apex council meeting
-
ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్‌కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్‌లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్లను అప్పగించాల్సిందే: కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్‌కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్‌లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు. -
Water Dispute: సగం వాటాపై కొట్లాడదాం..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పెంచుకునే అవకాశాలపై దృష్టి సారిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డుల పరిధిని ఖరారు చేశామని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో అదే చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ విచారణకు పట్టుబట్టేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా కేంద్రానికి లేఖ రాయా లని భావిస్తోంది. అదే సమయంలో రాజ కీయంగా కూడా ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికను రూపొందిస్తోంది. అయితే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తుది తీర్పు వెలువడేందుకు ఏళ్ల తరబడి సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా, అప్పటిలోగా, ప్రస్తుతం 66:34 శాతంగా ఉన్న నీటి వాటాల నిష్పత్తిని 50:50 శాతంగా మార్చేలా కేంద్రంపై పోరాడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ అంశంపై అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ సోమ వారం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. పునఃపంపిణీపై ఒత్తిడి పెంచాలి కేంద్రం వెలువరించిన గెజిట్ తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నా న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదెలా ఉన్నా తొలుత చట్ట ప్రకారం వాటాలు పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కృష్ణా జలాల్లో ఏ లెక్కన చూసినా తమ వాటాలు పెరగాలని తెలంగాణ తొలి నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతంలో 68.5 శాతం రాష్ట్రానిదే అయినా.. నీటి కేటాయింపులు మాత్రం 37 శాతమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కృష్ణా పరివాహకం కింద సాగు యోగ్య భూమి తెలంగాణలో 37.11లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉందని చెబుతోంది. ఈ లెక్కన రాష్ట్రానికి 811 టీఎంసీల్లో కనీసంగా 560 టీఎంసీలు దక్కాలని అంటోంది. ఈ అంశాలన్నీ అనేకమార్లు కేంద్రం దృష్టికి తెచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ప్రస్తావించగా.. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటే న్యాయసలహా తీసుకొని కొత్త ట్రిబ్యునల్‌పై ఆలోచన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పిటిషన్ విత్‌డ్రా చేసుకుంది. తాజాగా కేంద్రం గెజిట్ వెలువరించిన నేపథ్యంలో నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. సోమవారం జరిగిన సమీక్షలో కూడా తెలంగాణకు వాటాలు పెరిగేలా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. దీంతో పాటే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించి, వాటికి అనుమతులు పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేయడంపై భేటీలో చర్చించారు. ఎలా చూసినా రాష్ట్ర వాటా పెరగాలి: రజత్‌కుమార్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ చెప్పారు. ఇంజనీర్లతో సమీక్షకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరివాహకం, ఆయకట్టు, జనాభా.. ఏ లెక్కన చూసినా తెలంగాణకు 811 టీఎంసీల్లో 560 టీఎంసీలు దక్కాలి. అయితే తాత్కాలికంగా అయినా ఏపీ, తెలంగాణకు చెరిసగం నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. అపెక్స్ కౌన్సిల్లో చెప్పిన మేరకు, సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు తేల్చాలి..’ అని ఆయన అన్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌తో న్యాయపరంగా, సాంకేతికంగా, పాలనా పరంగా ఏర్పడే ఇబ్బందులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే 2014కు ముందు చేపట్టిన దేవాదుల వంటి ప్రాజెక్టులకు డీపీఆర్‌లు కోరడంపైనే అభ్యంతరాలున్నాయని చెప్పారు. -
కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పునర్వి భజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా బోర్డు అధికారిక పరిధికి సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖ అందించిన ముసాయిదా నోటిఫికేషన్‌కు ఓకే చెప్పిన కేంద్ర హోంశాఖ, దీనికి సంబందించి అధికారిక నోటిఫికే షన్ను త్వరగా విడు దల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయించే అధికారిక నోటిఫికేషన్‌ను ఉగాది తర్వాత ఏ క్షణమైనా కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారి పరిధిని నోటిఫై చేస్తే కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులందరూ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నారు. తెలంగాణ వ్యతిరేకిస్తున్నా.. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే బోర్డు పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డు చేసేదేమీ లేక చేతులెత్తే స్తోంది. రాష్ట్రాల మధ్య తరుచూ తలెత్తుతున్న వివాదాలకు పరిష్కారం దొరకాలంటే ప్రాజెక్టులపై అజమాయిషీ తమకే ఇవ్వాలని బోర్డు కోరుతోంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ, ఏపీల నియంత్రణలోని ప్రాజెక్టులు, ఇప్పటికే చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్ధం చేసి ఇరు రాష్ట్రాలకు పంపింది. గతంలో వెలువరించిన ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల విద్యుదుత్పత్తిని సైతం తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఆరేళ్లుగా ఈ నోటిఫికేషన్‌పై బోర్డుకు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా ఎటూ తేలడం లేదు. అపెక్స్ భేటీల్లో కేసీఆర్ ఆక్షేపణ... బేసిన్‌లోని ప్రాజెక్టులకు బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్ కౌన్సిల్ భేటీల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలని తేల్చిచెప్పారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలని సూచించారు. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వస్తోంది. అయితే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ భేటీలో బోర్డు పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఉగాది తర్వాత ఉత్తర్వులు... షెకావత్ ప్రకటన అనంతరం అప్పటికే రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను నోటిఫై చేసేందుకు కేంద్రానికి పంపింది. అయితే వివిధ కారణాల వల్ల దీనిపై చర్చించలేకపోయిన కేంద్రం మూడ్రోజుల కింద దీనిపై వరుస భేటీలు నిర్వహించింది. మొదట కృష్ణా బోర్డు ఛైర్మన్ పరమేశం, సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేతో చర్చించిన కేంద్ర జల్‌శక్తి శాఖ అనంతరం శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మరోమారు దీనిపై చర్చించింది. ఇప్పటికే బోర్డు పరిధిని నోటిఫై చేయడంలో ఆలస్యం జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అమిత్ షా, దీనిపై త్వరగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత కృష్ణా బోర్డు అధికార పరిధికి సంబంధించి ఉత్తర్వులు రానున్నాయి. బోర్డు పరిధిలో ఉండే ప్రాజెక్టులు ఇవే బోర్డు పరిధి నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి. -
ఇక బోర్డే బాస్!
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి జవసత్వాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బోర్డు పరిధి, కార్య నిర్వాహక నియమావళి (వర్కింగ్ మాన్యువల్)ను తక్షణమే ఖరారు చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్ మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన ఆరున్నరేళ్ల తర్వాత పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయడం ద్వారా బోర్డుకు పూర్తి స్థాయిలో అధికారాలను కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధం కావడం గమనార్హం. కృష్ణా జలాల పంపిణీ, వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని విభజన చట్టం సెక్షన్-85లో కేంద్రం పేర్కొంది. ఆ మేరకు కృష్ణా బోర్డును ఏర్పాటు చేస్తూ 2014 మే 28న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లో అదనపు కార్యదర్శి స్థాయి అధికారిని బోర్డు చైర్మన్‌గానూ, సీఈ స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగానూ, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ఇంజనీర్- ఇన్-చీఫ్‌లను సభ్యులుగా, జలవిద్యుత్ నిపుణుడిని బోర్డు సభ్యుడిగా నియమించాలని అందులో పేర్కొన్నారు. అయితే విభజన చట్టం సెక్షన్-85(2)కు విరుద్ధంగా కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. వివాదాలు ఇలా... కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి (కేడబ్ల్యూడీటీ)-2 తీర్పును కేంద్రం నోటిఫై చేసే వరకూ బోర్డు పరిధిని ఖరారు చేయరాదని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తుండటంతో ఇప్పటిదాకా పరిధిని ఖరారు చేయలేదు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణకు కేంద్రం అప్పగించింది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ తన అధీనంలోకే తీసుకోవడం వివాదాలకు దారి తీసింది. నీటి వాటాల కేటాయింపు... ఉమ్మడి రాష్ట్రంలో నైసర్గిక స్వరూపం ఆధారంగా కేడబ్ల్యూడీటీ-1 ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం కేడబ్ల్యూడీటీ-2 గడువును కేంద్రం పొడిగించింది. ఆ తీర్పు వెలువడే వరకూ కేడబ్ల్యూడీటీ-1 తీర్పు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీల నిష్పత్తిలో వాటాలను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుల మేరకు నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును నిర్దేశించింది. ఇన్నాళ్లూ అధికారాలు లేకపోవడంతో... - పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయకపోవడంతో బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. - నీటి కేటాయింపులు చేస్తూ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కిన రాష్ట్రంపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. - బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు నీటిని తరలించడం.. సాగర్ కుడి, ఎడమ కాలువలకు కేటాయించిన నీటిని విడుదల చేయకుండా మోకాలడ్డటం ద్వారా ఏపీ ప్రయోజనాలను తెలంగాణ దెబ్బతీస్తూ వస్తోంది. - విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీల పరిశీలనకు డీపీఆర్‌లను పంపకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, ఎత్తిపోతలను తెలంగాణ సర్కారు కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ సామర్థ్యాలను పెంచింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసినా బోర్డు చర్యలు తీసుకోలేకపోయింది. బోర్డు అధీనంలోకి శ్రీశైలం, సాగర్.. తమ ప్రయోజనాలకు తెలంగాణ విఘాతం కలిగిస్తున్నందున బోర్డు పరిధిని నోటిఫై చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపినప్పటికీ బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పరిధిని నోటిఫై చేస్తే శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ఆ ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ అధికారులు బోర్డు పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది. ఇరు రాష్ట్రాల బేసిన్లో ప్రాజెక్టుల ద్వారా కేటాయింపులు, విడుదల, వినియోగించిన నీటిని ఎప్పటికప్పుడు టెలీమీటర్ల ద్వారా బోర్డు లెక్కిస్తుంది. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు. -
అపెక్స్ కౌన్సిల్ సమావేశం
-
వాటా నీటినే వాడుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని, దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను మెరుగు పరచడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సీఎంలతో మంగళవారం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా గురించి స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ► రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక శాతం ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఈ జిల్లాలు తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడ్డాయి. ► దేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. అనంతపురం జిల్లా డీడీపీ (ఎడారి నివారణ పథకం) పరిధిలో, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు డీపీఏపీ (కరవు ప్రాంత అభివృద్ధి పథకం) పరిధిలో ఉండటాన్ని బట్టి చూస్తే ఆ జిల్లాలు ఎంతగా వెనుకబడ్డాయో.. నీళ్లు లేక ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో విశదం చేసుకోవచ్చు. ► వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చడం, సమగ్రాభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో స్థైర్యం నింపాల్సిన నైతిక బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలదే అన్న అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి, తెలంగాణ సీఎంలకు వినయపూర్వకంగా గుర్తు చేస్తున్నా. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి వేరు ► తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఈ కోవలోకే వచ్చినా, ఆ జిల్లాల్లో 30 శాతం కంటే ఎక్కువ భూమికి సాగునీరు అందుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు 142 టీఎంసీలు, నల్గొండ జిల్లాకు 104 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ మూడు జిల్లాలు డీపీఏపీ పరిధి నుంచి బయటపడి.. సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్నాయి. ► కానీ ఇదే రాయలసీమ, ప్రకాశం జిల్లాలు నిత్యం కరవుతో తల్లడిల్లుతున్నాయి. ఒక్కో జిల్లాకు కనీసం 50 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేదు. సాధారణంగా ఒక జిల్లా స్వయం సమృద్ధి సాధించాలంటే కనీసం వంద టీఎంసీలు అవసరమన్నది అందరికీ తెలిసిందే. ► ఈ లెక్కన శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మొత్తం ఆరు జిల్లాలు అభివృద్ధి సాధించాలంటే 600 టీఎంసీలు అవసరం. ఇదే అంశంపై 2019 జూన్ 28న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ ఒక జిల్లా అభివృద్ధి సాధించాలంటే వంద టీఎంసీలు అవసరమని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకించి రాయలసీమ ప్రజలకు కూడా వర్తిస్తుంది. వాటా నీటినే వినియోగించుకోలేకపోతున్నాం ► వాస్తవం ఏమిటంటే.. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్ఆర్) ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే వస్తాయి. 881 నుంచి 885 అడుగుల మధ్య నీటి మట్టం ఉన్నప్పుడే పీహెచ్ఆర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయి. కానీ.. గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే శ్రీశైలంలో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. ► చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, కేసీ కెనాల్ సప్లిమెంటేషన్‌కు పది టీఎంసీలు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని గాలేరు–నగరికి 38 టీఎంసీలు, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీ–నీవాకు 40 టీఎంసీలు.. వాటితోపాటు సీబీఆర్‌కు పది, పైడిపాళెంకు ఆరు, మైలవరానికి ఏడు, సర్వారాయసాగర్‌కు మూడు, గోరకల్లుకు 12.4, అవుకుకు 4.14, సోమశిలకు 78, కండలేరుకు 68 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులు దశాబ్దాలుగా శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. ► 1983లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెన్నై తాగునీటికి కేటాయించిన 15 టీఎంసీల్లో ఎనిమిది టీఎంసీలను జూలై నుంచి అక్టోబర్ మధ్య, నాలుగు టీఎంసీలను జనవరి నుంచి ఏప్రిల్ «మధ్య సరఫరా చేయాలి. కానీ.. జనవరి నాటికి శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల పీహెచ్ఆర్ ద్వారా చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. ► విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజూ 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తీసుకెళ్లేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ప్రాజెక్టులో 796 అడుగుల నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా తరలించే సామర్థ్యం ఉంది. ► ఆంధ్రప్రదేశ్‌లో 2.45 కోట్ల జనాభాతో 98,001 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించిన ఆరు జిల్లాలు నీటి అవసరాల కోసం శ్రీశైలంపై ఆధారపడితే.. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొంత భాగం మాత్రమే శ్రీశైలంపై ఆధారపడ్డాయి. వాటా జలాలను వినియోగించుకోవడానికే.. ► కృష్ణా జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టీఎంసీలను వినియోగించుకునేలా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. శ్రీశైలం నుంచి రోజుకు సాగునీటి అవసరాల కోసం మూడు టీఎంసీలు.. విద్యుదుత్పత్తి ద్వారా నాలుగు టీఎంసీలు వెరసి ఏడు టీఎంసీలను 800 అడుగుల నీటి మట్టం కంటే దిగువ నుంచే తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దీని వల్ల పీహెచ్ఆర్ ద్వారా కాలువలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు దిగువన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల వాటా జలాలను వినియోగించుకోవడం కష్టమవుతోంది. ► వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పీహెచ్ఆర్ కింద తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడం కోసమే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించేలా వరదను మళ్లించడానికి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ల కాలువ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ► కేటాయించిన నీటి కంటే చుక్క నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనంగా వినియోగించుకోం. ఈ ఎత్తిపోతల ద్వారా పాత ఆయకట్టుకే నీళ్లందిస్తాం. నీటిని నిల్వ చేయడానికి కొత్తగా ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదు. ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు నీటి మళ్లింపు న్యాయమే ► కేడబ్ల్యూడీటీ–1 తీర్పులో 128వ పేజీ ప్రకారం అంతర్రాష్ట్ర నది అయిన కృష్ణా నుంచి ఇతర నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)కు నీటిని మళ్లించడం న్యాయమే. ఈ క్రమంలోనే కృష్ణా డెల్టాకు 181.2, కేసీ కెనాల్‌కు 39.9, నాగార్జునసాగర్ కుడి కాలువకు 132, తుంగభద్ర హెచ్చెల్సీకి 32.5, గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఆ తర్వాత కేడబ్ల్యూడీటీ–2 తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. ► దీన్ని బట్టి చూస్తే ఒక నది నుంచి మరొక నదికి నీటిని మళ్లించడం న్యాయమేనన్నది స్పష్టమవుతోంది. దేశంలో రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, కృష్ణా, మూలమట్ట, ఇంద్రాయణి, పెరియార్, చెలకుడి నదుల నుంచి ఇతర నదులకు నీటిని మళ్లించారు. ► కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య 1978 ఆగస్టు 4న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీటిని అందించేందుకు ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 45 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ పదే పదే కోరుతోంది. ► అదే తెలంగాణ హైదరాబాద్ తాగునీటి సరఫరా (6.43 టీఎంసీలు), ఎస్సారెస్పీ (68.48), కాళేశ్వరం (83.19), జీఎల్ఐఎస్ (24.65), సీతారామ (21.75), ఎస్సారెస్పీ వరద కాలువ (6.65), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలు, వెరసి 214 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా వాటా ఇవ్వాలి. తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలి ► ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం పర్యవేక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు.. నాగార్జునసాగర్ బాధ్యతను తెలంగాణకు అప్పగించారు. కానీ.. తమ భూభాగంలో ఉందనే నెపంతో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన అధీనంలో ఉంచుకుంది. అదే నాగార్జునసాగర్‌లో కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలో ఉన్నా, తెలంగాణ తన అధీనంలోకి తీసుకుంది. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో 796 అడుగుల నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోయి రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీళ్లందించలేని దుస్థితి. సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు అధీనంలోకి తేవాలి. ► విభజన చట్టంలో సెక్షన్ 85(2) ప్రకారం కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని 2019లో హోం శాఖ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తక్షణమే అమలు చేయాలి. గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి ► వ్యాప్కోస్ నివేదిక ప్రకారం గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1430 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై చేపట్టి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాటికి 776, తెలంగాణలో ఉన్న వాటికి 650 టీఎంసీలు అవసరం. ► కానీ.. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 225 నుంచి 450 టీఎంసీలకు, జీఎల్ఐఎస్ సామర్థ్యాన్ని 22 టీఎంసీలకు పెంచింది. తుపాకులగూడెంను వంద టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతలను వంద టీఎంసీలు, వాటర్ గ్రిడ్‌ను 23.76 టీఎంసీలు, రాజపేట(0.35), చనాకా–కొరటా(5), పింపిరాడ్–పర్సోడా(1.2), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలను తరలించే పనులు కొత్తగా చేపట్టింది. వెరసి 1,355 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు చేపట్టింది. ► దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకుని.. వాటి డీపీఆర్‌లను తెప్పించుకుని పరిశీలించాలి. గోదావరి జలాలను పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. ► మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు వాటా నీటిని వినియోగించుకోకపోవడం వల్లే గోదావరి 1,400 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు తేలింది. గోదావరిలో గరిష్టంగా 1990–91లో 6,472 టీఎంసీలు.. 2009–10లో కనిష్టంగా 1,025 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు రికార్డుల్లో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున మూడు వేల టీఎంసీల మిగులు జలాలు ఉంటాయి. మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉంటంది. ఈ నీటిని కొత్త ప్రాజెక్టులకు కేటాయించాలి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు సహకరించాలి ► తెలంగాణ నిర్వహిస్తోన్న నాగార్జునసాగర్, కాలువలకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం తెచ్చి ఆ«ధునికీకరించారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తోన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో రికార్డు స్థాయిలో 26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీని వల్ల ప్రాజెక్టు దెబ్బతింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్ట్ కమిటీ తనిఖీ చేసి.. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి రూ.900 కోట్లు అవసరమని తేల్చింది. ► ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది భారమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వాటాలు వేసుకుని ఆ నిధులను సమకూర్చి.. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి సహకరించాలి. ► జల వనరులను జాతీయ సంపదగా గుర్తించాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీటిని సమంగా సరఫరా చేసేలా చూడాలి. నదికి వరద వచ్చినప్పుడు.. ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షించి.. వరదను దిగువకు విడుదల చేసేలా చూసి.. పరీవాహక ప్రాంతంలో ఉన్న అందరికీ వాటా మేరకు జలాలు దక్కేలా చూడాలి’ అని సీఎం జగన్ వివరించారు. అనంతరం ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ అందజేశారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. 2016 సెప్టెంబరు 9న జరిగిన అపెక్స్ కౌన్సిల్లో కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా తమకు కేటాయించిన వాటా నీటిని వినియోగించుకోవడానికి పరిమితమవుతామని.. అదనంగా నీటిని వినియోగించుకోబోమని తెలంగాణ పేర్కొంది. ఇప్పుడు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసి.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించడాన్ని తెలంగాణ ఎలా సమర్థించుకుంటుంది? -
ఏపీ అక్రమ నిర్మాణాలు ఆపకుంటే..బాబ్లీ తరహా బ్యారేజీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానదిపై పోతిరెడ్డి పాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే... తెలంగాణ ప్రభుత్వం కూడా అలం పూర్ –పెద్ద మరూర్ వద్ద (జూరాల దిగువన... శ్రీశైలం ఫోర్‌షోర్‌లో తుంగభద్ర కలవడానికి ముందు) బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయ మని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చు కోకుండా, మొండి వైఖరితో అక్రమ ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే... మహా రాష్ట్ర గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌కు ఎగువన నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగానే తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం కృష్ణాపై కొత్త బ్యారేజీ నిర్మించి నీటిని ఎత్తిపోస్తామని హెచ్చ రించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవ హరిస్తే ఇక కుదరదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ‘నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. భారత యూనియన్‌లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీజలాల్లో న్యాయ మైన వాటాను పొందే హక్కు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగు నీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతాం’అని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ పలుమార్లు అభ్యంత రాలు వ్యక్తం చేసినా, ఈ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులు, వాటాలపై వివరించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. అపెక్స్‌లో కేసీఆర్ వాదన ఇదీ... తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని కేసీఆర్ కోరారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే... 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956–సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం ఇప్పటికైనా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కృష్ణా జలాల పునఃపంపిణీకి చొరవ చూపాలి’అని కోరారు. దీనిపై కేంద్రమంత్రి షెకావత్ స్పందిస్తూ... తెలంగాణ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధమే. అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసి ఉన్న కారణంగా ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నామని తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్, కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే.. సుప్రీంకోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 కింద కృష్ణా నదీ జలాల వివాద ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడిటి–2)కు ‘టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్సెస్’ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు. అంతర బేసిన్లలోనే నదీ జలాలను తరలించాలనే జల న్యాయసూత్రాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశం దృష్టికి తెచ్చారు. ‘ఒక నదీ బేసిన్లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరినంకనే, ఇంకా అదనపు జలాలుంటేనే బేసిన్ అవతలికి నదీ జలాలను తరలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’అని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా /సీఎం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఆంధ్రప్రదేశ్‌కు లేదని, ఇదే విషయాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖతో పాటు కృష్ణా బోర్డు ఏపీకి స్పష్టం చేయడాన్ని సరైన చర్యగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నది మీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కాగా డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరడం పట్ల సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేననీ, ఇందులో రహస్యం ఏమీ లేదని, కాకపోతే నిర్మాణక్రమానికి అనుగుణమైన స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండటం వలన డీపీఆర్‌లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని, అంతేతప్ప డీపీఆర్‌లు ఇవ్వడానికి తమకు ఏ అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. అయితే బోర్డులు సమర్ధవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై హర్షం.. ఇక ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సెక్షన్–3 కింద ఇచ్చిన వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించడం, రాష్ట్ర ఒత్తిడి మేరకు ట్రిబ్యునల్ ద్వారా దీన్ని పరిష్కరిస్తామన్న హామీ ఇవ్వడం తెలంగాణకు మేలు చేకూర్చే అంశమన్నారు. తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులందరినీ ముఖ్యమంత్రి అభినందించారు. -
డీపీఆర్‌లకు సుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం వాడీ వేడిగా సాగింది. ఇక్కడి శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా హాజరయ్యారు. ఏపీ పునర్వ్యవ స్థీకరణ చట్టం–2014ను అనుసరించి... కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, గోదావరి, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుల విధులను పర్యవేక్షించడం, ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఈ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. తొలిసారిగా 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశమవగా.. నాలుగేళ్ల అనంతరం మంగళవారం రెండో సమావేశం జరిగింది. భేటీ ఎజెండా అంశాలపై సయోధ్య కుదిరినప్పటికీ ప్రాజెక్టుల విషయంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపించారు. నాలుగు ఎజెండా అంశాలపై తొలుత కేంద్రం ప్రెజెంటేషన్ ఇచ్చింది. అనంతరం కేసీఆర్ తన వాదన వినిపించారు. కొత్త ట్రిబ్యునల్ ఇచ్చేంతవరకు ఏది మాట్లాడినా లాభం లేదన్నారు. తాను పంపించిన అంశాలు ఎజెండాలో లేవన్నారు. అయితే ఆలస్యంగా అందినందున ఆ అంశాలు చేర్చలేదని, మరోసారి సమావేశమవ్వొచ్చని షెకావత్ సూచించారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై తాను పంపిన అభ్యంతరాలను కేసీఆర్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ అభ్యంతరాలను తిప్పికొట్టారు. గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామసాగర్ తదితర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విస్తరణ పేరుతో కొత్తగా ప్రాజెక్టులు చేపడుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో అదేరీతిలో తాము ప్రాజెక్టులు విస్తరిస్తే అభ్యంతరం ఎందుకన్నారు. రెండు రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని తన అభిప్రాయం చెప్పారు. కేంద్ర మంత్రి ఈ వాదనలతో ఏకీభవించారు. ‘రెండూ ఒకేరీతిలో ఉండాలి. ఒకచోట ఒక విధానం, మరొకచోట మరో విధానం ఉండరాదు..’అని సూచించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలను కాంక్షిస్తూ వాదనలు వినిపించారు. ‘డీపీఆర్‌లు సమర్పిస్తే ప్రాజెక్టులపై ఇరురాష్ట్రాల అభ్యంతరాలు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది..’అని కేంద్ర మంత్రి అన్నారు. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు సమ్మతించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేసీఆర్ పట్టు రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదచట్టంలోని సెక్షన్ 3ను అనుసరించి కొత్త ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయాలని తాము చేసిన అభ్యర్థనను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే పట్టుపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన సరిగ్గా వినలేదని, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై లోతుగా అధ్యయనం జరగాలని కోరారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రి దీనికి స్పందిస్తూ ‘ప్రాజెక్టుల డీపీఆర్‌లు, బోర్డుల పరిధి, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటేనెన్స్ వంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. వీటన్నింటినీ ట్రిబ్యునల్ ఒక్కటే పరిష్కరించలేదు. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది’అని సమాధానం ఇచ్చారు. ఎజెండా అంశాలు... కేంద్రం స్పందన 1. బోర్డుల పరిధి బోర్డులు ఏర్పడి ఆరేళ్లయినప్పటికీ వీటి పరిధి నోటిఫై కాకపోవడానికి కారణం రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడమే. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని నియంత్రించడం, కొత్త ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వడం ఈ బోర్డుల విధి. అయితే బోర్డుల పరిధిని నోటిఫై చేయని కారణంగా ఏటా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు నిర్ణయించగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్) రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు జరిపేంతవరకు బోర్డుల పరిధిని నిర్వచించరాదంటూ విభేదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ సమ్మతం తెలిపింది. ఈ విషయంలో నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదే అయినందున ప్రస్తుతం ఉనికిలో ఉన్న కేడబ్ల్యూడీటీ–1ను అనుసరించి ఉన్న కేటాయింపులకు అనుగుణంగా బోర్డులు నీటి పంపిణీని నియంత్రించవచ్చు. అందువల్ల నోటిఫై చేసేందుకు నిర్ణయించాం. 2. కొత్త ప్రాజెక్టులు ఎజెండాలోని రెండో అంశం కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించడం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఆయా ప్రాజెక్టులను సాంకేతికంగా మదింపు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రస్తావించిన ప్రాజెక్టులు, అలాగే అంతర్రాష్ట్ర నదులపై నిర్మించే అనుమతులు లేని పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా సమర్పించాలి. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులకు సమర్పించాలని పదేపదే కోరినప్పటికీ పంపలేదు. తొలుత బోర్డులు సాంకేతిక మదింపు జరిపి ఆమోదం తెలిపిన తరువాత అపెక్స్ కౌన్సిల్ వాటికి అనుమతి ఇస్తుంది. ఆయా ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించినవేనని రెండు రాష్ట్రాలు చెబుతున్నాయి. ఎ) కేడబ్ల్యూడీటీ–1 ద్వారా కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పాత ప్రాజెక్టులుగా పరిగణించాలి. బి). పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు పదకొండులో ప్రస్తావించిన ప్రాజెక్టులు సైతం పాత ప్రాజెక్టులే. కానీ ట్రిబ్యునల్స్ ద్వారా వాటికి కేటాయింపులు లేనిపక్షంలో.. కేడబ్ల్యూడీటీ–2 ద్వారా కేటాయింపులు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉంది. సి). నీటి కేటాయింపులు లేని పాత ప్రాజెక్టులు, విభజన అనంతరం పరిధి మారిన ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక మదింపు, అనుమతుల కోసం డీపీఆర్‌లు సమర్పించాలి. డి). ఎ, బి కేటగిరీల్లో లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి. ఇ). ఈ విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన ఆదేశం స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలు దీనిని పాటించాలని చెప్పాం. డీపీఆర్‌లు సమర్పించి సాంకేతిక మదింపు అనుమతులు తెచ్చుకోనంతవరకు ఈ ప్రాజెక్టులు నిర్మించరాదని కేంద్రం స్పష్టం చేసింది. 3. జలాల పంపిణీ వ్యవస్థ ఏర్పాటు ఎజెండాలోని మూడో అంశం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వాటా నిర్ధారించేందుకు మెకానిజం ఏర్పాటు చేయడం. ఇందులో కేంద్రం, రాష్ట్రాల పాత్ర పరిమితం. ట్రిబ్యునళ్లే నిర్ధారిస్తాయి. కృష్ణా జలాల విషయానికి వస్తే కేడబ్ల్యూడీటీ–1 అవార్డు ప్రస్తుతం అమలులో ఉంది. కేడబ్ల్యూడీటీ–2పై సుప్రీం కోర్టులో స్టే ఉంది. గోదావరి జలాల విషయానికి వస్తే గోదావరి ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య మొత్తం నిర్ధిష్ట కేటాయింపులు జరపలేదు. అందువల్ల మొత్తం నీటి కేటాయింపులు, ప్రాజెక్టు వారీ కేటాయింపులు తేలాలంటే బేసిన్లో ప్రాజెక్టు వారీ డీపీఆర్‌లను మదింపు చేయాలి. రెండు రాష్ట్రాలు పరస్పరం వీటిపై ఫిర్యాదు చేసినందున సామరస్యంగా పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఒక మెకానిజం ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ద్వారా, లేదా కొత్త ట్రిబ్యునల్ నిర్ణయం (కేటాయింపుల) ద్వారా గోదావరి జలాలు పంపిణీ చేసుకోవచ్చు. అలాగే గోదావరి జలాలను కృష్ణా నదికి (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి) మళ్లించినప్పుడు దాని నుంచి వాటా పంచేందుకు మెకానిజం ఏర్పాటు చేయాలి. భేటీలో తీసుకున్న నిర్ణయాలు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనితో తెలంగాణ సీఎం విభేదించినప్పటికీ, పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి దీనికి ఏకాభిప్రాయం అవసరం లేదు. అందువల్ల కేంద్రం నోటిఫై చేస్తుంది. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర రిపోర్టులను సమర్పిస్తామని సీఎంలు ఇద్దరూ అంగీకరించారు. త్వరలో ఆయా ప్రాజె క్టుల సాంకేతిక మదింపు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956లోని సెక్షన్–3 పరిధిలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి అభ్యర్థన ఇస్తూ కృష్ణా జలాల పంపిణీకి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌కు కొత్త విధివిధానాలు సూచించడం గానీ చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ సలహా తీసుకుని కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేసీఆర్ ఇందుకు అంగీకరించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెప్పారు. గోదావరి జలాల విషయంలోనూ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956లోని సెక్షన్–3 పరిధిలో అభ్యర్థన పంపొచ్చని రెండు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మరుసటి రోజే అభ్యర్థన పంపిస్తామని కేసీఆర్ చెప్పారు. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపై సమ్మతి. -
ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్‌దే: షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్ట్‌లు కట్టాలన్నా.. వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని షెకావత్ స్పష్టం చేశారు. (చదవండి: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం) ‘‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని’’ షెకావత్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ముందుగా డీపీఆర్‌లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్ బోర్డ్‌ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్ తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (రాష్ట్ర విభజన చట్టం) ప్రకారం “అపెక్స్ కౌన్సిల్” ఏర్పడిందని, నాలుగు సంవత్సరాల అనంతరం ఈ సమావేశం జరిగిందని షెకావత్ అన్నారు. 2016 లో తొలిసారి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో “అపెక్స్ కౌన్సిల్” సమావేశం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం ఈ కౌన్సిల్ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, అన్ని సమస్యల పరుష్కర కోసం చాలా విపులంగా చర్చించామని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్య మంత్రులూ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారని షెకావత్ వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు.. ►కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ బోర్డుల పరిధి నోటిఫై చేస్తున్నాం ►కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపడానికి అంగీకారం ►న్యాయ సలహా తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు పై నిర్ణయం ►సుప్రీం కోర్టు నుంచి కేసు ఉపసంహరణ చేస్తే నది జలాల పంపిణీ పై ట్రిబ్యునల్ ఏర్పాటు. కేసు ఉపసంహరణకు సీఎం కేసీఆర్ అంగీకారం ►కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయం ఆంధ్రాకు తరలింపు -
ఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తన వాదన వినిపించినట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఆయన అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. (చదవండి: బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం) ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ విమానాశ్రయానికి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరీ ఉన్నారు. -
నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం
-
నేడు ప్రధానితో సీఎం జగన్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం ఇక్కడ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఢిల్లీ వచ్చారు. మంగళవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో జరిగే సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. – కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: అపెక్స్ కౌన్సిల్ భేటీ నేడే) -
అపెక్స్ కౌన్సిల్ భేటీ నేడే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో నెలకొన్న జల వివాదాలపై చర్చించేం దుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంట లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమా వేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, బోర్డుల వర్కింగ్ మాన్యువల్, రెండు బేసిన్లలో నీటి వినియోగం, కృష్ణా బోర్డు ఏపీకి తరలింపు వంటి అంశాలపై అపెక్స్ కౌన్సిల్ చర్చించనుంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధమైంది. ముఖ్యంగా నీటి వినియోగంపై ట్రిబ్యునల్ అవా ర్డులు, వాటిపై కుదిరిన ఒప్పందాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులిచ్చిన ప్రాజెక్టుల జీవోలు, వాటి రీ ఇంజనీరింగ్ అంశాలతో నివేది కలు సిద్ధం చేసుకుంది. కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ వంటి ప్రాజెక్టులు పాతవేనని చెప్పేందుకు అవసరమైన రుజువులు, వాటికి ఉన్న నీటి కేటాయింపుల వివరాలతో రెడీ అయింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వ వ్యవస్థల విస్తరణపై తమ అభ్యంతరాలు, తెలంగాణకు జరిగే నష్టంపై సోమవారం సైతం సీఎం కేసీఆర్ ఇంజనీర్లతో చర్చించారు. ఈ అంశంపై బలంగా వాదనలు వినిపించేలా వ్యూహం సిద్ధం చేశారు. నీటి వాటాల విషయంలో, టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు, ఏపీ కొత్త ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కృష్ణా బోర్డు వైఫల్యాలను ఈ సమావేశంలో సీఎం ఎండగట్టనున్నారు. -
అపెక్స్‌కు వేళాయె..
-
అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జల వివాదాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ నెల 25న నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏసీ మల్లిక్ లేఖలు రాశారు. అనుకూల పరిస్థితులు లేకపోవడంతో భేటీని వాయిదా వేస్తున్నామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే చెబుతామని ఆ లేఖలో వెల్లడించారు. అయితే నాలుగు రోజుల కిందట కోవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్‌గా తేలిందని కేంద్ర జలశక్తిమంత్రే స్వయంగా ప్రకటించడంతో పాటు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. (ఫార్మాసిటీలో స్థానికులకే ఉద్యోగాలు) -
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థంలేని వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆం«ద్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఏపీ అభిప్రాయాలపై చర్చించారు. కేంద్రానిది కూడా తప్పే.. ‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’అని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు.. ‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుబట్టడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’అని కేసీఆర్ వివరించారు. అవన్నీ రీ డిజైన్ చేసిన ప్రాజెక్టులు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్‌సాగర్–ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మసాగర్ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’అని సీఎం పేర్కొన్నారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని, దాని ప్రకారం తెలంగాణ మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని స్పష్టంచేశారు. సాగునీటిలో తెలంగాణకు అంతులేని అన్యాయం... ‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటివాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ. రాష్ట్రానికి అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలలో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన భేటీ వాయిదా పడే అవకాశం ఉందని కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం సిద్ధమైన ప్రభుత్వం ► షెడ్యూల్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖకు అజెండాను పంపాలని నిర్ణయించింది. ► కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషమయంలో బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. వీటిపై జూన్ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు జరిగాయి. సీడబ్ల్యూసీ అనుమతి లేని వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని, వాటి డీపీఆర్‌లు ఇస్తే పరిశీలన, ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని బోర్డులు సూచించాయి. ► ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉంటారో లేదో తెలపాలని సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి గత నెల 28న లేఖ రాసింది. -
నెల రోజుల్లో ‘అపెక్స్’ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నదీజలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెల రోజుల్లో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ భావిస్తున్నట్లు కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు తెలిపాయి. కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ వంటి అంశాలపై వారితో చర్చించారు. అపెక్స్ భేటీ ఎజెండాను పంపాలని కోరినా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు పంపలేదని బోర్డు అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే బోర్డుల దృష్టిలో ఉన్న అంశాలతో ఎజెండా ఖరారు చేసి పంపితే నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహిస్తానని వెల్లడించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటే వర్కింగ్ మాన్యువల్‌పైనా మరోసారి ఇరు రాష్ట్రాల వాదనలు విని త్వరగా ఖరారు చేయాలని సూచించినట్లు తెలిసింది. ‘జలసౌధ’లో కరోనా కలవరం.. నీటిపారుదల శాఖ కార్యాలయమైన జలసౌధలో కరోనా అంశం కలవరపెడుతోంది. ఇప్పటికే జలసౌధలో ఒక ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా జిల్లాలో పనిచేస్తున్న మరో ఇంజనీర్ సైతం వైరస్ బారినపడ్డారు. దీంతోపాటే జలసౌధలోనే ఉన్న కృష్ణా, గోదావరి బోర్డులు ఈ నెల 4, 5 తేదీల్లో జరిపిన భేటీలకు హాజరైన ఓ జర్నలిస్టుకు కరోనా సోకడంతో బోర్డులో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో జలసౌధలోకి సందర్శకులకు అనుమతిని నియంత్రించారు. -
నెలలోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. అజెండాను సిద్ధంచేయాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించి.. వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండు బోర్డుల చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లతో మంత్రి షెకావత్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండాను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరామని.. కానీ, ఇప్పటిదాకా అవి స్పందించలేదని మంత్రికి బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. వారంలోగా అపెక్స్ కౌన్సిల్‌కు అజెండా పంపాలని కోరుతూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే ఇటీవల నిర్వహించిన బోర్డుల సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా అజెండా ఖరారుచేసి పంపాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. అలాగే, రెండు బోర్డుల పరిధి, వర్కింగ్ మాన్యువల్‌నూ ఖరారు చేస్తామన్నారు. అజెండాను పంపితే.. ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి షెకావత్ చెప్పినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. -
అపెక్స్ భేటీలో తేల్చుదాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లోని సమస్యాత్మకంగా ఉన్న అంశాలన్నింటినీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే తేల్చాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. కార్యదర్శుల స్థాయి సమావేశాలతో కీలక అంశాలపై తుది నిర్ణయాలకు రాలేమని, సీఎంల సమక్షంలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీని నిర్ణయించి బోర్డుల పరిధి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ అనుమతులు వంటి అంశాలను చర్చిస్తామని తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కృష్ణాబోర్డు తరలింపు, ప్రాజెక్టుల డీపీఆర్, పట్టిసీమ మళ్లింపు జలాలు, వరద జలాల వినియోగం, తాగునీటి వినియోగంలో 20% మాత్రమే లెక్కింపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, పోలవరం ముంపు వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్ లో తెలుగు రాష్ట్రాలతో భేటీ జరిగింది. దీనికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జలసంఘం సభ్యుడు ఆర్కే గుప్తా, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ అంతరాష్ట్ర జల విభాగపు సీఈ నర్సింహారావు తదితరులు హాజరయ్యారు. మళ్లింపు వాటాలు దక్కాల్సిందే.. భేటీలో తెలంగాణ మళ్లింపు జలాల అంశాన్ని ప్రస్తావించింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతో మళ్లిస్తున్న జలాల మేరకు తమకూ కృష్ణా బేసిన్ లో 45 టీఎంసీల అదనపు టీఎంసీలు కేటాయిం చాలని కోరింది. ఏపీ పట్టిసీమ ద్వారా నీటిని మళ్లిస్తున్నా తెలంగాణకు వాటా మాత్రం దక్కడ డం లేదని దృష్టికి తెచ్చింది. ఈ మూడేళ్లలోనే 135 టీఎంసీల మేర నష్టపోయామంది. దీనిపై కేంద్ర కార్యదర్శి జోక్యం చేసుకుంటూ సీఎంల సమావేశాల్లో దీనిపై తుదినిర్ణయం చేద్దామని చెప్పినట్లుగా తెలిసింది. అప్పటివరకు కృష్ణా జలాల్లో పాత వాటాలు ఏపీ 512 టీఎంసీ, తెలంగాణ 299 టీఎంసీల వాటా ప్రకారమే వినియోగించుకోవాలని సూచించింది. కృష్ణాలో వృథాగా సమద్రంలోకి వెళ్తున్న సమయంలో వినియోగించిన నీటిని రాష్ట్రాల వినియోగం కింద లెక్కించరాదని ఏపీ విన్నవించింది. దీనిపైనా అపెక్స్ కౌన్సిల్లో చర్చించి నిర్ణయం చేస్తామని కేంద్రం తెలి పింది. ఇక కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధి, వర్కింగ్ మాన్యువల్‌పైనా చర్చించారు. ప్రాజెక్టులు తమ పరిధిలో ఉంటేనే వాటి నిర్వహణ సాధ్యమని కృష్ణా, గోదావరి బోర్డులు తెలిపాయి. -
దీపావళి తర్వాత అపెక్స్ కౌన్సిల్?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాల పరిష్కారానికి వీలుగా దీపావళి అనంతరం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్ర జల వనరుల శాఖ ప్రాథమిక నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు వెలువడినట్లుగా కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు అపెక్స్ భేటీ ఒక్కటే శరణ్యమన్న తమ వినతి మేరకు కేంద్రం ఆ దిశగా నిర్ణయం చేసినట్లుగా ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని వివాదాలపై గత రెండేళ్లలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన కేంద్రం.. ఇరు రాష్ట్రాల మధ్య ఓ అవగాహన కుదర్చడంతో తాత్కాలిక పరిష్కారం దొరికింది. ఈ ఏడాది ఎలాంటి భేటీ జరగలేదు. దీంతో జల వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ రీ–ఇంజనీరింగ్ చేస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులకు కేంద్రం, బోర్డు అనుమతులు లేవని ఏపీ అంటోంది. ప్రతిగా ఏపీ చేపట్టిన పులికనుమ, సిద్ధాపురం, గాజులదిన్నె, గుండ్రే వుల, శివభాష్యం సాగర్, మున్నేరు, ముచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడి కాల్వ అంశాలని తెలంగాణ తెరపైకి తెచ్చింది. ఈ వివాదాన్ని తేల్చే బాధ్యతను బోర్డులు కేంద్రం కోర్టులోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దీపావళి తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సుముఖత తెలిపినట్లు తెలిసింది. ఆలోపే బోర్డులతో భేటీ కావాలని సైతం ఆయన నిర్ణయించినట్లుగా సమాచారం. -
పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే!
ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాల్లేవన్న కేంద్రం * అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే స్పష్టత * ట్రీబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగానే నీటి వినియోగం * ప్రాజెక్టుల నియంత్రణ అంశం సైతం ఇప్పట్లో లేనట్లే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఒక అడ్డు తొలిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదన అపెక్స్ కౌన్సిల్ ముందు వీగిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాలేమీ లేవని.. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగా నీటి వినియోగానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించడం రాష్ట్రానికి ఊరటనిచ్చింది. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ ఎప్పటికి పూర్తి చేస్తుంది, ఏ మేరకు నీటి వాటాను కేటాయిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. కేటాయింపుల మేర వాటా దక్కేనా? బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన మొత్తంగా 2,060 టీఎంసీలను లెక్క తేల్చింది. అందులోంచి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు, మరో 227 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు దక్కగా.. తెలంగాణకు 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు దక్కాయి. అయితే మొత్తంగా కూడా తెలంగాణ 200 టీఎంసీలకు మించి వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే 120 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టింది. ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు కృష్ణాలో అదనంగా 90 టీఎంసీల వాటా రావాలని స్పష్టం చేస్తోంది. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొత్తగా 65 శాతం నీటి లభ్యత అంచనాలతో కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత జలాలున్నట్టు తేల్చింది. ఈ లెక్కన మరో 163 టీఎంసీల నికర జలాలు, 285 టీఎంసీల మిగులు జలాలు (మొత్తం 448 టీఎంసీలు) అదనంగా ఉన్నట్లు చూపింది. ఈ అదనపు జలాల్లో కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81, ఏపీకి 190 టీఎంసీలు కేటాయించింది. కానీ బచావత్ తీర్పుకు వ్యతిరేకంగా మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు పంచడమేమిటని.. వాటిని దిగువ రాష్ట్రాలకే పంచాలని ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తోంది. దీనిపై విచారణ ముగిస్తే తెలంగాణకు మిగులు జలాల్లో మరింత వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన మొత్తంగా పాలమూరు, డిండిలకు నిర్ణీత నీటిని వాడుకోవచ్చని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై వాదనలు విన్న కేంద్రం వాటాలు తేల్చే పనిని తిరిగి ట్రిబ్యునల్‌కే అప్పగించింది. తెలంగాణ వాదనలకు అనుగుణంగా నీటి వాటా పెరిగితే పాలమూరు, డిండికి ఎలాంటి నష్టం ఉండదని.. లేకపోతే ఇబ్బందేనని రాష్ట్ర నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ ఇప్పట్లో లేనట్లే కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నివేదికను సమర్పించాలని ఇప్పటిదాకా కృష్ణా బోర్డు తొందరపెట్టిందని.. ప్రస్తుతానికి ఆ అంశం మరుగున పడినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ చెబుతోంది. అపెక్స్ భేటీలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని తెలంగాణ వాదించింది. అసలు ప్రాజెక్టుల వారీగాఎవరి వాటా ఎంత, వినియోగం ఏ రీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే ప్రాజెక్టుల నియంత్రణ చేపట్టాలని సూచించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించిందని, ఏపీ మౌనం దాల్చిందని పేర్కొంది. -
అపెక్స్ కౌన్సిల్లో సీఎంల వాదనలు
-
తేలని జల జగడం
♦ అసంపూర్తిగానే ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ♦ ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ పరస్పర ఫిర్యాదులు ♦ కేంద్రం మౌనం... కలిసిపరిష్కరించుకోవాలని హితవు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాల జగడం ఎటూ తేలలేదు. ఇరువురు సీఎంలతో కేంద్రం ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ పంచాయితీ తెగలేదు. వివాదాస్పద ప్రాజెక్టుల వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, స్పందనలు, ప్రతిస్పందనలు విన్న కేంద్రం మౌనం దాల్చింది. పరిష్కార భారాన్ని తిరిగి రెండు రాష్ట్రాలపైనే మోపింది. సరైన ప్రణాళిక లేకుండా కేవలం రాజకీయ కోణంలో హడావుడిగా ప్రాజెక్టులు నిర్మించడమే వివాదానికి కారణమైందనే భావనతో, ఇందులో తలదూర్చరాదని కేంద్రం యోచిస్తున్నట్టు సమావేశ ఫలితం స్పష్టం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీకి మూల కారణమైన పాలమూరు, డిండి ప్రాజెక్టుల వివాదంపై పరిష్కారం రాలేదు. అయితే... ఈ ప్రాజెక్టులు కొత్తవి కావని, టీడీపీ, బీజేపీల 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్నవేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఏపీ వాదనను వీడియో, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో తిప్పికొట్టింది. తెలంగాణ వాదనను ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా కాదనలేకపోయినట్టు తెలుస్తోంది. ‘‘పోలవరం ప్రాజెక్టును కూడా 11వ షెడ్యూలులో పేర్కొనలేదు. మరి దాన్ని కూడా కొత్త ప్రాజెక్టు కింద జమ కడతారా?’’ అని ఒక దశలో కేసీఆర్ ప్రశ్నించగా, అందులో పేర్కొన్న వాటినే నిర్మాణంలోని ప్రాజెక్టులుగా పరిగణించజాలమని బాబు బదులిచ్చినట్టు తెలుస్తోంది. ‘‘పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. సాగునీటి సౌకర్యం లేని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు న్యాయం చేస్తాం’’ అని భేటీలో కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్‌ను గతంలో విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించడం తెలిసిందే. దానితోపాటు గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించిన నీటి నుంచి వాటాల కేటాయింపుకు ప్రాతిపదిక, నియమాల రూపకల్పన తదితర ఐదు అంశాలను అజెండాలో చేర్చి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ ఉమాభారతి అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం ఇక్కడి శ్రమశక్తి భవన్లో కౌన్సిల్ సభ్యులైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్‌తో పాటు ఇరు రాష్ట్రాల సాగునీటి మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమ, కేంద్ర జల వనరులు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, కృష్ణా యాజమాన్య బోర్డు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తొలుత ఉమాభారతి 10 నిమిషాల పాటు స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ఎస్.కె.జోషి ప్రజెంటేషన్లు ఇచ్చారు. తరవాత అజెండా అంశాలపై 45 నిమిషాలు చర్చ జరిగింది. అనంతరం బాబు 10 నిమిషాలు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా తాము నష్టపోతున్నామన్నారు. తర్వాత మాట్లాడిన సీఎం కేసీఆర్... డిండి, పాలమూరు ప్రాజెక్టులు కొత్తవి కావని పునరుద్ఘాటించారు. అవి టీడీపీ, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘అమలులో ఉన్న ప్రాజెక్టుల జాబితాను విభజన చట్టంలో సక్రమంగా పొందుపరచలేదు. ఇలాగైతే ఏపీలోని అనేక ప్రాజెక్టులు కూడా ఆగిపోవాల్సి ఉంటుంది’’ అంటూ ఏపీ వాదనను తిప్పికొట్టారు. మీరు అతిక్రమించారు.. లేదు.. లేదు.. విభజన చట్టాన్ని అతిక్రమించి పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టిందని, దాంతోతాము భారీగా నష్టపోతామని భేటీలో ఏపీ ఫిర్యాదు చేసింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో ఈ ప్రాజెక్టులు లేవంది. దీన్ని తిప్పికొడుతూ అన్ని ఆధారాలనూ రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ముందుంచింది. పాలమూరుకు 2013లో, డిండి ఎత్తిపోతలకు 2007లోనే పాలన అనుమతులు లభించాయని వివరించింది. ‘‘టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొందుపరిచింది. మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు సమక్షంలో నరేంద్ర మోదీ అప్పట్లో స్వయంగా ఈ ప్రాజెక్టుపై మాట్లాడారంటూ సదరు వీడియోను ప్రదర్శించింది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలనూ చదివి విన్పించింది. ఏపీ వాదనలు పూర్తిగా తప్పు. ఆధారరహితం. కాబట్టి వాటిని అపెక్స్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని వాదించింది. కేసీఆర్ జోక్యం చేసుకుంటూ, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా అమల్లోని ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని గుర్తు చేశారు. ఏపీలోని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాడిపూడి, పుష్కర, ఎస్సార్బీసీ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర పథకాలు కూడా అందులో లేని విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ♦ మీరు మళ్లించారు.. ♦ మీరు కూడా మళ్లించారు.. ఏపీ ప్రభుత్వం మిగులు జలాల ప్రాతిపదికన పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తోందని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 45 టీఎంసీల వాటా తమకు చెందుతుందని తెలంగాణ వాదించింది. నికర జలాల ప్రాతిపదికన గోదావరి నుంచి పోలవరం ద్వారా ఏపీ 80 టీఎంసీలు మళ్లిస్తున్నందున మరో 45 టీఎంసీల వాటా తమకు చెందుతుందని పునరుద్ఘాటించింది. అందులోంచి ఏపీ, తెలంగాణ పంచుకోవాలని, వాటాలే తేల్చాల్సి ఉందని ఏపీ చేసిన వాదనను తిప్పికొట్టింది. సాగర్ ఎగువన తామే ఉన్నందున 45 టీఎంసీలూ తమకే చెందుతాయని వాదించింది. ఏపీ కొత్త వాదన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ కొత్తగా మరో అంశాన్ని తెర పైకి తెచ్చింది. దాదాపు 211 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన హైదరాబాద్ తాగునీటి పథకం, ఎస్సారెస్పీ స్టేజ్-1, 2, ప్రాణహిత-చేవెళ్ల, దే వాదుల, ఇందిరమ్మ వరద కాలువ, సీతారామ పథకాలకు 211 టీఎంసీలను తెలంగాణ మళ్లిస్తోందని ఫిర్యాదు చేసింది. ఈ 211 టీఎంసీల నీటి నుంచి తమకు వాటా రావాలని వాదించింది. తెలంగాణ డిమాండ్ మేరకు నిపుణుల కమిటీ పునర్ వ్యవస్థీకరణకు కేంద్రం సుముఖత కనబరిచినట్టు సమాచారం. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేయగా, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు చేయకుండా నోటిఫై చేయడం కుదరదని తెలంగాణ వాదించింది. ఆలోగా ఉభయ రాష్ట్రాల ప్రాజెక్టుల నీటి పంపకాలను జాయింట్ కమిటీ పర్యవేక్షించాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల హెడ్రెగ్యులేటర్లను ఎవరి భూభాగంలో ఉన్నవి ఆ రాష్ట్రమే నిర్వహించాలని ఏపీ డిమాండ్ చేయగా.. జాయింట్ కమిటీ వేస్తే నీటి పంపిణీ సమయంలో ఒక రాష్ట్ర ఇంజినీర్ మరో రాష్ట్రానికి వెళ్లి పర్యవేక్షించుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ కోరింది. అందుకు కేంద్రం సమ్మతించింది. నొప్పించక... తానొవ్వక... తటస్థంగా వ్యవహరించిన కేంద్రం వివాదాలకు సంబంధించిన కీలకాంశాల్లో ఇరు రాష్ట్రాల్లో ఎవరినీ సమర్థించకుండా, ఎవరినీ నొప్పించకుండా భేటీలో కేంద్రం ఆచితూచి వ్యవహరించింది. రెండు రాష్ట్రాలు సరైన ప్రణాళిక లేకుండా, ఓట్ల రాజకీయాల కోణంలో హడావుడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడమే సమస్యలకు కారణమని కేంద్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉమాభారతి అభిప్రాయపడ్డట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ ఆరోపించినట్టుగా డిండి, పాలమూరు కొత్త ప్రాజెక్టులు కావని, పాతవేనని తెలంగాణ నిరూపించగలగడం, ఆ వాదనను బాబు సమర్థంగా తిప్పికొట్టలేకపోవడంతో ఆమె కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. అందుకే వివాదాస్పద అం శాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతూ, పరిష్కార బాధ్యతను రెండు రాష్ట్రాల నెత్తినే పెట్టినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్-ఒడిషా, తమిళనాడు-కర్ణాటక మధ్యా తరచూ జల వివాదాలు తలెత్తుతున్నందున జాతీయ జల విధానం రూపొందించాలని జల వనరుల శాఖ యోచిస్తోంది. ముగ్గురు ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. చర్చల ద్వారా పరిష్కరించుకోండి నీటి వివాదాలపై ఇద్దరు సీఎంలు తమ ప్రసంగాల్లో ఇలా కొట్లాడుకోవడం తగదని ఉమాభారతి అన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినరాదని ఆకాంక్షించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాలు పరస్పర అవగాహన, అంగీకారంతో పరిష్కార మార్గం వెతకాలని సూచించారు. అజెండాలోని మిగతా అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘సమావేశం ఫలప్రదమైంది. శాంతియుతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగింది..’ అంటూ కుదిరిన ఏకాభిప్రాయాలను వివరించారు. ‘‘నీటి విని యోగం లెక్కలు తేల్చేందుకు టెలీ మెట్రీ విధా నం అమలుకు ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నాం. నదీ జలాల లభ్యత, పంపిణీపై అధ్యయనానికి కేంద్ర జల సంఘం, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజనీర్ల సంయుక్త కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. నీటి లభ్యత, పంపిణీపై కమిటీ అధ్యయనం చేసి కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2)కు నివేదిక ఇస్తుంది. కేటాయింపుల సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా ట్రిబ్యునల్‌ను కేంద్రం కోరుతుంది’’ అని ఆమె వివరించారు. అప్పటిదాకా ప్రస్తుతం తాత్కాలిక అవగాహనతో ఏర్పాటు చేసుకున్న నీటి యాజమాన్య ఒప్పందం అమలులో ఉంటుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. -
నీటి పంచాయితీ తేలేనా..!
* 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఖరారు * ఎజెండాపై ఇరు రాష్ట్రాలతో చర్చించిన కేంద్ర జలవనరుల శాఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులుగా ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం ఈ నెల 21న మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ‘శ్రమశక్తి భవన్’లో నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం శుక్రవారం నోటీసులు పంపనుంది. తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు ఎస్.కె. జోషీ, శశిభూషణ్ కుమార్‌లతో గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర జలనవరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్సింగ్ ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ ఎజెండాను ఖరారు చేశారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులతోపాటు గోదావరి బేసిన్లో చేపట్టిన ప్రాజెక్టుల వివాదాలపైనా అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలని నిర్ణయించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 120 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ సర్కార్ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలంటూ ఏపీకి చెందిన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నెల రోజుల్లోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించాలని జూలై 20న సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు కేంద్ర జలవనరుల శాఖ సిద్ధమైంది. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే జల వివాదాలను పరిష్కరించేందుకు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (2) ప్రకారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. పోటా పోటీగా ఫిర్యాదులు... దేశంలో సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులతో గురువారం ఢిల్లీలో సమీక్షించిన అమర్జీత్ సింగ్...ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్‌పై తెలుగు రాష్ట్రాల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ఆయనకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. ఏపీ సర్కార్ అనుమతుల్లేకుండానే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వుతోందని, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్.కె. జోషీ ఫిర్యాదు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 90 టీఎంసీల గోదావరి జలాల్లో 45 టీఎంసీలు, పోలవరం ద్వారా డెల్టాకు మళ్లించే నీటిలో 45 టీఎంసీల వాటా తెలంగాణకు ఇవ్వాలని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ సర్కార్ కేటాయించిన నీటి కన్నా అధికంగా వినియోగిస్తోందన్నారు. మరోవైపు గోదావరి నదీ జలాల వినియోగంపై మహారాష్ట్రతో తెలంగాణ చేసుకున్న ఒప్పందాలపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. కృష్ణా బేసిన్‌లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు, మిషన్ భగీరథ సహా గోదావరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పైనా ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన అమర్జీత్ సింగ్ కృష్ణాతో పాటు, గోదావరి ప్రాజెక్టులపైనా అపెక్స్ కౌన్సిల్లో చర్చించేలా ఎజెండా ఖరారు చేశారు. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీల మధ్య పునఃపంపిణీ చేయాలని ఇరు రాష్ట్రాలు కోరగా దీనిపైనా అపెక్స్ భేటీలో చర్చిద్దామని అమర్జీత్ సింగ్ హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. -
అపెక్స్ భేటీకి సిద్ధం కండి!
రాష్ట్రానికి కేంద్ర జల వనరుల శాఖ సమాచారం * పాలమూరు, డిండి డీపీఆర్‌లపై బోర్డు నోటీసులు * పట్టిసీమ డీపీఆర్, ఆర్డీఎస్ కుడి కాలువలపై ఏపీకి నోటీసులు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెలలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించే అవకాశాలున్నాయంటూ కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే తాము కోరిన సమాచారంపై సన్నద్ధతతో ఉండాలని సూచించింది. ఇక కేంద్ర జల వనరుల శాఖ ఉత్తర్వుల మేరకు పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, పట్టిసీమ డీపీఆర్‌ను అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్తగా తెలంగాణ చేపడుతున్న పాలమూరు, డిండిలతో పాటు ఏపీ చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టులపై వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా... అపెక్స్ కౌన్సిల్ భేటీలో పరిష్కరించుకోవాలని, ఆ భేటీకి కేంద్రం చొరవ చూపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అపెక్స్ భేటీ నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాతవేనని రుజువు చేసే జీవోలను తెరపైకి తె చ్చిన తెలంగాణ... 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడానికి ఏపీ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు దక్కే వాటాల అంశాన్ని ప్రస్తావిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమైతే.. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 45 టీఎంసీలు తమకు వాటాగా దక్కుతాయని అంటోంది. ఇక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నోటిఫై కాకముందే ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువకు 4 టీఎంసీలు మళ్లించేందుకు ఏపీ సిద్ధమవుతోందని, ఇది ధిక్కారమేననీ అంటోంది. ఈ అన్ని అంశాలపై కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే తుది పరిష్కారం దక్కే అవకాశం ఉంది. -
'ఏపీ థార్ ఏడారిలా మారడం ఖాయం'
విజయవాడ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక ప్రతినిధి తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఈ నెల 20న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలని చెప్పిన నేపథ్యంలో ఆ పని వెంటనే చేయాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్నా దానికి నదీ యాజమాన్యాల బోర్డుల సిఫారసు, కేంద్ర జలవనరుల కమిషన్ సిఫార్సు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ థార్ ఏడారి అవుతుందని, 48లక్షల ఎకరాలు బీడు భూమిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ 'శని విరగడైపోయింది, అడ్డంకులు పోయాయి, రాకెట్ వేగంతో పనిచేస్తామని' సీఎం కేసీఆర్ అంటున్నారని చెప్పారు. ఇంతజరుగుతున్నా అటు కేంద్రం ఏ నోటిఫికేషన్ ఇవ్వకపోగా.. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా నీరో చక్రవర్తిలా ఊకదంపుడు ఉపన్యాసాలతో విదేశాల పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.