వాటా నీటినే వాడుకుంటాం | AP CM YS Jaganmohan Reddy has clarified on Rayalaseema Lift Projects | Sakshi
Sakshi News home page

వాటా నీటినే వాడుకుంటాం

Published Wed, Oct 7 2020 3:35 AM | Last Updated on Wed, Oct 7 2020 7:50 PM

AP CM YS Jaganmohan Reddy has clarified on Rayalaseema Lift Projects - Sakshi

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మంత్రి అనిల్, అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని, దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను మెరుగు పరచడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సీఎంలతో మంగళవారం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా గురించి స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
 
వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే 
► రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక శాతం ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఈ జిల్లాలు తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడ్డాయి. 

► దేశంలో థార్‌ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. అనంతపురం జిల్లా డీడీపీ (ఎడారి నివారణ పథకం) పరిధిలో, కర్నూలు, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు డీపీఏపీ (కరవు ప్రాంత అభివృద్ధి పథకం) పరిధిలో ఉండటాన్ని బట్టి చూస్తే ఆ జిల్లాలు ఎంతగా వెనుకబడ్డాయో.. నీళ్లు లేక ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో విశదం చేసుకోవచ్చు.  

► వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చడం, సమగ్రాభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో స్థైర్యం నింపాల్సిన నైతిక బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలదే అన్న అంశాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి, తెలంగాణ సీఎంలకు వినయపూర్వకంగా గుర్తు చేస్తున్నా.  

మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి వేరు 
► తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఈ కోవలోకే వచ్చినా, ఆ జిల్లాల్లో 30 శాతం కంటే ఎక్కువ భూమికి సాగునీరు అందుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు 142 టీఎంసీలు, నల్గొండ జిల్లాకు 104 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ మూడు జిల్లాలు డీపీఏపీ పరిధి నుంచి బయటపడి.. సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్నాయి.  

► కానీ ఇదే రాయలసీమ, ప్రకాశం జిల్లాలు నిత్యం కరవుతో తల్లడిల్లుతున్నాయి. ఒక్కో జిల్లాకు కనీసం 50 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేదు. సాధారణంగా ఒక జిల్లా స్వయం సమృద్ధి సాధించాలంటే కనీసం వంద టీఎంసీలు అవసరమన్నది అందరికీ తెలిసిందే.  

► ఈ లెక్కన శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మొత్తం ఆరు జిల్లాలు అభివృద్ధి సాధించాలంటే 600 టీఎంసీలు అవసరం. ఇదే అంశంపై 2019 జూన్‌ 28న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ ఒక జిల్లా అభివృద్ధి సాధించాలంటే వంద టీఎంసీలు అవసరమని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రత్యేకించి రాయలసీమ ప్రజలకు కూడా వర్తిస్తుంది. 

వాటా నీటినే వినియోగించుకోలేకపోతున్నాం 
► వాస్తవం ఏమిటంటే.. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌ఆర్‌) ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే వస్తాయి. 881 నుంచి 885 అడుగుల మధ్య నీటి మట్టం ఉన్నప్పుడే పీహెచ్‌ఆర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయి. కానీ.. గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే శ్రీశైలంలో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. 

► చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, కేసీ కెనాల్‌ సప్లిమెంటేషన్‌కు పది టీఎంసీలు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని గాలేరు–నగరికి 38 టీఎంసీలు, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీ–నీవాకు 40 టీఎంసీలు.. వాటితోపాటు సీబీఆర్‌కు పది, పైడిపాళెంకు ఆరు, మైలవరానికి ఏడు, సర్వారాయసాగర్‌కు మూడు, గోరకల్లుకు 12.4, అవుకుకు 4.14, సోమశిలకు 78, కండలేరుకు 68 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులు దశాబ్దాలుగా శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. 

► 1983లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెన్నై తాగునీటికి కేటాయించిన 15 టీఎంసీల్లో ఎనిమిది టీఎంసీలను జూలై నుంచి అక్టోబర్‌ మధ్య, నాలుగు టీఎంసీలను జనవరి నుంచి ఏప్రిల్‌ «మధ్య సరఫరా చేయాలి. కానీ.. జనవరి నాటికి శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల పీహెచ్‌ఆర్‌ ద్వారా చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. 

► విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజూ 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తీసుకెళ్లేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ప్రాజెక్టులో 796 అడుగుల నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా తరలించే సామర్థ్యం ఉంది.  

► ఆంధ్రప్రదేశ్‌లో 2.45 కోట్ల జనాభాతో 98,001 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించిన ఆరు జిల్లాలు నీటి అవసరాల కోసం శ్రీశైలంపై ఆధారపడితే.. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొంత భాగం మాత్రమే శ్రీశైలంపై ఆధారపడ్డాయి. 

వాటా జలాలను వినియోగించుకోవడానికే..  
► కృష్ణా జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌ 512, తెలంగాణ 299 టీఎంసీలను వినియోగించుకునేలా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. శ్రీశైలం నుంచి రోజుకు సాగునీటి అవసరాల కోసం మూడు టీఎంసీలు.. విద్యుదుత్పత్తి ద్వారా నాలుగు టీఎంసీలు వెరసి ఏడు టీఎంసీలను 800 అడుగుల నీటి మట్టం కంటే దిగువ నుంచే తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దీని వల్ల పీహెచ్‌ఆర్‌ ద్వారా కాలువలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు దిగువన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల వాటా జలాలను వినియోగించుకోవడం కష్టమవుతోంది.  

► వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పీహెచ్‌ఆర్‌ కింద తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీళ్లందించడం కోసమే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించేలా వరదను మళ్లించడానికి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ల కాలువ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం.  

► కేటాయించిన నీటి కంటే చుక్క నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనంగా వినియోగించుకోం. ఈ ఎత్తిపోతల ద్వారా పాత ఆయకట్టుకే నీళ్లందిస్తాం. నీటిని నిల్వ చేయడానికి కొత్తగా ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదు. 

ఒక బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌కు నీటి మళ్లింపు న్యాయమే  
► కేడబ్ల్యూడీటీ–1 తీర్పులో 128వ పేజీ ప్రకారం అంతర్రాష్ట్ర నది అయిన కృష్ణా నుంచి ఇతర నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్‌)కు నీటిని మళ్లించడం న్యాయమే. ఈ క్రమంలోనే కృష్ణా డెల్టాకు 181.2, కేసీ కెనాల్‌కు 39.9, నాగార్జునసాగర్‌ కుడి కాలువకు 132, తుంగభద్ర హెచ్చెల్సీకి 32.5, గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలను  కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఆ తర్వాత కేడబ్ల్యూడీటీ–2 తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది.  

► దీన్ని బట్టి చూస్తే ఒక నది నుంచి మరొక నదికి నీటిని మళ్లించడం న్యాయమేనన్నది స్పష్టమవుతోంది. దేశంలో రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, కృష్ణా, మూలమట్ట, ఇంద్రాయణి, పెరియార్, చెలకుడి నదుల నుంచి ఇతర నదులకు నీటిని మళ్లించారు.  

► కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య 1978 ఆగస్టు 4న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీటిని అందించేందుకు ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 45 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ పదే పదే కోరుతోంది.  

► అదే తెలంగాణ హైదరాబాద్‌ తాగునీటి సరఫరా (6.43 టీఎంసీలు), ఎస్సారెస్పీ (68.48), కాళేశ్వరం (83.19), జీఎల్‌ఐఎస్‌ (24.65), సీతారామ (21.75), ఎస్సారెస్పీ వరద కాలువ (6.65), రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలు, వెరసి 214 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా వాటా ఇవ్వాలి. 

తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలి 
► ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం పర్యవేక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు.. నాగార్జునసాగర్‌ బాధ్యతను తెలంగాణకు అప్పగించారు. కానీ.. తమ భూభాగంలో ఉందనే నెపంతో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన అధీనంలో ఉంచుకుంది. అదే నాగార్జునసాగర్‌లో కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ ఏపీ భూభాగంలో ఉన్నా, తెలంగాణ తన అధీనంలోకి తీసుకుంది.  

► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో 796 అడుగుల నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోయి రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీళ్లందించలేని దుస్థితి. సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు అధీనంలోకి తేవాలి.  

► విభజన చట్టంలో సెక్షన్‌ 85(2) ప్రకారం కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని 2019లో హోం శాఖ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తక్షణమే అమలు చేయాలి. 

గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయండి  
► వ్యాప్కోస్‌ నివేదిక ప్రకారం గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1430 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై చేపట్టి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాటికి 776, తెలంగాణలో ఉన్న వాటికి 650 టీఎంసీలు అవసరం.
 
► కానీ.. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 225 నుంచి 450 టీఎంసీలకు, జీఎల్‌ఐఎస్‌ సామర్థ్యాన్ని 22 టీఎంసీలకు పెంచింది. తుపాకులగూడెంను వంద టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతలను వంద టీఎంసీలు, వాటర్‌ గ్రిడ్‌ను 23.76 టీఎంసీలు, రాజపేట(0.35), చనాకా–కొరటా(5), పింపిరాడ్‌–పర్సోడా(1.2), రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలను తరలించే పనులు కొత్తగా చేపట్టింది. వెరసి 1,355 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు చేపట్టింది.  

► దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. తక్షణమే అపెక్స్‌ కౌన్సిల్‌ జోక్యం చేసుకుని.. వాటి డీపీఆర్‌లను తెప్పించుకుని పరిశీలించాలి. గోదావరి జలాలను పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. 

► మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు వాటా నీటిని వినియోగించుకోకపోవడం వల్లే గోదావరి 1,400 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు తేలింది. గోదావరిలో గరిష్టంగా 1990–91లో 6,472 టీఎంసీలు.. 2009–10లో కనిష్టంగా 1,025 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు రికార్డుల్లో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున మూడు వేల టీఎంసీల మిగులు జలాలు ఉంటాయి. మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉంటంది. ఈ నీటిని కొత్త ప్రాజెక్టులకు కేటాయించాలి. 

శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు సహకరించాలి  
► తెలంగాణ నిర్వహిస్తోన్న నాగార్జునసాగర్, కాలువలకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం తెచ్చి ఆ«ధునికీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్వహిస్తోన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో రికార్డు స్థాయిలో 26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీని వల్ల ప్రాజెక్టు దెబ్బతింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్‌ సేఫ్ట్‌ కమిటీ తనిఖీ చేసి.. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి రూ.900 కోట్లు అవసరమని తేల్చింది.  

► ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది భారమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వాటాలు వేసుకుని ఆ నిధులను సమకూర్చి.. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి సహకరించాలి.  

► జల వనరులను జాతీయ సంపదగా గుర్తించాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీటిని సమంగా సరఫరా చేసేలా చూడాలి. నదికి వరద వచ్చినప్పుడు.. ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షించి.. వరదను దిగువకు విడుదల చేసేలా చూసి.. పరీవాహక ప్రాంతంలో ఉన్న అందరికీ వాటా మేరకు జలాలు దక్కేలా చూడాలి’ అని సీఎం జగన్‌ వివరించారు. అనంతరం ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ అందజేశారు.   

అప్పుడలా.. ఇప్పుడిలా.. 
2016 సెప్టెంబరు 9న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా తమకు కేటాయించిన వాటా నీటిని వినియోగించుకోవడానికి పరిమితమవుతామని.. అదనంగా నీటిని వినియోగించుకోబోమని తెలంగాణ పేర్కొంది. 

ఇప్పుడు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసి.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించడాన్ని తెలంగాణ ఎలా సమర్థించుకుంటుంది?   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement