Testamentary Services
-
వీలునామా రాయడం మరువకుమా..!
‘వీలునామా రాయండి‘ అని ఎవరైనా అంటే మనస్సు చివుక్కుమంటుంది. కానీ సకాలంలో వీలునామా రాయకపోతే కుటుంబసభ్యులు చిక్కుల్లో పడతారు.. ఇబ్బందుల పారవుతారు. తగువులాడుకుంటారు.. కోర్టుకు వెళ్తారు.. మనశ్శాంతి కరువవుతుంది. బంధుత్వం మరుగునపడుతుంది. అప్పుడప్పుడు ఆస్తి అన్యాక్రాంతం కూడా అవుతుంది. అందుకే వీలునామా రాయాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వీలునామా ద్వారా వచ్చిన ఆస్తి మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. తెల్లకాగితం మీద స్పష్టంగా మీ మాతృభాషలో రాయవచ్చు. భాష ముఖ్యం. భావం మరీ ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే రాయాలి స్వంతంగానే ఆలోచించినట్లు, ఎవరి ప్రోద్బలం లేదని రాయాలి చేతివ్రాత ఎవరిదయినా ఫరవాలేదు. తాను సంపాదించిన ఆస్తిని లేదా తనకు ఇదివరకు సంక్రమించిన ఆస్తినైనా వీలునామా ద్వారా ఇవ్వవచ్చు. ఆస్తిని స్థిరాస్తిగా, చరాస్తిగా విభజించాలి. స్థిరాస్తి విషయంలో జాబితా చూసుకుని .. ప్రతి ఆస్తి పూర్తి వివరాలు రాయాలి. సర్వే నంబరు, ఇంటి నంబరు, హద్దులు, కొలతలు,కొన్న డాక్యుమెంటు వివరాలు,రిజి్రస్టేషన్ వివరాలు.. ఇలా అన్నీ పొందుపర్చాలి. చరాస్తుల జాబితా తయారు చేసి వివరంగా ఎవరికి ఏది చెందాలనుకుంటున్నారో రాయాలి. గోప్యత ఉండకూడదు. స్పష్టత ముఖ్యం. లబ్ధిదారుల పేర్లు, వివరాలు రాయాలి. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అన్నింటికీ ఆధారం. కార్డులో ఉన్నట్లే వివరాలు రాయాలి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. కానీ వీలుంటే చేయించడం మంచిది. లబ్ధిదారులు సాక్షి సంతకాలు చేయకూడదు. లబ్ధిదారులు ఏ వయస్సు వారైనా సరే సాక్షిదార్లని మాత్రం 21 సం. దాటిన వారినే ఎంచుకోవాలి. లబ్ధిదారులు మైనర్ అయితే సంరక్షకులను నియమించాలి. ఇలా ఎన్నో జాగ్రత్తలు, అవసరం అయితే వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ఇక వీలునామాతో ప్రయోజనాలు ఎన్నో.. వీలునామా రాసేందుకు రూపాయి ఖర్చు లేదు. ఇల్లు కదలక్కర్లేదు. ఆస్తి సజావుగా చేతులు మారుతుంది. సంక్రమించిన ఆస్తి మీద ఎలాంటి పన్ను భారం ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉంటుంది. కలహాలకు తావుండదు. రాసిన వ్యక్తికి ఎంతో విలువైన మనశ్శాంతి లభిస్తుంది. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
‘వీలు’లేకుంటే ఆన్లైన్లో..
⇒ తక్కువ రేటుకే వీలునామా సేవలు ⇒ ఎన్ని సార్లయినా సవరించుకునే అవకాశం వీలునామా..! తన తదనంతరం తన ఆస్తిపాస్తుల్ని వేరొకరికి ఇవ్వటానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించాక తనకున్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య నావంటే నావంటూ గొడవలు తలెత్తడం కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో కోర్టు కేసులూ మామూలే. అయితే కాస్తంత ముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కాకపోతే వీలునామా రాయడానికి ఒక పద్ధతి ఉంది. కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాసినంత మాత్రాన సరిపోదు. దీన్ని రిజిష్ట్రారు దగ్గర రిజిస్టరు కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది కోర్టులతో సహా అన్నిచోట్లా చెల్లుబాటవుతుంది. అయితే ఇపుడు కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్లైన్లో కూడా ఈజీగా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తరవాత దాన్ని రిజిస్టరు చేయటం వంటి బాధ్యతలన్నీ తామే తీసుకుంటున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ మినహా ఈ వీలునామాకు రూ.15 వేల వరకూ అవుతుండగా... ఆన్లైన్లో రూ.4-5 వేలకే పూర్తవుతుండటం గమనార్హం. ఈ-విల్ సౌకర్యం ఏ సంస్థలు ప్రవేశపెట్టాయి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ ఈ ఆన్లైన్ వీలునామాను అందుబాటులోకి తేగా... నేషనల్ సెక్యూరిటీస్ డి పాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వార్మండ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటర్స్ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సంస్థ కూడా లీగల్ జినీ అనే సంస్థతో కలసి ఈ సేవలు అందిస్తోంది. ezeewill.com, willjini.com, www.hdfcsec.com/-EWi వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో వీలునామాను రూపొందించుకోవచ్చు. దీనికోసం ఈ సంస్థలు దాదాపు రూ.4 వేల ఫీజును వసూలు చేస్తున్నాయి. ఐదు దశల్లోనే పూర్తి... 1. సంబంధిత వెబ్సైట్లకు వెళ్లి మన పూర్తి వివరాలను నమోదు చే సుకున్న పక్షంలో ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. 2. అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్ధేశించిన ఫీజును చెల్లించాలి. 3. ఆ తర్వాత కుటుంబ, ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. 4. ఆపైన మన తదనంతరం మన ఆస్తులను, నగదును ఎవరికి ఎంత మేర బదలాయించాలో తెలుపుతూ.. సంబంధిత వ్యక్తుల పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 5. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్ నిపుణుల వద్దకు చేరతాయి. వారు మనం ఇచ్చిన వివరాల ఆధారంగా వీలునామాను రాస్తారు. దాని రఫ్ కాపీని మనకు ఈ-మెయిల్ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైన పక్షంలో చేసి వాటిని తిరిగి కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత ఒరిజినల్ వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ-మెయిల్‌కు కానీ, మనం ఇచ్చిన చిరునామాకు గానీ 60 రోజుల్లో పంపిస్తారు. ఒరిజినల్‌లోనూ సవరణలు.. ఒకవేళ మన చేతికొచ్చిన ఒరిజినల్ వీలునామా కాపీలో కూడా ఏమైనా సవరణలు అవసరమైన పక్షంలో చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు అవసరమైనవారికి వీలునామాను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను కూడా ఈ సంస్థలు తీసుకుంటున్నాయి.