
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జల వివాదాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ నెల 25న నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏసీ మల్లిక్ లేఖలు రాశారు. అనుకూల పరిస్థితులు లేకపోవడంతో భేటీని వాయిదా వేస్తున్నామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే చెబుతామని ఆ లేఖలో వెల్లడించారు. అయితే నాలుగు రోజుల కిందట కోవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్‌గా తేలిందని కేంద్ర జలశక్తిమంత్రే స్వయంగా ప్రకటించడంతో పాటు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.