సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రాజెక్టుల నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ.. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన జలాలు వృథాగా కడలి పాలవుతుండటాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ సర్కారు దుందుడుకు చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా దక్కిన వాటా జలాలను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని అక్రమంగా నీటిని తోడి విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించడంలో వివక్ష చూపుతున్న కృష్ణా బోర్డుకు తటస్థంగా వ్యవహరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించటానికంటే ముందే తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తనిఖీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టుల్లో సాగునీటి పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, తాగునీటి పథకాలను బోర్డు పరిధిలోకి తెచ్చి వాటికి సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి సమర్థంగా పథకాలను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విన్నవించారు. ఈ మేరకు షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ సోమవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
విలువైన జలాలు కడలి పాలు..
విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణా బోర్డు..అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన తాత్కాలిక నీటి ఒప్పందాలకు తిలోదకాలు ఇస్తూ తెలంగాణ సర్కారు అక్రమంగా నీటిని వాడుకోవటాన్ని ఈ నెల 1వతేదీన లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాం. తెలంగాణ దుందుడుగా వ్యవహరిస్తూ విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. దీనివల్ల మాకు హక్కుగా దక్కిన వాటా జలాలను కోల్పోవాల్సి వస్తుండటాన్ని మరోసారి మీ దృష్టికి తెస్తున్నాం.
శ్రీశైలంలో వచ్చిన నీరు వచ్చినట్లుగా తోడకం..
సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలించాలన్న నిబంధనను నీటి సంవత్సరం తొలిరోజే అంటే జూన్ 1 నుంచే తెలంగాణ తుంగలో తొక్కింది. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువనే ఉన్నా నీటి కేటాయింపులకు సంబంధించి కృష్ణా బోర్డుకు ఎలాంటి ప్రతిపాదన పంపకుండానే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేన్నప్పటికీ తెలంగాణ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తిని చేయాలని జూన్ 28న జీవో ఆర్‌టీ నెంబర్ 34 జారీ చేసింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీశైలంలోకి 26 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 19 టీఎంసీలను దిగువకు తరలించింది. తెలంగాణ మొండి వైఖరితో విద్యుదుత్పత్తి చేయడం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకోవడం కష్టంగా మారింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటేనే గ్రావిటీతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చు. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. తెలంగాణ దుందుడుకు వైఖరి దుర్భిక్ష ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడికి దారి తీస్తుంది.
తెలంగాణ కోటాలోనే లెక్కించాలి..
నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే ఆపరేషనల్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్‌లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తోడేస్తోంది. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లా ఉపయోగపడే పులిచింతల నుంచి కూడా విజయవాడ సర్కిల్ ఎస్‌ఈ నుంచి ప్రతిపాదనలు రాకుండానే ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. ఈ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. వాటా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోకుండా వృథాగా సముద్రం పాలు చేయాలన్న ఉద్దేశంతో అక్రమంగా తోడేస్తున్న నీటిని తెలంగాణ తన కోటాగా అంగీకరించిన 299 టీఎంసీల వాటా కింద లెక్కించాలి.
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోరేం?
వాటా జలాలను వాడుకోనివ్వకుండా అడ్డుకుని ఆంధ్రప్రదేశ్‌ను నీటి సంక్షోభంలోకి నెట్టాలన్న ప్రధానోద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడాన్ని అనేకసార్లు కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చాం. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ అక్రమంగా చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచి శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 0.4 టీఎంసీలను తరలిస్తోంది. ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచి శ్రీశైలంలో 825 అడుగుల నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున తోడేస్తోంది. వీటి ద్వారా అక్రమంగా 200 టీఎంసీలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ తరలిస్తోంది. ఇవికాకుండా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తెలంగాణ తరలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, అక్రమంగా సామర్థ్యం పెంచిన ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని అనేకసార్లు కేంద్ర జల్ శక్తి శాఖను, కృష్ణా బోర్డును కోరాం. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ డీపీఆర్‌లను పరిశీలించకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేసేలా తెలంగాణపై ఇప్పటిదాకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఆంధ్రప్రదేశ్‌పై బోర్డు వివక్ష
తెలంగాణ ప్రభుత్వం చేసే తప్పుడు ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్న కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ సహేతుకమైన ఫిర్యాదులను మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కృష్ణా బోర్డుకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. వీటిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించడంలో కృష్ణా బోర్డు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
చుక్క నీరూ మిగలదు..
ఆంధ్రప్రదేశ్‌కు వాటా జలాలను దక్కనివ్వకుండా చేసేందుకు తెలంగాణ కొత్తగా వరుసగా అక్రమ ప్రాజెక్టులను చేపట్టింది. బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా విద్యుదుత్పత్తిపై మార్గదర్శకాలను బుట్టదాఖలు చేస్తూ శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలిస్తోంది. తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీపై దుర్భిక్ష ప్రాంతాలకు చుక్క నీటిని కూడా తరలించటానికి ఆంధ్రప్రదేశ్‌కు ఆస్కారం ఉండదు.
రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం..
శ్రీశైలంలో 800 అడుగుల నుంచే తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడేస్తుండటం, 796 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి చేస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటుండటం వల్ల 854 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు, చెన్నెకి తాగునీటిని సరఫరా చేయడానికి తెలంగాణ తరహాలోనే 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడం మినహా మరో మార్గం లేదు. ఈ ప్రాజెక్టులకు కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా నీటి కేటాయింపులు ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించడం లేదు. కొత్తగా కాలువలు తవ్వడం లేదు. నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు నిర్మించడం లేదు. మాకు దక్కిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు, చెన్నై తాగునీటి అవసరాలు తీర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం.
తెలంగాణకు కృష్ణా బోర్డు వంతపాట..
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తనిఖీ చేయాలని అనేక సార్లు కృష్ణా బోర్డుకు వి/æ్ఞప్తి చేశాం. నీటి కేటాయింపులు లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ పురోగతిలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని అంచనా వేయడానికి తెలంగాణలో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండా ఎన్జీటీ ఉత్తర్వులను బూచిగా చూపి రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని కృష్ణా బోర్డు పదేపదే ప్రతిపాదిస్తోంది. కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించి రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంపై నిర్ణయం తీసుకోవాలని జూన్ 22న కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసిన అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. తటస్థంగా వ్యవహరిస్తూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన కృష్ణా బోర్డు రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలంటున్న తెలంగాణకు వంత పాడుతోంది. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment