పంకజ్‌కుమార్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు.
ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్‌కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.
సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన
కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్‌లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు.
ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్‌కుమార్ హామీ ఇచ్చారు.
ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ
కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు.
అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది.
శ్రీశైలం, సాగర్‌లను అప్పగించాల్సిందే: కేంద్రం
రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్‌కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు.
కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్‌లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment