Krishna Basin Project
-
ఇక నాగార్జునసాగర్ వంతు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి నిర్వహణ అంశాలపై అధ్యయనం చేసేందుకు బోర్డు మరోమారు రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో పర్యటించి ఓ ముసాయిదాను రూపొందించిన బోర్డు సబ్ కమిటీ, నాగార్జునసాగర్ పరిధిలోనూ ఆపరేషన్ ప్రోటోకాల్‌పై అధ్యయనం చేసి నివేదిక తయారు చేయనుంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యుడు రవికుమార్ పిళ్లైల నేతృత్వంలోని బృందం ఈ నెల 12 లేక 15 నుంచి రెండ్రోజుల పాటు సాగర్ పరిధిలో పర్యటించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లతో చర్చించనుంది. సాగర్ పరిధిలో ఉన్న కుడి, ఎడమ కాల్వలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ వంటి ఔట్లెట్లను బోర్డు పరిధిలోకి తేవాలని ఇదివరకే బోర్డులో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ పరిధిలోని ఔట్లెట్ల అప్పగింతపై తెలంగాణ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా పవర్‌హౌస్‌ల స్వాధీనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అంటోంది. దీంతో గెజిట్ అమల్లోకి రాకున్నా, తీర్మానం చేసిన ఔట్లెట్ల పరిస్థితులు అధ్యయనం చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. బోర్డులో చర్చించిన తర్వాతే ఏదైనా.. ఔట్లెట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నీటి అవసరాలు, వినియోగం, సిబ్బంది, విద్యుత్ కేంద్రాలకు నీటి విడుదల, వరద అంచనా తదితరాలను కమిటీ పరిశీలించనుంది. స్థానిక ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనుంది. అయితే శ్రీశైలం పరిధిలో పర్యటన అనంతరం సిద్ధం చేసిన ముసాయిదాపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో, దీనిపై పూర్తి స్థాయి బోర్డులో చర్చించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సాగర్ పరిధిలోనూ ఆపరేషన్ ప్రోటోకాల్ సిద్ధం చేసినా.. బోర్డు భేటీలో చర్చకు పెట్టాక, ఇరు రాష్ట్రాల ఆమోదం మేరకే ముందుకెళ్లనున్నారు. -
కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పునర్వి భజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా బోర్డు అధికారిక పరిధికి సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖ అందించిన ముసాయిదా నోటిఫికేషన్‌కు ఓకే చెప్పిన కేంద్ర హోంశాఖ, దీనికి సంబందించి అధికారిక నోటిఫికే షన్ను త్వరగా విడు దల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయించే అధికారిక నోటిఫికేషన్‌ను ఉగాది తర్వాత ఏ క్షణమైనా కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారి పరిధిని నోటిఫై చేస్తే కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులందరూ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నారు. తెలంగాణ వ్యతిరేకిస్తున్నా.. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే బోర్డు పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డు చేసేదేమీ లేక చేతులెత్తే స్తోంది. రాష్ట్రాల మధ్య తరుచూ తలెత్తుతున్న వివాదాలకు పరిష్కారం దొరకాలంటే ప్రాజెక్టులపై అజమాయిషీ తమకే ఇవ్వాలని బోర్డు కోరుతోంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ, ఏపీల నియంత్రణలోని ప్రాజెక్టులు, ఇప్పటికే చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్ధం చేసి ఇరు రాష్ట్రాలకు పంపింది. గతంలో వెలువరించిన ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల విద్యుదుత్పత్తిని సైతం తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఆరేళ్లుగా ఈ నోటిఫికేషన్‌పై బోర్డుకు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా ఎటూ తేలడం లేదు. అపెక్స్ భేటీల్లో కేసీఆర్ ఆక్షేపణ... బేసిన్‌లోని ప్రాజెక్టులకు బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్ కౌన్సిల్ భేటీల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలని తేల్చిచెప్పారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలని సూచించారు. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వస్తోంది. అయితే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ భేటీలో బోర్డు పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఉగాది తర్వాత ఉత్తర్వులు... షెకావత్ ప్రకటన అనంతరం అప్పటికే రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను నోటిఫై చేసేందుకు కేంద్రానికి పంపింది. అయితే వివిధ కారణాల వల్ల దీనిపై చర్చించలేకపోయిన కేంద్రం మూడ్రోజుల కింద దీనిపై వరుస భేటీలు నిర్వహించింది. మొదట కృష్ణా బోర్డు ఛైర్మన్ పరమేశం, సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేతో చర్చించిన కేంద్ర జల్‌శక్తి శాఖ అనంతరం శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మరోమారు దీనిపై చర్చించింది. ఇప్పటికే బోర్డు పరిధిని నోటిఫై చేయడంలో ఆలస్యం జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అమిత్ షా, దీనిపై త్వరగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత కృష్ణా బోర్డు అధికార పరిధికి సంబంధించి ఉత్తర్వులు రానున్నాయి. బోర్డు పరిధిలో ఉండే ప్రాజెక్టులు ఇవే బోర్డు పరిధి నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి. -
చుక్క చుక్కకూ లెక్క
సాక్షి, అమరావతి: ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను వినియోగించుకోవడంలోనూ వినూత్న రీతిలో యాజమాన్య పద్ధతులను అనుసరిస్తోంది. పన్ను, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు తదితర అంశాల ఆధారంగా సర్కార్ ఏటా బడ్జెట్ రూపకల్పన చేస్తుంది. ఇదే తరహాలో ప్రభుత్వం ఏటా నీటి బడ్జెట్‌ను రూపొందిస్తోంది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ జల వనరుల సమాచారం, నియంత్రణ వ్యవస్థ)ను ఏర్పాటు చేసింది. ఏటా రాష్ట్రంలో కురిసే వర్షం, అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని నీటి ఆదాయంగా పరిగణిస్తోంది. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వ, భూగర్భ జలాలు, భూమి (ఒక మీటర్ లోతు)లో తేమ శాతం రూపంలో ఉన్న నీటిని నిల్వలుగా లెక్కిస్తుంది. ఆవిరిగా మారడం, సముద్రంలో కలిసే నీటిని, సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిని వ్యయంగా లెక్కిస్తుంది. ఈ లెక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జల వనరులను సంరక్షిస్తోంది. జలాంధ్రప్రదేశ్.. ► రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటిదాకా సగటున 658.4 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 835.5 మి.మీల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 26.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. దీని వల్ల 4,693.02 టీఎంసీల నీరు వచ్చింది. ► కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా తదితర అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి 4,825.13 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. అంటే మొత్తంగా 9,518.15 టీఎంసీలు వచ్చాయి. ► ఇందులో రవాణా, ఆవిరి రూపంలో 2,359.04 టీఎంసీలు వృథా అయ్యాయి. అంతర్రాష్ట్ర నదుల నుంచి వచ్చిన జలాల్లో 3,878.87 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. సాగునీటికి 746.97, తాగునీటికి 36.31, పారిశ్రామిక అవసరాలకు 22.08 టీఎంసీలు వినియోగించుకున్నారు. భూ ఉపరితలంపై వాగులు, వంకలు, కాలువలు, డ్రెయిన్లలో 1,438.59 టీఎంసీలు ఉన్నాయి. వీటిని ఖర్చయిపోయినట్లుగానే భావించాలి. ఈ లెక్కన మొత్తంగా 8,481.85 టీఎంసీలు ఖర్చయ్యాయి. (కృష్ణా నది.. అదే ఉధృతి) రిజర్వాయర్లలో గత ఏడాది కంటే 49.49 టీఎంసీలు అధికం ► కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో 591.42, గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలో 9.98, పెన్నా బేసిన్‌లోని రిజర్వాయర్లలో 195.15, వంశధార, నాగావళి, ఇతర బేసిన్లలోని రిజర్వాయర్లలో 67.43 వెరసి 863.98 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 49.49 టీఎంసీలు అధికంగా ఉన్నాయి. ► చెరువుల్లో 80.02 టీఎంసీలు, భూగర్భ జలాల రూపంలో 184.79 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాల రూపంలో 164.80 టీఎంసీలు అధికంగా నిల్వ ఉన్నాయి. చెక్‌డ్యామ్‌లు, పంట కుంటల్లో 30.02 టీఎంసీలు, భూమిలో తేమ రూపంలో 671.89 టీఎంసీలు (గత ఏడాది కంటే 60.02 టీఎంసీలు అధికం) నిల్వ ఉన్నాయి. ► మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటి వరకు 1,830.76 టీఎంసీలు (గత ఏడాది కంటే 354.24 టీఎంసీలు అధికం) నిల్వ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో నీటి నిల్వల్లో ఈ ఏడాదే గరిష్టం కావడం గమనార్హం. జల వనరుల సద్వినియోగంలో ప్రథమ స్థానం ► సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల కింద ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని పొదుపు చేస్తూ అధిక ఆయకట్టుకు సర్కారు నీటిని అందిస్తోంది. ► తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నీటి రాక.. పోకను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ► నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో, జల వనరులపై వాతావరణ ప్రభావం అంచనా వేయడంలో ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్కు మొదటి, రెండవ ర్యాంకులను.. అన్ని నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర జల వనరుల శాఖకు ఫస్ట్ ర్యాంక్‌ను నేషనల్ వాటర్ మిషన్ గతేడాది ప్రదానం చేయడం గమనార్హం. ఇదీ నీటి లెక్క (టీఎంసీల్లో) రాష్ట్రంలో కురిసిన వర్షం 4,693.02 అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చిన నీరు 4,825.13 ఆవిరూపంలో నష్టం 2,359.04 కడలిలో కలిసిన నీరు 3,878.87 సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు (ఇప్పటిదాకా) 805.36 రిజర్వాయర్లలో 863.97 చెరువుల్లో 80.02 భూగర్భజలాల రూపంలో 184.79 భూమిలో వంద సెంటీమీటర్ల లోతులో తేమ రూపంలో 671.89 చెక్ డ్యామ్‌లు, పంట కుంటల్లో 30.09 -
మా అవసరం 157 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో వచ్చే వర్షాకాల సీజన్ ముందు వరకు తమకు 157 టీఎంసీల అవసరాలుంటాయని రాష్ట్రం తేల్చింది. ఈ మేరకు వచ్చే ఏడాది మే చివరి వరకు తమ అవసరాలను పేర్కొంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఇందులో శ్రీశైలంప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు 22 టీఎంసీలు, నాగార్జునసాగర్ కింద హైదరాబాద్ తాగునీరు, ఏఎంఆర్పీ, మిషన్ భగీరథ అవసరాలకు కలిపి 45 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద అవసరాలకు 90 టీఎంసీలు కలిపి మొత్తంగా 135 టీఎంసీలు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇక ఈ వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు 645.36 టీఎంసీల మేర వినియోగించుకోగా తెలంగాణ వాటా 219 టీఎంసీలుగా ఉందని, అయితే అందులో రాష్ట్రం 148 టీఎంసీలు మాత్రమే వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 250 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, అందులో తెలంగాణకు 160 టీ ఎంసీల మేర వాటా ఉంటుందని దృష్టికి తెచ్చింది. -
నీటి పంచాయతీపై చలో ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోమారు చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఏడాది కిందట ఈ బోర్డులతో చర్చించిన పిదప మరెలాంటి చర్చలు చేయని కేంద్రం, తొలి సారి రెండు నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు, కార్యదర్శులతో సమావేశం జరిపేందుకు సమాయత్త మైంది. ఈ నెల 13న ఢిల్లీలో బోర్డులతో భేటీ నిర్వ హిస్తామని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల వనరుల శాఖ లేఖలు రాసింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో నెలకొన్న వివాదా లతో పాటు, పోలవరం పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలపై అన్న నివేదికలతో రావాలని కేంద్రం బోర్డుల చైర్మన్లను ఆదేశించింది. బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్త ప్రాజెక్టులపై వివాదం కొనసాగు తోంది. తెలంగాణ ఇటీవలే వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం వంటి ఎత్తిపోతల పథకాలు చేప ట్టిందని ఏపీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటే బోర్డుల పరిధి, వర్కిం గ్ మ్యాన్యువల్‌ను ఆమోదిం చాల్సి ఉంది. దీనిపై తెలంగాణ అనేక అభ్యంతరాలు చెబుతోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటా యింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటు న్నామని చెబుతోంది. దీంతో బోర్డు మ్యాన్యు వల్కు ఆమోదం దక్కడం లేదు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటే ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై చర్చిద్దామని కేంద్రం బోర్డులకు స్పష్టం చేసింది. మళ్లింపు వాటా, ముంపు తీవ్రత ప్రధానం.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు (పట్టిసీమ) ద్వారా గోదావరి నుంచి కృష్ణా కు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీ లు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ వాటాలకోసం ఇటీవల తెలంగాణ.. బోర్డుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన 13న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో రెండు బోర్డుల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. -
చైర్మన్‌కు విచక్షణాధికారం వద్దు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌లో పలు అంశాలకు సవరణలు చేయాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యంగా బోర్డు చైర్మన్‌కు ఓటు హక్కు విషయంలో విచక్షణాధికారాలను వ్యతిరేకిస్తోంది. చైర్మన్‌కు ఓటు వేసే హక్కు వద్దని, కేవలం రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు, సమన్వయం వరకే ఆయన అధికారాలు ఉండేలా మాన్యువల్‌లో మార్పులు చేయాలని సూచిస్తోంది. ఈ మేరకు మాన్యువల్‌లో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించేందుకు నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషితో భేటీ అయ్యారు. ఒక రాష్ట్రానికే ఒత్తాసు మంచిది కాదు... కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ ప్రకారం చైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి. ఓటు హక్కు కూడా ఉంటుంది. బోర్డు సమావేశంలో ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ నిర్వహించినప్పుడు రెండు రాష్ట్రాలకూ సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల అమలు వరకే బోర్డు చైర్మన్ వ్యవహరించాలని.. అలాకాకుండా ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ఏదో ఒక రాష్ట్రానికి ఒత్తాసు పలకడం మంచిది కాదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. బోర్డు పరిధిలో సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించకుంటే అపెక్స్ కౌన్సిల్‌కు సిఫార్సు చేయాలని, అక్కడా పరిష్కారం కాకుంటే ట్రిబ్యునల్‌కు కేంద్రం సిఫార్సు చేస్తుందని పేర్కొంటోంది. ఇక బోర్డు వర్కింగ్ మాన్యువల్‌లో ప్రత్యేకంగా పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఉన్న హంద్రీనీవా, గాలేరు–నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగోడు, జూరాల ప్రాజెక్టులనే ప్రస్తావించి.. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులను విస్మరించారు. అలాగే గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులనూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 11వ షెడ్యూల్‌ను పట్టించుకోకూడదని తెలంగాణ కోరుతోంది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో తెలం గాణ రాష్ట్రం విభేదిస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమల్లోకి వచ్చేవరకూ బోర్డు పరిధిని నిర్ణయించరాదని పేర్కొంటూ తన వాదన సిద్ధం చేసింది. వీటికి సీఎస్ ఆమోదం తెలపడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారులు తమ వినతులతో బోర్డుకు లేఖ రాయనున్నారు. -
జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్/గద్వాల: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. రోజుకి 17 టీఎంసీల మేర నీరు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతోంది. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి స్థిరంగా నీటి ప్రవాహాలు కొనసాగుతుండటంతో దిగువన ఉన్న ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉధృతంగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే జూరాల నిండగా, శ్రీశైలంలో నిల్వలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆల్మట్టిలోకి శుక్రవారం సాయంత్రం 1.73 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు వచ్చి నీటిని వచ్చినట్లుగా దిగువ నారాయణపూర్‌కు వది లేస్తున్నారు. నారాయణపూర్ ఇప్పటికే నిండటం, దానికి స్థానిక ప్రవాహాలు తోడవడంతో 1.83 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ప్రాజెక్టు నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాలకు శుక్రవారం సాయంత్రం 1.8 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అక్కడి నుంచి 1.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ కాల్వలకు నీటి పంపింగ్ కొనసాగుతోంది. ఇక జూరాల నీటిని దిగువకు వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. నిన్న, మొన్నటి వరకు ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల మేర వరద రాగా, శుక్రవారం అది ఏకంగా 1.76 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 215 టీఎంసీలకుగాను 30.91 టీఎంసీలకు చేరింది. జూరాలకు తోడు తుంగభద్ర సైతం నిండటంతో అక్కడి నుంచి 69 వేల క్యూసెక్కుల ప్రవాహాలు దిగువ శ్రీశైలానికి వస్తున్నాయి. దీంతో శనివారంనాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముంది. -
‘గోదావరి’లో టెలిమెట్రీ అక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు చేస్తున్న నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న టెలిమెట్రీ వ్యవస్థను గోదావరి బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో అమలు చేయాలన్న బోర్డు ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గోదావరి బేసిన్ పరిధిలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజెక్టులు, నీటి లభ్యత విషయంలో వివాదాలు లేనప్పుడు టెలిమె ట్రీ వ్యవస్థ ఎందుకని, అక్కర్లేదని తెలంగాణ చెప్పింది. దీనిపై ఇటీవల గోదావరి బోర్డుకు లేఖ రాసింది. అప్పటి వరకు పక్కన పెట్టండి.. గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, దేవాదుల, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టుల పరిధిలోని 120 ప్రాంతాల్లో టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. దీనిపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఇరు రాష్ట్రాలను కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలిపింది. గోదా వరి బేసిన్లో సరిపడా లభ్యత జలాలు ఉన్నాయని, ఇవికాక ఏటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తా యని తెలిపింది. గోదావరి, దాని ఉపనదులు, ప్రధా న డ్యామ్ ప్రాంతాల్లో 27 గేజ్ డేటా స్టేషన్లు ఉన్నాయని, ఇవన్నీ కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహిస్తున్నారని వివరించింది. ఈ గేజ్ స్టేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాలు, వరద అంచనా, గణింపు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకమారు కృష్ణా బేసిన్లో టెలి మెట్రీ వ్యవస్థను అమలు పరిస్తే, తర్వాత భవిష్యత్తులో గోదావరి బేసిన్లో ఈ వ్యవస్థను అమలు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. అప్పటి వరకు టెలిమెట్రీ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని తెలి పింది. దీనిపై గోదావరి బోర్డు ఎలా స్పందిస్తుందన్న ది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ పరి« దిలో తొలి విడతలో 18, రెండో విడతలో 29 ప్రాం తాల్లో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు రెండేళ్ల కింద నిర్ణయించినా అమలు కాలేదు. దీంతో గోదావరి బేసిన్ పరిధిలో టెలిమెట్రీ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల..
ఆల్మట్టి, తుంగభద్రకు భారీ ఇన్‌ఫ్లో.. రాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం ఇంకా కరువే సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు మొదలయ్యాయి. ఎగువన కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టిలోకి ఏకంగా 29వేల క్యూసెక్కుల పైచిలుకు ప్రవాహం వస్తోంది. అయితే రాష్ట్ర ప్రాజెక్టుల్లో మాత్రం ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. కృష్ణా పరివాహకంలో గడిచిన పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న ఆల్మట్టికి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1,675.2 అడుగుల్లో నీటి లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టులో 129.7 టీఎంసీలకు గాను గురువారం ఉదయానికి 33.7 టీఎంసీల నిల్వ ఉంది. ఇక తుంగభద్ర ప్రాజెక్టులో 11,506 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఇక్కడ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.64 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కాగా, ఆల్మట్టికి ప్రవాహం మరింత పెరిగి, ప్రాజెక్టునిండితేనే దిగువ నారాయణఫూర్‌కు ఇన్‌ఫ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ 14.87 టీఎంసీల లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టు నిండితేనే దిగువ జూరాలకు ప్రవాహం మొదలవుతుంది. కాగా రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఎక్కడా ప్రవాహాలు లేవు. జూరాలకు రెండు రోజుల కిందటి వరకు ప్రవాహాలున్నా అవి గురువారానికి తగ్గిపోయాయి. -
టెలీమెట్రీపై కొత్త సందేహాలు!
పూర్తి స్థాయి నీటి విడుదల సామర్థ్యాన్ని గుర్తించలేని వ్యవస్థ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ప్రధాన ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీ పరికరాల పనితీరుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటి తరలించే సమయంలో సరైన విడుదల (డిశ్చార్జి) లెక్కలను అవి నమోదు చేయడం లేదని వాదనలు వినవస్తున్నా యి. ఇందుకు బలం చేకూరుస్తూ పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ పరికరాలు పూర్తి స్థాయి డిశ్చార్జిలను చూపడం లేదంటూ లేఖ రాయడం చర్చనీయాం శంగా మారింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, అందులో తొలి విడతగా రూ.4 కోట్ల వ్యయంతో జూరాల, శ్రీశైలం, సాగర్‌లలో 18 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ వ్యవస్థ ప్రవాహాలను సరిగా నమోదు చేయడం లేదని కృష్ణాబోర్డు గుర్తించింది. దాంతో అక్కడ ప్రవాహాలను లెక్కించాలంటే ఆటోమెటిక్ సెన్సర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీలకు రాష్ట్రాలకు సూచించింది. అప్పుడే సరైన నీటి విడుదల లెక్కలు వస్తాయని పేర్కొంది. -
మరిన్ని నీళ్లు కావాలి..
♦ సాగర్ కింద అదనంగా 10.5 టీఎంసీలు కోరుతున్న ఏపీ ♦ నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టు నీటి విడుదలపై తెలంగాణ ఎంత దిగొస్తోంటే... ఏపీ అంత బెట్టు చేస్తోంది. బోర్డు సూచన మేరకు ఆవిరి, సరఫరా నష్టాలను సైతం పక్కనపెట్టి కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నా, మరింత అదనపు నీటికై పట్టుపడుతోంది.నాగార్జునసాగర్ నుంచి తమ తాగు, సాగు అవసరాలకు 10.5టీఎంసీల నీటిని కేటాయిం చాలంటూ ఏపీ కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. ఈ లేఖలపై వెంటనే స్పందించిన బోర్డు నీటి విడుదలకై చర్యలు తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది. తెలంగాణ వాదన బేఖాతరు... నిజానికి ఏపీకి దక్కాల్సిన సంపూర్ణ వాటా ఇచ్చే శామని తెలంగాణ తొలి నుంచీ చెబుతూ వస్తోంది. దీన్ని ఖాతరు చేయని ఏపీ... సాగర్ డ్యామ్ వద్ద గొడవకు దిగడంతో బోర్డు సూచన మేరకు తెలంగాణ నీటిని విడుదల చేసింది. అదీ చాలదన్నట్లు తాజాగా సాగర్ కుడి కాల్వ కింద 15.20 టీఎంసీలకు గానూ 13.89 టీఎంసీలే విడుదల చేశారని, తమకు ఇంకా 1.3 టీఎంసీలు రావాలని లేఖ రాసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నీటిని విడుదల చేయాలని కోరింది. దీంతో పాటే కృష్ణాడెల్టా కింద మరో 6.48 టీఎంసీలు కావాలం టోంది.కుడి కాల్వ కింద సైతం తమకు 3.5 టీఎంసీల కేటాయింపులున్నా.. 0.98టీఎంసీలే విడుదల చేశార ని, మరో 2.52 టీఎంసీలు కావాలని కోరుతోంది. ఇక సాగర్‌లో వాస్తవ నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అది 511.4 అడుగులకు చేరింది. ఇంకో అడుగు దాటితే కనిష్టానికి పడిపోతుంది. -
కృష్ణమ్మకు అడ్డుకట్ట!
కృష్ణాపై మరో నాలుగు ఎత్తిపోతల పథకాలు చేపట్టిన కర్ణాటక అదనంగా 21 టీఎంసీల వినియోగానికి ప్రణాళిక ఇప్పటికే ఓకే చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ అవి పూర్తయితే రాష్ట్రానికి భారీగా తగ్గిపోనున్న నీటి రాక సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఎగువనే పూర్తిగా బందీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైనుంచి కిందకు నీటి ప్రవాహాలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేందుకు యత్నిస్తోంది. ఇందు లో భాగంగా కొత్త ఎత్తిపోతల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే నాలుగు ఎత్తిపోతల పథకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు అధికారికమైతే దిగువకు 21 టీఎంసీల మేర ప్రవాహాలు తగ్గిపోనుండడం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అవి పూర్తయితే మనకు కష్టమే.. ఇప్పటికే అప్పర్ కృష్ణా ఇరిగేషన్ ప్రాజె క్టు(యూకేఐపీ) కింద కర్ణాటక.. బీజాపూర్, గుల్బర్గా, ఉద్గీర్, భగల్‌కోట్, రాయచూర్ జిల్లాల్లోని 6.22 లక్షల హెక్టార్ల ఎకరాలకు నీరందిస్తోంది. ఈ ఆయకట్టును మరింత విస్తారించాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (కేబీజేఎన్ఎల్) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అప్పర్ కృష్ణాలో బీజాపూర్ జిల్లా బుధిహాల్– పీరాపూర్, రాయిచూర్ జిల్లాల్లోని నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్ వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను రూ.3,710 కోట్లతో చేపట్టాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. వీటికి మొత్తంగా 21 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు వేసింది. వీటిద్వారా 1.29 లక్షల హెక్టార్లకు సాగునీటిని ఇవ్వాలని చూస్తోంది. ఈ ఎత్తిపోతల పథకాల కోసం 2,403 హెక్టార్ల మేర భూసేకరణ అవసరం ఉండగా... కేబీజేఎన్ఎల్ ఇప్పటికే 822 హెక్టార్ల మేర భూసేకరణను పూర్తి చేసింది. తాజాగా పర్యావరణ, అటవీ, ఇతర అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇది తెలంగాణను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు నీటి వినియోగాన్ని మొదలు పెడితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు తగ్గుతాయి. ఇప్పటికే ఎగువన