతారు.. ఇబ్బందుల పారవుతారు. తగువులాడుకుంటారు.. కోర్టుకు వెళ్తారు.. మనశ్శాంతి కరువవుతుంది. బంధుత్వం మరుగునపడుతుంది. అప్పుడప్పుడు ఆస్తి అన్యాక్రాంతం కూడా అవుతుంది. అందుకే వీలునామా రాయాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వీలునామా ద్వారా వచ్చిన ఆస్తి మీద ఎటువంటి పన్ను భారం ఉండదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
- తెల్లకాగితం మీద స్పష్టంగా మీ మాతృభాషలో రాయవచ్చు.
- భాష ముఖ్యం. భావం మరీ ముఖ్యం.
- ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే రాయాలి
- స్వంతంగానే ఆలోచించినట్లు, ఎవరి ప్రోద్బలం లేదని రాయాలి
- చేతివ్రాత ఎవరిదయినా ఫరవాలేదు.
- తాను సంపాదించిన ఆస్తిని లేదా తనకు ఇదివరకు సంక్రమించిన ఆస్తినైనా వీలునామా ద్వారా ఇవ్వవచ్చు.
- ఆస్తిని స్థిరాస్తిగా, చరాస్తిగా విభజించాలి.
- స్థిరాస్తి విషయంలో జాబితా చూసుకుని .. ప్రతి ఆస్తి పూర్తి వివరాలు రాయాలి. సర్వే నంబరు, ఇంటి నంబరు, హద్దులు, కొలతలు,కొన్న డాక్యుమెంటు వివరాలు,రిజి్రస్టేషన్ వివరాలు.. ఇలా అన్నీ పొందుపర్చాలి.
- చరాస్తుల జాబితా తయారు చేసి వివరంగా ఎవరికి ఏది చెందాలనుకుంటున్నారో రాయాలి.
- గోప్యత ఉండకూడదు. స్పష్టత ముఖ్యం.
- లబ్ధిదారుల పేర్లు, వివరాలు రాయాలి. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అన్నింటికీ ఆధారం. కార్డులో ఉన్నట్లే వివరాలు రాయాలి.
- రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. కానీ వీలుంటే చేయించడం మంచిది.
- లబ్ధిదారులు సాక్షి సంతకాలు చేయకూడదు.
- లబ్ధిదారులు ఏ వయస్సు వారైనా సరే సాక్షిదార్లని మాత్రం 21 సం. దాటిన వారినే ఎంచుకోవాలి.
- లబ్ధిదారులు మైనర్ అయితే సంరక్షకులను నియమించాలి.
ఇలా ఎన్నో జాగ్రత్తలు, అవసరం అయితే వృత్తి నిపుణుల సలహా తీసుకోండి.
ఇక వీలునామాతో ప్రయోజనాలు ఎన్నో..
- వీలునామా రాసేందుకు రూపాయి ఖర్చు లేదు. ఇల్లు కదలక్కర్లేదు.
- ఆస్తి సజావుగా చేతులు మారుతుంది.
- సంక్రమించిన ఆస్తి మీద ఎలాంటి పన్ను భారం ఉండదు.
- కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉంటుంది. కలహాలకు తావుండదు.
- రాసిన వ్యక్తికి ఎంతో విలువైన మనశ్శాంతి లభిస్తుంది.
- కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
Comments
Please login to add a commentAdd a comment