
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నదీజలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెల రోజుల్లో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ భావిస్తున్నట్లు కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు తెలిపాయి. కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కేంద్ర మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ వంటి అంశాలపై వారితో చర్చించారు.
అపెక్స్ భేటీ ఎజెండాను పంపాలని కోరినా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు పంపలేదని బోర్డు అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే బోర్డుల దృష్టిలో ఉన్న అంశాలతో ఎజెండా ఖరారు చేసి పంపితే నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహిస్తానని వెల్లడించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటే వర్కింగ్ మాన్యువల్‌పైనా మరోసారి ఇరు రాష్ట్రాల వాదనలు విని త్వరగా ఖరారు చేయాలని సూచించినట్లు తెలిసింది.
‘జలసౌధ’లో కరోనా కలవరం..
నీటిపారుదల శాఖ కార్యాలయమైన జలసౌధలో కరోనా అంశం కలవరపెడుతోంది. ఇప్పటికే జలసౌధలో ఒక ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా జిల్లాలో పనిచేస్తున్న మరో ఇంజనీర్ సైతం వైరస్ బారినపడ్డారు. దీంతోపాటే జలసౌధలోనే ఉన్న కృష్ణా, గోదావరి బోర్డులు ఈ నెల 4, 5 తేదీల్లో జరిపిన భేటీలకు హాజరైన ఓ జర్నలిస్టుకు కరోనా సోకడంతో బోర్డులో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో జలసౌధలోకి సందర్శకులకు అనుమతిని నియంత్రించారు.
Comments
Please login to add a commentAdd a comment