
సాక్షి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.
కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చు
జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు (శుక్రవారం) విశ్లేషించనున్నారు.
బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్‌ఫోర్స్‌మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.
సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్‌లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.
సొరంగం ఇన్‌లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్‌తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment