కరీంనగర్: కన్న కొడుకే కాలయముడయ్యాడు. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లి తమ్మనవేణి కనుకవ్వ(60)ను భూమికోసం దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తమ్మనవేణి కనుకవ్వ(60)కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు వినోద్ ఉన్నాడు.
భర్త గతంలోనే చనిపోవడంతో అన్నీతానై పిల్లలను సాకి ప్రయోజకులను చేసింది. కూతుళ్లు, కుమారుడి వివాహలు చేసింది. భర్త తరఫున వచ్చిన ఎకరం భూమిని తన కొడుకు వినోద్ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. తనతల్లిగారి తరఫున వచ్చిన రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్నకూతురుతో కలిసి ఉంటోంది. కొద్దిరోజులుగా తల్లిగారిల్లు రేణికుంటలో ఒక్కతే అద్దెకు ఉంటోంది.
రెండెకరాలపై కన్నేసిన కొడుకు..
తండ్రి తరఫున వచ్చిన ఎకరం తీసుకున్న కొడుకు వినోద్.. కనుకవ్వ పుట్టింటివారు ఇచ్చిన భూమి కూడా తనకే కావాలని రెండేళ్లుగా గొడవ పడుతున్నాడు. అది కూతుళ్లకు ఇస్తుందనే అనుమానంతో గతేడాది పంటలు వేయకుండా అడ్డుకున్నాడు. అయినా తల్లి భూమి రిజిస్ట్రేషన్ చేయలదు. దీంతో ఈ ఏడాది బలవంతంగా భూమి లాక్కుని, కౌలుకు ఇచ్చాడు. దీంతో గొడవలు పెద్దవయ్యాయి.
గండ్లు పూడ్చేందుకు వెళ్లి..
ఇటీవల కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో జంగపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో గండ్లుపడ్డాయి. వాటిని పూడ్చేందుకు వినోద్ బుధవారం ఉదయం వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కనుకవ్వ కూడా పొలం వద్దకు వెళ్లింది. తన భూమిలో ఎందుకు సాగు చేస్తున్నావని కొడుకును అడిగింది.
ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆవేశానికి లోనైన వినోద్.. తన చేతిలోని పారతో తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో కనుకవ్వ తీవ్రగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. కూతుళ్లు ఇచ్చిన సమాచారం మేరకు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎల్‌ఎండీ, గన్నేరువరం ఎస్సైలు ప్రమోద్‌రెడ్డి, నర్సింహారావు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment