
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు సొంతం
లిమా (పెరూ): గతవారం అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్ పిస్టల్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ అదే జోరును పెరూలో పునరావృతం చేసింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ రెండో టోర్నమెంట్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల సురుచి 24 గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ మనూ భాకర్ రజత పతకంతో సంతృప్తి పడింది. మనూ భాకర్ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 34 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సురుచి 582 పాయింట్లతో రెండో స్థానంలో, మనూ భాకర్ 578 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.
బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ సురుచి గరి అదిరింది. ఈ ఈవెంట్ ఫైనల్లో సురుచి–సౌరభ్ చౌధరీ (భారత్) ద్వయం విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో సురుచి–సౌరభ్ జోడీ 17–9తో కియాన్‌జున్ యావో–కాయ్ హు (చైనా) జంటను ఓడించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ భాకర్–రవీందర్ సింగ్ (భారత్) జోడీ 6–16తో కియాన్‌కె మా–యిఫాన్ జాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది.