డీఎల్‌ఎఫ్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్
ఈ ఘనత సాధించిన తొలి భారత రియల్టీ కంపెనీ...
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ లభించింది. హౌజింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లను తగిన నాణ్యతతో సకాలంలో డెవలప్ చేస్తున్నందుకు డీఎల్‌ఎఫ్ హోమ్ డెవలపర్స్‌కు ఐఎస్‌ఓ 9001:2008 క్వాలిటీ సర్టిఫికేషన్ లభించిందని డీఎల్‌ఎఫ్ సోమవారం తెలిపింది. బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎస్‌ఐ) కఠిన నిబంధనలను అందుకోగలిగామని, అందుకే తమకు ఈ సర్టిఫికేషన్ లభించిందని పేర్కొంది.
నిర్మాణంలో నాణ్యతను పాటించడం, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం, వినియోగదారుల సంతృప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బీఎస్‌ఐ ఈ సర్టిఫికెట్‌ను అందించిందని వివరించింది. తమ సేవల ప్రమాణాలకు, నిర్మాణ నాణ్యతకు ఈ సర్టిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తోందని వివరించింది. ఈ సర్టిఫికెట్ తమకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుందని, మరింత నాణ్యత గల సేవలను అందిస్తామని పేర్కొంది. డీఎల్‌ఎఫ్ 15 రాష్ట్రాల్లో 24 నగరాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. 31.4 కోట్ల చదరపుటడుగుల రియల్టీ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం 5.2 కోట్ల చదరపుటడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.