
సాక్షి, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు. ప్రమాద స్థలానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు.
టన్నెల్లో మరోచోట ఏడు మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన నాలుగు మృతదేహాలు తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ బృందాలు చెబుతున్నాయి. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా చేశారు. ఇక, ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
నలుగురి ఆనవాళ్లు దొరికినా..
టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనక భాగంలో 4 మీటర్ల మట్టి కింద నలుగురు, ముందు భాగంలో రెండు చోట్ల ఏడు మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సిమెంట్, నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్‌గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్‌తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.

సమస్యగా మారిన బురద, ఊట నీరు..
టన్నెల్ లోపల 13.50 కి.మీ దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజ్మెంట్, బార్డర్రోడ్ ఆర్గనైజషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగేయడానికి కూడా వీలు కావడం లేదని చెబుతున్నారు. టన్నెల్లోపల13 కి.మీ వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్‌లో వేసి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment