బురద నీటి నుంచీ తాగునీటి వరద | Flooding of drinking water from muddy water | Sakshi
Sakshi News home page

బురద నీటి నుంచీ తాగునీటి వరద

Published Wed, May 5 2021 3:09 AM | Last Updated on Wed, May 5 2021 9:16 AM

Flooding of drinking water from muddy water - Sakshi

బురద నీటిని తాగునీటిగా శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నమూనా

సాక్షి, అమరావతి: బురద నీటిని సైతం అంతర్జాతీయ ప్రమాణాల (ఐఎస్‌వో 10500) స్థాయిలో శుద్ధి చేసి తాగునీటిగా అందించే ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) సొంతం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో సాగునీటి కాలువల ద్వారా పారే నీరు బురదమయంగా మారుతుండటంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తోంది. తద్వారా ఐఎస్‌వో స్థాయికి శుద్ధి చేసిన నీటిని మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఉపక్రమించారు. 

కాలువల్లో ఎక్కువ రోజులు బురద నీరే 
ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పలు మంచినీటి పథకాలకు సాగునీటి కాలువల ద్వారా నీటిని సేకరిస్తారు. అయితే, నీరు ఏడాదిలో ఎక్కువ రోజులు బురదమయంగా ఉంటోంది. వర్షాకాలంలో తరుచూ కురిసే వర్షాల వల్ల, ఎండకాలంలో స్టోరేజీ ట్యాంకులో నిల్వ ఉంచిన నీరు అడుగంటిన సమయంలో బురదమయంగా మారుతోంది. మంచినీటి పథకాల వద్దకు వచ్చి చేరే ఆ బురద నీటిని సాధారణ పద్ధతులలో శుద్ధిచేసి తాగు నీటిగా అందిస్తున్నారు.

స్థానికులు ఆ నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి. అక్కడి గ్రామాల్లో అవసరమైన స్థాయిలో మంచినీటి పథకాలు, నీరు అందుబాటులో ఉంటున్నా గత 10–12 ఏళ్లుగా ఆ జిల్లాల్లోని వందలాది గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసే ముందు ఫిల్టర్‌ బెడ్‌ విధానంలో నీటిని శుద్ధి చేస్తారు. కంకర, ఇసుక పొరలతో ఏర్పాటు చేసిన ఫిల్టర్‌ బెడ్‌లలో నీటిని ఇంకించి.. ఆ తర్వాత బ్లీచింగ్‌ కలిపి ఆ నీటిని సరఫరా చేస్తున్నారు.

ఈ విధానంలో వంద లీటర్ల నీటిని ఫిల్టర్‌ బెడ్‌లోకి పంపితే, తిరిగి దాదాపు అదే స్థాయిలో నీరు తిరిగి అందుబాటులోకి రావాలి. కానీ.. బురద నీటిని నేరుగా పిల్టర్‌ బెడ్‌లోకి పంపినప్పుడు.. 60–70 శాతం నీరు ఇంకిన తర్వాత ఫిల్టర్‌ బెడ్‌లో ఉండే ఇసుక పొరపై బురద పేరుకపోయి మిగిలిన నీరు ఇంకే పరిస్థితి ఉండదు. దీంతో ఆ ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా ఇంకే నీరు ఒక రకమైన వాసన వస్తోంది. ఫిల్టర్‌ బెడ్‌లో ఇసుక పొరపై పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తే గానీ ఆ మంచినీటి పథకం పనిచేయని పరిస్థితి. ఇదే సమయంలో ఫిల్టర్‌ బెడ్‌లోని ఇసుక, కంకర పొరలను తరుచూ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా వ్యయంతో కూడిన వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో వాటిని బాగు చేయించే పరిస్థితి లేక పథకాలు వృథాగా ఉండాల్సి వచ్చేవి. 

ప్రీ ట్రీట్‌మెంట్‌ పద్ధతి విజయవంతం కావడంతో.. 
సాగునీటి కాలువల ద్వారా వచ్చే బురద నీటి శుద్ధికి మంచినీటి పథకాల వద్ద కొత్త టెక్నాలజీతో కూడిన ప్రీ ట్రీట్‌మెంట్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంచినీటి పథకాల వద్ద ఉండే స్లో శాండ్‌ ఫిల్టర్లకు ముందే ఫ్యాకులేటర్, ట్యూబ్‌ సెట్లెర్‌లను రెండు వేర్వేరు విభాగాలతో అనుసంధానం చేయడం ద్వారా బురద నీటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని శాండ్‌ ఫిల్టర్‌ బెడ్‌ పైకి పంపడం వల్ల ఐఎస్‌వో స్థాయి మేరకు పరిశుభ్రమైన తాగునీటిగా శుద్ధి అవుతుంది. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి సఫలం కావడంతో.. గోదావరి జిల్లాల్లో సమస్య ఉన్న ప్రతిచోట ఈ విధానం ద్వారా బురద నీటి శుద్ధి ప్రక్రియను కొత్తగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.   

రూ.88.60 కోట్లతో.. 
గోదావరి జిల్లాల్లో బురద నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ విధానంలో నీటిని శుద్ధి చేసిన తర్వాతే మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రూ.88.60 కోట్లతో తూర్పు గోదావరి జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 276 మంచినీటి పథకాల వద్ద ప్రీ ట్రీట్‌మెంట్‌ యూనిట్స్‌ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతి రాగానే పనులు చేపడతామని ఆర్‌డబ్ల్యూఎస్‌ సీఈ పి.సంజీవరావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement