నాణ్యతలో ‘సురుచి’కి ఐఎస్‌ఓ అవార్డు
తాపేశ్వరం (మండపేట) : అతిపెద్ద లడ్డూ తయారీతో సరికొత్త గిన్నీస్ రికార్డు నెలకొల్పిన తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా ఐండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. నాణ్యత కలిగిన పిండి వంటల తయారీ ద్వారా రెండేళ్ల క్రితమే సురుచి సంస్థకు ఈ సర్టిఫికెట్ దక్కించుకుంది. తాజాగా విజయవాడలో శనివారం రాత్రి ఐఎస్‌ఓ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రెండవసారి సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఐఎస్‌ఓ సంస్థకు సంబం«ధించిన ప్రతిష్టాత్మకమైన హెచ్‌ఐఎం అవార్డును అందుకున్నారు. డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాధరెడ్డి చేతులమీదుగా మల్లిబాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ తమ సంస్థకు నాణ్యతలో ప్రతిష్టాత్మమైన హెచ్‌ఐఎం సర్టిఫికెట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఐఎస్‌ఓ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.