సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి జవసత్వాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బోర్డు పరిధి, కార్య నిర్వాహక నియమావళి (వర్కింగ్ మాన్యువల్)ను తక్షణమే ఖరారు చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్ మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన ఆరున్నరేళ్ల తర్వాత పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయడం ద్వారా బోర్డుకు పూర్తి స్థాయిలో అధికారాలను కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధం కావడం గమనార్హం. కృష్ణా జలాల పంపిణీ, వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని విభజన చట్టం సెక‌్షన్-85లో కేంద్రం పేర్కొంది. ఆ మేరకు కృష్ణా బోర్డును ఏర్పాటు చేస్తూ 2014 మే 28న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లో అదనపు కార్యదర్శి స్థాయి అధికారిని బోర్డు చైర్మన్‌గానూ, సీఈ స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగానూ, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ఇంజనీర్- ఇన్-చీఫ్‌లను సభ్యులుగా, జలవిద్యుత్ నిపుణుడిని బోర్డు సభ్యుడిగా నియమించాలని అందులో పేర్కొన్నారు. అయితే విభజన చట్టం సెక‌్షన్-85(2)కు విరుద్ధంగా కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
వివాదాలు ఇలా...
కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి (కేడబ్ల్యూడీటీ)-2 తీర్పును కేంద్రం నోటిఫై చేసే వరకూ బోర్డు పరిధిని ఖరారు చేయరాదని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తుండటంతో ఇప్పటిదాకా పరిధిని ఖరారు చేయలేదు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణకు కేంద్రం అప్పగించింది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ తన అధీనంలోకే తీసుకోవడం వివాదాలకు దారి తీసింది.
నీటి వాటాల కేటాయింపు...
ఉమ్మడి రాష్ట్రంలో నైసర్గిక స్వరూపం ఆధారంగా కేడబ్ల్యూడీటీ-1 ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం కేడబ్ల్యూడీటీ-2 గడువును కేంద్రం పొడిగించింది. ఆ తీర్పు వెలువడే వరకూ కేడబ్ల్యూడీటీ-1 తీర్పు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీల నిష్పత్తిలో వాటాలను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుల మేరకు నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును నిర్దేశించింది.
ఇన్నాళ్లూ అధికారాలు లేకపోవడంతో...
- పరిధి, వర్కింగ్ మాన్యువల్‌ను ఖరారు చేయకపోవడంతో బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి.
- నీటి కేటాయింపులు చేస్తూ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కిన రాష్ట్రంపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది.
- బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు నీటిని తరలించడం.. సాగర్ కుడి, ఎడమ కాలువలకు కేటాయించిన నీటిని విడుదల చేయకుండా మోకాలడ్డటం ద్వారా ఏపీ ప్రయోజనాలను తెలంగాణ దెబ్బతీస్తూ వస్తోంది.
- విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీల పరిశీలనకు డీపీఆర్‌లను పంపకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, ఎత్తిపోతలను తెలంగాణ సర్కారు కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ సామర్థ్యాలను పెంచింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసినా బోర్డు చర్యలు తీసుకోలేకపోయింది.
బోర్డు అధీనంలోకి శ్రీశైలం, సాగర్..
తమ ప్రయోజనాలకు తెలంగాణ విఘాతం కలిగిస్తున్నందున బోర్డు పరిధిని నోటిఫై చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపినప్పటికీ బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
పరిధిని నోటిఫై చేస్తే శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ఆ ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ అధికారులు బోర్డు పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది. ఇరు రాష్ట్రాల బేసిన్‌లో ప్రాజెక్టుల ద్వారా కేటాయింపులు, విడుదల, వినియోగించిన నీటిని ఎప్పటికప్పుడు టెలీమీటర్ల ద్వారా బోర్డు లెక్కిస్తుంది. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment