సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తన వాదన వినిపించినట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఆయన అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
(చదవండి: బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం)
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ విమానాశ‍్రయానికి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment