Water Dispute: సగం వాటాపై కొట్లాడదాం.. | Telangana Govt Focus On To Increase Share in Krishna Waters | Sakshi
Sakshi News home page

Water Dispute: సగం వాటాపై కొట్లాడదాం..

Published Tue, Jul 20 2021 1:55 AM | Last Updated on Tue, Jul 20 2021 1:55 AM

Telangana Govt Focus On To Increase Share in Krishna Waters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పెంచుకునే అవకాశాలపై దృష్టి సారిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డుల పరిధిని ఖరారు చేశామని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో అదే చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌ విచారణకు పట్టుబట్టేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్‌–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా కేంద్రానికి లేఖ రాయా లని భావిస్తోంది. అదే సమయంలో రాజ కీయంగా కూడా ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికను రూపొందిస్తోంది. అయితే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి తుది తీర్పు వెలువడేందుకు ఏళ్ల తరబడి సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా, అప్పటిలోగా, ప్రస్తుతం 66:34 శాతంగా ఉన్న నీటి వాటాల నిష్పత్తిని 50:50 శాతంగా మార్చేలా కేంద్రంపై పోరాడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ అంశంపై అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ సోమ వారం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

పునఃపంపిణీపై ఒత్తిడి పెంచాలి
కేంద్రం వెలువరించిన గెజిట్‌ తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నా న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదెలా ఉన్నా తొలుత చట్ట ప్రకారం వాటాలు పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కృష్ణా జలాల్లో ఏ లెక్కన చూసినా తమ వాటాలు పెరగాలని తెలంగాణ తొలి నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌ పరివాహక ప్రాంతంలో 68.5 శాతం రాష్ట్రానిదే అయినా.. నీటి కేటాయింపులు మాత్రం 37 శాతమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కృష్ణా పరివాహకం కింద సాగు యోగ్య భూమి తెలంగాణలో 37.11లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉందని చెబుతోంది. ఈ లెక్కన రాష్ట్రానికి 811 టీఎంసీల్లో కనీసంగా 560 టీఎంసీలు దక్కాలని అంటోంది. ఈ అంశాలన్నీ అనేకమార్లు కేంద్రం దృష్టికి తెచ్చింది.

గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలోనూ ప్రస్తావించగా.. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటే న్యాయసలహా తీసుకొని కొత్త ట్రిబ్యునల్‌పై ఆలోచన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పిటిషన్‌ విత్‌డ్రా చేసుకుంది. తాజాగా కేంద్రం గెజిట్‌ వెలువరించిన నేపథ్యంలో నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్‌–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. సోమవారం జరిగిన సమీక్షలో కూడా తెలంగాణకు వాటాలు పెరిగేలా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. దీంతో పాటే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించి, వాటికి అనుమతులు పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేయడంపై భేటీలో చర్చించారు. 

ఎలా చూసినా రాష్ట్ర వాటా పెరగాలి: రజత్‌కుమార్‌
తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ చెప్పారు. ఇంజనీర్లతో సమీక్షకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరివాహకం, ఆయకట్టు, జనాభా.. ఏ లెక్కన చూసినా తెలంగాణకు 811 టీఎంసీల్లో 560 టీఎంసీలు దక్కాలి. అయితే తాత్కాలికంగా అయినా ఏపీ, తెలంగాణకు చెరిసగం నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. అపెక్స్‌ కౌన్సిల్‌లో చెప్పిన మేరకు, సెక్షన్‌–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి వాటాలు తేల్చాలి..’ అని ఆయన అన్నారు. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌తో న్యాయపరంగా, సాంకేతికంగా, పాలనా పరంగా ఏర్పడే ఇబ్బందులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే 2014కు ముందు చేపట్టిన దేవాదుల వంటి ప్రాజెక్టులకు డీపీఆర్‌లు కోరడంపైనే అభ్యంతరాలున్నాయని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement