మల్లయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ లింగయ్య
యాచారం: భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. తమ్మలోనిగూడకి చెందిన కర్రె మల్లయ్య(75)కు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం ఎకరా భూమిని విక్రయించి కొడుకు వెంకటయ్యకు రూ.30 లక్షలు, కూతురు సుగుణమ్మకు రూ.30 లక్షలు ఇచ్చాడు.
మిగిలిన ఎకరా పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని వెంకటయ్య, భార్య మంగమ్మతో కలిసి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారు. తన ప్రాణం పోయేంత వరకు భూమిని ఇచ్చేది లేదని మల్లయ్య తేల్చి చెప్పాడు. దీంతో తండ్రిని మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్యాభర్తలు కలిసి మల్లయ్య మొహంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చంపేశారు.
ఆదివారం తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు ‘అయ్యో.. మా నాన్న చనిపోయాడు’అంటూ విలపించాడు. తండ్రీకొడుకుల మధ్య భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిన గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంకటయ్యను చితకబాదారు. పోలీసులు విచారించగా భూమి కోసం తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment