కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ | Union Home Ministry Green signal To Krishna Basin Projects Under Board | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

Published Sun, Apr 11 2021 3:05 AM | Last Updated on Sun, Apr 11 2021 9:10 AM

Union Home Ministry Given Green signal To Krishna Basin Projects Under Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర హోం శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర పునర్వి భజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా బోర్డు అధికారిక పరిధికి సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖ అందించిన ముసాయిదా నోటిఫికేషన్‌కు ఓకే చెప్పిన కేంద్ర హోంశాఖ, దీనికి సంబందించి అధికారిక నోటిఫికే షన్‌ను త్వరగా విడు దల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయించే అధికారిక నోటిఫికేషన్‌ను ఉగాది తర్వాత ఏ క్షణమైనా కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారి పరిధిని నోటిఫై చేస్తే కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులందరూ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నారు. 

తెలంగాణ వ్యతిరేకిస్తున్నా..
కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్‌ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే బోర్డు పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డు చేసేదేమీ లేక చేతులెత్తే స్తోంది. రాష్ట్రాల మధ్య తరుచూ తలెత్తుతున్న వివాదాలకు పరిష్కారం దొరకాలంటే ప్రాజెక్టులపై అజమాయిషీ తమకే ఇవ్వాలని బోర్డు కోరుతోంది. కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలంగాణ, ఏపీల నియంత్రణలోని ప్రాజెక్టులు, ఇప్పటికే చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్ధం చేసి ఇరు రాష్ట్రాలకు పంపింది. గతంలో వెలువరించిన ట్రిబ్యునల్‌ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల విద్యుదుత్పత్తిని సైతం తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఆరేళ్లుగా ఈ నోటిఫికేషన్‌పై బోర్డుకు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా ఎటూ తేలడం లేదు. 

అపెక్స్‌ భేటీల్లో కేసీఆర్‌ ఆక్షేపణ...
బేసిన్‌లోని ప్రాజెక్టులకు బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలని తేల్చిచెప్పారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలని సూచించారు. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వస్తోంది. అయితే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్‌ భేటీలో బోర్డు పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు.

ఉగాది తర్వాత ఉత్తర్వులు...
షెకావత్‌ ప్రకటన అనంతరం అప్పటికే రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను నోటిఫై చేసేందుకు కేంద్రానికి పంపింది. అయితే వివిధ కారణాల వల్ల దీనిపై చర్చించలేకపోయిన కేంద్రం మూడ్రోజుల కింద దీనిపై వరుస భేటీలు నిర్వహించింది. మొదట కృష్ణా బోర్డు ఛైర్మన్‌ పరమేశం, సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేతో చర్చించిన కేంద్ర జల్‌శక్తి శాఖ అనంతరం శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మరోమారు దీనిపై చర్చించింది. ఇప్పటికే బోర్డు పరిధిని నోటిఫై చేయడంలో ఆలస్యం జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అమిత్‌ షా, దీనిపై త్వరగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత కృష్ణా బోర్డు అధికార పరిధికి సంబంధించి ఉత్తర్వులు రానున్నాయి. 

బోర్డు పరిధిలో ఉండే ప్రాజెక్టులు ఇవే
బోర్డు పరిధి నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్‌ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్‌పీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement