రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలంటే శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం మినహా ఏపీకి వేరే దారి లేదు.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా నీటిని వినియోగించుకుని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపట్టామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 7న షెకావత్ రాసిన లేఖకు వైఎస్ జగన్ ప్రత్యుత్తరమిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు కొత్తవి కావని తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ(కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్)1 చేసిన కేటాయింపులు, 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ప్రకారం మా వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్తగా కాలువలు తవ్వడం, నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలుగానీ, అదనపు ఆయకట్టుగానీ చేర్చడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టును స్థిరీకరించడం కోసమే దీన్ని చేపట్టామన్నారు. ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లందించడానికే చేపట్టారని నిర్ధారించాయని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కానే కాదన్నారు. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను ఆపేలా నియంత్రించకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి అవకాశం కల్పించాలని వి/æ్ఞప్తి చేస్తూ అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ మంగళవారం లేఖ రాశారు . సీఎం జగన్ లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
ఈనెల 4న మీకు లేఖ పంపాం..
► అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలనిచైర్మన్ నిర్ణయించినట్లు అజెండాను పంపుతూ జూలై 28న Æరాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది.
ఈ సమాశానికి నేను హాజరవుతానని తెలియచేస్తూ అజెండా అంశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించాం. ఆ మేరకు ఈ నెల 4న కేంద్ర జల్ శక్తి శాఖకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అయితే ఈనెల 7న మీరు రాసిన లేఖలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొనడంలో వాస్తవం లేదన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా.
► రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం నుంచి రోజుకు ఎనిమిది టీఎంసీలు తరలించేవి కొత్త ప్రాజెక్టులని మీరు రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ.. ఆ ప్రాజెక్టులు కొత్తవి కావు. కేడబ్ల్యూడీటీ1 కేటాయింపులు, 2015లో ఇరు రాష్ట్రాలకు చేసిన పంపకాల ప్రకారం వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవటానికే వీటిని చేపట్టాం.
అనుమతులు లేకుండానే పలు ప్రాజెక్టులు..
► విభజన చట్టం సెక్షన్ 85(8)డీ ప్రకారం ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు, విభజన నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపదని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్థారించాక, సాంకేతిక అనుమతి తీసుకున్న తరువాతే కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి.
► కానీ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పాలమూరురంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. ఈ పథకాల కింద కొత్తగా కాలువలు తవ్వుతోంది. నీటి నిల్వ సామర్థ్యం ఉండే రిజర్వాయర్లు నిర్మిస్తోంది. కొత్త ఆయకట్టును సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు సెప్టెంబరు 21, 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
తీర్పు నోటిఫై కాకున్నా పనులు..
► కేడబ్ల్యూడీటీ2లో కేటాయించిన నీటిని వాడుకోవడానికే పాలమూరురంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టామంటూ తెలంగాణ సర్కార్ సమర్థించుకుని పనులను కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా కేడబ్ల్యూడీటీ 2 తీర్పు నోటిఫై కాకున్నా పనులు కొనసాగిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మరో సారి అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయించినా ఆ ప్రాజెక్టుల పనులను నిలిపేయాలని కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశాన్ని నిర్వహించాలని.. తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఇప్పటిదాకా నిర్వహించలేదు.
► శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం చేరడానికి ముందే జూరాల ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కారు
నీటిని తరలిస్తోంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని వినియోగించుకుంటోంది.
► శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలను తలించడానికి తెలంగాణసర్కార్ కొత్తగా నాలుగు ప్రాజెక్టులను చేపట్టింది. 796 అడుగుల నుంచే ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 42 వేల క్యూసెక్కులను తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి దిగువకు తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. దీని వల్ల కేడబ్ల్యూడీటీ1 చట్టబద్ధంగా ఏపీకి ఇచ్చిన వాటా నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొంది.
పోతిరెడ్డిపాడు ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు..
► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు. శ్రీశైలం నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరునగరి ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి చేసిన ఏర్పాటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే వీలుంది. కానీ.. ప్రాజెక్టులో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి పది నుంచి 15 రోజులు కూడా ఉండటం లేదు. నీటి మట్టం 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కేవలం ఏడు వేల క్యూసెక్కులను మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే కృష్ణా బోర్డు కేటాయింపులు ఉన్నా సరే.. నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది.
బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ పనులు..
► శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు మే 14న మేం లేఖ రాశాం. ఆ ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని మే 30న తెలంగాణ సర్కార్‌నుబోర్డు ఆదేశించినా Ðవాటిని కొనసాగిస్తోంది. ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటామని.. అంతకు మించి వాడుకోబోమని తెలంగాణ సర్కార్ ఎక్కడా చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 854 అడుగులకుపైనే నీటిని తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెప్పడం ఎంతవరకూ న్యాయం?
గోదావరి బేసిన్‌లో కూడా..
► గోదావరి బేసిన్‌లో కూడా తెలంగాణ సర్కార్ కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని గోదావరి బోర్డు సమావేశంలో చర్చించాం.
మా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం..
► రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నియంత్రిస్తున్నట్లుగా తెలంగాణకు మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
► రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కానేకాదని ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం నివేదిక తమ అభిప్రాయాలు చెప్పాయి. గత నెల 29న ఈ పథకానికి అనుమతి ఇస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలను మీకు పంపుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment