iso
-
IWF: అబుదాబిలో వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే - ఫోటోలు
ఇండియా సోషల్ సెంటర్ (ISC ) అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక సంక్షేమ కేంద్రంగా గత 56 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. ఆ సంఘం మహిళా విభాగం 'ఇండియన్ ఉమెన్ ఫోరమ్' (IWF) మహిళా సాధికారత సధించే విషయంలో ముందంజలో ఉంది. సంవత్సరాంతం IWF సంస్థ మహిళలే ప్రాధాన్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. IWF వారు 2022 - 2023 సంవత్సరం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ISC ముఖ్య ప్రాంగణంలో గత శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయానికి చెందిన డీసీఎం భార్య జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఇండియా సోషల్ సంటర్ యాజమాన్యం కూడా ఇతర అతిథిలుగా రావడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రవాసీ భారతీయులు ఎంతో ఉత్సాహంతో భారతీయత ఉట్టిపడేలా కథక్, భరత నాట్యం , కూచిపూడి ప్రదర్శించారు. అంతే కాకుండా మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన 'యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్'తో చేసిన 29 రాష్ట్రాల వేషధారణ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని కార్య నిర్వాహకులు షీలా మీనన్, పావని ఐత, ఐనీష్, అనూజ, శిల్ప, దీప తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెప్రెజెంట్ చేస్తూ వచ్చిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బ్రతుకమ్మ విశేష ఆకర్షణగా నిలిచాయి. 2022-23 సంవత్సరం IWF కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించినందుకు ముఖ్య కార్యకర్తలకు ముఖ్య అతిధి జాహ్నవి జ్ఞాపికలను అందించారు. అంతే కాకుండా కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కరికి యాజమాన్యం బహుమతులు అందించింది. -
బురద నీటి నుంచీ తాగునీటి వరద
సాక్షి, అమరావతి: బురద నీటిని సైతం అంతర్జాతీయ ప్రమాణాల (ఐఎస్వో 10500) స్థాయిలో శుద్ధి చేసి తాగునీటిగా అందించే ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సొంతం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో సాగునీటి కాలువల ద్వారా పారే నీరు బురదమయంగా మారుతుండటంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తోంది. తద్వారా ఐఎస్వో స్థాయికి శుద్ధి చేసిన నీటిని మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉపక్రమించారు. కాలువల్లో ఎక్కువ రోజులు బురద నీరే ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పలు మంచినీటి పథకాలకు సాగునీటి కాలువల ద్వారా నీటిని సేకరిస్తారు. అయితే, నీరు ఏడాదిలో ఎక్కువ రోజులు బురదమయంగా ఉంటోంది. వర్షాకాలంలో తరుచూ కురిసే వర్షాల వల్ల, ఎండకాలంలో స్టోరేజీ ట్యాంకులో నిల్వ ఉంచిన నీరు అడుగంటిన సమయంలో బురదమయంగా మారుతోంది. మంచినీటి పథకాల వద్దకు వచ్చి చేరే ఆ బురద నీటిని సాధారణ పద్ధతులలో శుద్ధిచేసి తాగు నీటిగా అందిస్తున్నారు. స్థానికులు ఆ నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి. అక్కడి గ్రామాల్లో అవసరమైన స్థాయిలో మంచినీటి పథకాలు, నీరు అందుబాటులో ఉంటున్నా గత 10–12 ఏళ్లుగా ఆ జిల్లాల్లోని వందలాది గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసే ముందు ఫిల్టర్ బెడ్ విధానంలో నీటిని శుద్ధి చేస్తారు. కంకర, ఇసుక పొరలతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్లలో నీటిని ఇంకించి.. ఆ తర్వాత బ్లీచింగ్ కలిపి ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విధానంలో వంద లీటర్ల నీటిని ఫిల్టర్ బెడ్‌లోకి పంపితే, తిరిగి దాదాపు అదే స్థాయిలో నీరు తిరిగి అందుబాటులోకి రావాలి. కానీ.. బురద నీటిని నేరుగా పిల్టర్ బెడ్‌లోకి పంపినప్పుడు.. 60–70 శాతం నీరు ఇంకిన తర్వాత ఫిల్టర్ బెడ్లో ఉండే ఇసుక పొరపై బురద పేరుకపోయి మిగిలిన నీరు ఇంకే పరిస్థితి ఉండదు. దీంతో ఆ ఫిల్టర్ బెడ్ల ద్వారా ఇంకే నీరు ఒక రకమైన వాసన వస్తోంది. ఫిల్టర్ బెడ్లో ఇసుక పొరపై పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తే గానీ ఆ మంచినీటి పథకం పనిచేయని పరిస్థితి. ఇదే సమయంలో ఫిల్టర్ బెడ్లోని ఇసుక, కంకర పొరలను తరుచూ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా వ్యయంతో కూడిన వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో వాటిని బాగు చేయించే పరిస్థితి లేక పథకాలు వృథాగా ఉండాల్సి వచ్చేవి. ప్రీ ట్రీట్మెంట్ పద్ధతి విజయవంతం కావడంతో.. సాగునీటి కాలువల ద్వారా వచ్చే బురద నీటి శుద్ధికి మంచినీటి పథకాల వద్ద కొత్త టెక్నాలజీతో కూడిన ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంచినీటి పథకాల వద్ద ఉండే స్లో శాండ్ ఫిల్టర్లకు ముందే ఫ్యాకులేటర్, ట్యూబ్ సెట్లెర్‌లను రెండు వేర్వేరు విభాగాలతో అనుసంధానం చేయడం ద్వారా బురద నీటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని శాండ్ ఫిల్టర్ బెడ్ పైకి పంపడం వల్ల ఐఎస్వో స్థాయి మేరకు పరిశుభ్రమైన తాగునీటిగా శుద్ధి అవుతుంది. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి సఫలం కావడంతో.. గోదావరి జిల్లాల్లో సమస్య ఉన్న ప్రతిచోట ఈ విధానం ద్వారా బురద నీటి శుద్ధి ప్రక్రియను కొత్తగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రూ.88.60 కోట్లతో.. గోదావరి జిల్లాల్లో బురద నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ విధానంలో నీటిని శుద్ధి చేసిన తర్వాతే మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రూ.88.60 కోట్లతో తూర్పు గోదావరి జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 276 మంచినీటి పథకాల వద్ద ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతి రాగానే పనులు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ సీఈ పి.సంజీవరావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్ఓ గుర్తింపు
సాక్షి, విజయనగరం: పరిశుభ్రత విషయంలో విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్ఓ గుర్తింపు రావడం ఆనందదాయకమని ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్‌కుమార్ శ్రీవాస్తవ (విశాఖ) పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు రావడంతో అందరిపైనా బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సంపాదించుకుంటున్నామంటే సిబ్బంది పనితీరే నిదర్శనమన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ కష్టపడి రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. పాలిథిన్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు. కాగితపు సంచులకే ప్రాధాన్యతనిచ్చే విధంగా చూడాలన్నారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐఎస్ఓ సర్టిఫికెట్ ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఏడు రైల్వేస్టేషన్లకు వచ్చిందన్నారు. అందులో బెస్ట్ విజయనగరమన్నారు. అనంతరం సర్టిఫికెట్‌ను రైల్వేస్టేషన్ మేనేజరు జగదీశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు అక్షయ్ సక్సేనా, పి.రామచంద్రరావు, సీనియర్ డీఈఎన్ అశోక్‌కుమార్, కెవి.నరసింహారావు, సీనియర్ డీసీఎం సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే పరిసరాల్లో స్వచ్ఛభారత్ పరిశుభ్రత విషయంలో ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో ముందుగా ప్రయాణికులకు కాగితపు, గుడ్డ సంచులను అందజేసి, ప్లాస్టిక్ సంచులను వాడొద్దని అవగాహన కల్పించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉన్న చెత్తా, చెదారాలను స్వయంగా ఎత్తి, అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిని కలిగించారు. అనంతరం కమర్షియల్ విభాగం కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
తొలుత అనుమతి.. తర్వాత నిరాకరణ
కేయూలో చెట్టు కిందే మాట్లాడిన కోదండరాం కేయూ క్యాంపస్: కాక తీయ యూనివర్సిటీ లో ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనై జేషన్ (ఐఎస్ వో)మ ఆధ్వర్యంలో శని వారం ‘రిజెక్టింగ్ విక్టిమ్ హుడ్, రిక్లైమింగ్ డిగ్నిటీ ఆఫ్ అగనెస్ట్ హేట్’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశ నిర్వాహణకు అధికారులు తొలుత అనుమతి ఇచ్చి తర్వాత నిరాకరించారు. సమావేశానికి వచ్చిన జేఏసీ చైర్మన్ కోదండరాం తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా పలువురు ఆపి ఇక్కడే మాట్లాడాలని పట్టుబట్టారు. ఆయనను చెట్టు కిందకు తీసుకొచ్చి గొడుగు పట్టారు. అందరికీ సమాన విలువలు అందించేలా రాజ్యాంగాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. హ్యూమన్ డిగ్నిటీపై చర్చిం చేందుకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. -
నాణ్యతలో ‘సురుచి’కి ఐఎస్ఓ అవార్డు
తాపేశ్వరం (మండపేట) : అతిపెద్ద లడ్డూ తయారీతో సరికొత్త గిన్నీస్ రికార్డు నెలకొల్పిన తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా ఐండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. నాణ్యత కలిగిన పిండి వంటల తయారీ ద్వారా రెండేళ్ల క్రితమే సురుచి సంస్థకు ఈ సర్టిఫికెట్ దక్కించుకుంది. తాజాగా విజయవాడలో శనివారం రాత్రి ఐఎస్ఓ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రెండవసారి సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఐఎస్ఓ సంస్థకు సంబం«ధించిన ప్రతిష్టాత్మకమైన హెచ్ఐఎం అవార్డును అందుకున్నారు. డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాధరెడ్డి చేతులమీదుగా మల్లిబాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ తమ సంస్థకు నాణ్యతలో ప్రతిష్టాత్మమైన హెచ్ఐఎం సర్టిఫికెట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూకి ఐఎస్వో సర్టిఫికెట్
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. బుధవారం సాయంత్రం యూనివర్సిటీలో జరిగిన విలేకర్ల సమావేశంలో వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఈవిషయం వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ గుర్తింపు కమిటీ సభ్యులు ఏఎన్‌యూని సందర్శించి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న ప్రమాణాలను అధ్యయనం చేశారని వీసీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా సంస్థల నాణ్యతా ప్రమాణాలను అధ్యయనం చేసి సర్టిఫికెట్‌ను జారీ చేసే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల అనుబంధ సంస్థ అయిన భారత దేశపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ అధారిటీ సంస్థ టీఎన్వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేసిందన్నారు. టీఎన్వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రగ్యేష్ కుమార్ సింగ్ సర్టిఫికెట్‌ను ఏఎన్‌యూకి జారీ చేశారని తెలిపారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, ఆర్ట్స్, సైన్స్ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్ విజయరాజు, ఆచార్య బి విక్టర్‌బాబు తదితరులు ఈసందర్భంగా వీసీకి అభినందనలు తెలిపారు. -
డీఎల్ఎఫ్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్
ఈ ఘనత సాధించిన తొలి భారత రియల్టీ కంపెనీ... న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం, డీఎల్ఎఫ్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది. హౌజింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లను తగిన నాణ్యతతో సకాలంలో డెవలప్ చేస్తున్నందుకు డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్‌కు ఐఎస్ఓ 9001:2008 క్వాలిటీ సర్టిఫికేషన్ లభించిందని డీఎల్ఎఫ్ సోమవారం తెలిపింది. బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ (బీఎస్ఐ) కఠిన నిబంధనలను అందుకోగలిగామని, అందుకే తమకు ఈ సర్టిఫికేషన్ లభించిందని పేర్కొంది. నిర్మాణంలో నాణ్యతను పాటించడం, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం, వినియోగదారుల సంతృప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బీఎస్ఐ ఈ సర్టిఫికెట్‌ను అందించిందని వివరించింది. తమ సేవల ప్రమాణాలకు, నిర్మాణ నాణ్యతకు ఈ సర్టిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తోందని వివరించింది. ఈ సర్టిఫికెట్ తమకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుందని, మరింత నాణ్యత గల సేవలను అందిస్తామని పేర్కొంది. డీఎల్ఎఫ్ 15 రాష్ట్రాల్లో 24 నగరాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. 31.4 కోట్ల చదరపుటడుగుల రియల్టీ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం 5.2 కోట్ల చదరపుటడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.