పాలమూరును నాశనం చేశారు
చంద్రబాబుపై మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన పాలమూరు జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని మరింత నాశనం చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ , గువ్వల బాలరాజుతో కలసి గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజే సీఎం కేసీఆర్ పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పాలమూరు ప్రజల జీవితాలు బాగుపడుతుంటే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు అభివృద్ధికి పార్టీలకతీతంగా రాజకీయనేతలంతా కలసిరావాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో బుధవారం జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి సీఎం కేసీఆర్ ధీటుగా మాట్లాడారన్నారు. పాలమూరు ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అపెక్స్ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీని టీటీడీపీ నేతలు ఇప్పటికైనా వదిలేయాలని మంత్రి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
చంద్రబాబు కపటబుద్ధి బయటపడింది: ఎమ్మెల్యే శ్రీనివాస్
బాబుకు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికావడం ఇష్టం లేదని, ఢిల్లీలో బాబు కపట బుద్ధి బయట పడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఏపీ సర్కారు ఇప్పుడు పాలమూరుపై విషం కక్కుతోందన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు విషయంలో కమిటీని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తుంటే టీటీడీపీ నేతలు నోరు మెదపలేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేత డీకే అరుణ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.