వచ్చిన వరదను వచ్చినట్టే కర్ణాటక పట్టేసుకుంటోంది. కిందకు చుక్క నీటిని వదలకపోవడంతో తెలంగాణ, ఏపీలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గడ్డుకాలం తప్పడం లేదు. ఒకవేళ నీరొచ్చినా ఖరీఫ్ సాగుకు నవం బర్, డిసెంబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి వస్తోంది. అదనంగా మరో 21 టీఎంసీల నీటి వినియోగం మొదలు పెడితే దిగువకు నీటి రాక మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. పోలవరం వాటాల్లోంచేనా? గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం ప్రాజెక్టును చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఉంది. ప్రస్తుతం పోలవరానికి జాతీయ హోదా కట్టబెట్టడంతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కాయి. ఇందులో 14 టీఎంసీలు మహారాష్ట్రకు దక్కనుండగా, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. దీన్ని ఆధారంగా చేసుకొనే కర్ణాటక 4 ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని, అందుకే కేంద్ర పర్యావరణ శాఖ సైతం వెంటనే అనుమతులు జారీ చేసి ఉండవచ్చని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఆ నీటి వాటాలపై ఆధారపడే ఈ ఎత్తిపోతలు చేపట్టారా? లేదా అదనపు నీటి వినియోగమా? అన్న అంశమై సోమవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈఎన్సీ మురళీధర్ హైడ్రాలజీ, అంతరాష్ట్ర వ్యవహారాల విభాగపు అధికారులతో భేటీ నిర్వహించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే తదుపరి ప్రతిస్పందన తెలియ జేయాలని నిర్ణయించారు. ‘కృష్ణా’ నియంత్రణపై వెనక్కి తగ్గని బోర్డు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నియం త్రణలోకి తెచ్చుకునే అంశంపై బోర్డు వెనక్కి తగ్గట్లేదు. ఈ విషయమై గత ముసాయిదా నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభు త్వం అభ్యంతరం చెప్పనందున తమ సిఫార్సులకు సమ్మతిగానే భావిస్తామని పేర్కొంటోంది. బుధవారం జరగనున్న బోర్డు భేటీలో నోటిఫికేషన్ అంశాన్ని ఎజెండాగా చేర్చింది. దీనిని తప్పుబడు తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పని మొదలు పెట్టకముందే కృష్ణా బోర్డు తన ‘ఎజెండా’తో ముందుకు సాగుతుండటం గమనార్హం. ప్రాజెక్టులను నియంత్రణ లోకి తెచ్చుకునేందుకే దీన్ని ఎజెండాలో చేర్చారని తెలంగాణ ప్రభుత్వం అనుమా నిస్తోంది. పారదర్శకంగా నీటి వినియో గం జరిగేందుకు టెలిమెట్రీ పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుండగా మళ్లీ ప్రాజె క్టుల నియంత్రణ అవసరం ఏమిటని వాదిస్తోంది. పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఏపీ తీసుకోవాల్సిన చర్యలపైనా లేవనెత్తనుంది. -
నీటి వాటాలు నిర్ణయించజాలరు
► ఏకే బజాజ్ కమిటీకి స్పష్టం చేసిన తెలంగాణ ► ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, కృష్ణాకు తరలించే గోదావరి వాటా తేల్చాల్సింది ట్రిబ్యునల్ మాత్రమే! సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు నీటి వాటాలను ట్రిబ్యునల్ మాత్రమే తేల్చగలదని, కేంద్రం నియమిం చే కమిటీలు కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏకే బజాజ్ కమిటీకి తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు ఎలా ఉండాలన్న దానిపై ట్రిబ్యునల్ విచారణ జరుగుతు న్నందున, ఈ విషయంలో కమిటీల జోక్యం అనవసరమంటూ కమిటీకి గురువారం లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కృష్ణాబేసిన్ ప్రాజె క్టుల నిర్వహణ, నియంత్రణపై రాష్ట్రాభి ప్రాయాలు చెప్ప డంతో పాటు ట్రిబ్యునల్ పరిధిలో జరుగుతున్న విచారణ, ప్రస్తుతం అమలవుతున్న గుండుగుత్త కేటాయింపులు (ఎన్–బ్లాక్ కేటాయింపు), మైనర్ ఇరిగేషన్ ల నీటివాడకం వంటి అంశాలపై ఈ లేఖలో వివరణలు ఇచ్చింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందిం చడంతోపాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్–1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేయాలని బజాజ్ కమిటీకి కేంద్రం సూచిం చింది. ఈ అంశాలపై అధ్యయనం చేసి అందించే నివేదిక, సూచించే విధానానికి అనుగుణంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నడుచుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమ తులు వచ్చిన వెంటనే పై రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమి స్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎం సీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులు చూడాల్సి ఉంటుం దని, అప్పటివరకు నియంత్రణ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. మైనర్ ఇరిగేషన్ కింద సైతం రాష్ట్ర వినియోగం 30 టీఎంసీలు దాటకున్నా, వాటాల లెక్కలను చూపి 89.15టీఎంసీలుగా వినియోగాన్ని చూడటం సరైంది కాదనే వాదనను కమి టీకి రాసిన లేఖలో వివరించినట్లుగా చెబుతున్నారు. బోర్డు చైర్మన్ పదవీ విరమణ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్ గా వ్యవహరిస్తున్న రామ్‌శరణ్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తుంగభద్ర బోర్డు చైర్మన్ గా ఉన్న రామచంద్రరావుకు తాత్కాలిక బాధ్యతలు కట్టబెట్టను న్నట్లు తెలిసింది. -
ఇక తుపాన్లే దిక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తి నైరాశ్యం మిగిల్చాయి. ఆశించిన స్థాయి వర్షాల్లేక కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రవాహాలు లేక ప్రాజెక్టులన్నీ వట్టిపోయి కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల కాలం ముగియడంతో ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవాహాలు వస్తాయన్న ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికితోడు అక్టోబర్ తొలి వారం వచ్చినా ఈశాన్య రుతుపవనాల జాడ కానరావట్లేదు. 2009లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వేదవతి, తుంగభద్రలకు వచ్చిన భారీ వరద వల్ల శ్రీశైలం నిండగా ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆశలన్నీ అక్టోబర్ చివర, నవంబర్‌లో వచ్చే తుపా న్లపైనే ఆధారపడి ఉ న్నాయి. నవంబర్‌లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్ల ప్రభావం కృష్ణా బేసిన్‌పై ఎక్కువగా ఉంటుందని, అవి వస్తేనే ప్రాజెక్టుల్లోకి ఆశిం చిన నీరు వస్తుందని, లేదంటే మున్ముందు నీటి కష్టాలు తప్పవని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కడా ప్రవాహాల జాడ లేదు. ఈ ఏడాది జూన్ మొదట్లో, సెప్టెం బర్లో కురిసిన కొద్దిపాటి వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి 95 టీఎంసీల మేర మాత్రమే నీరొచ్చింది. ఇందులో శ్రీశైలానికి గరిష్టంగా 44.8 టీఎంసీలు, నాగార్జునసాగర్‌కు 12.5, జూరాలకు 29.77, పులిచింతలకు 9.40 టీఎంసీల మేర నీరొచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి సాగర్‌లో 312.05 టీఎంసీల వాస్తవ నిల్వ సామర్థ్యానికిగానూ 311.15 టీఎంసీల నీరుండగా అది ప్రస్తుత ఏడాది 133.2 టీఎంసీలకు పడిపోయింది. శ్రీశైలంలో 215.8 టీఎంసీల సామర్థ్యానికిగానూ గతేడాది 177.9 టీఎంసీల మేర నీరుండగా అది ప్రస్తుతం 64.9 టీఎంసీలకే పరిమితమైంది. ఈ ఏడాది జూరాలకు కొద్దిపాటి ప్రవాహాలు తప్ప ఎక్కడా నీరు దిగువకు రాలేదు. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి పూర్తి స్థాయి నీరు రానందున, మున్ముందు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎగువన వర్షాలు కురిసినా అక్కడి నుంచి దిగువకు నీరొస్తుందన్న ఆశలు లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం కేవలం తుపాన్లపైనే ఆశలు పెట్టుకుంది. ఏటా అక్టోబర్ చివర, నవంబర్ మొదట్లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్ల ప్రభావం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై అధికంగా ఉంటుంది. గతంలో తుపాన్ల సమయంలో వచ్చిన నీటితోనే సాగర్ జలాశయంలోకి నీరు చేరి హైదరాబాద్ జంటనగరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తలేదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కోసారి నవంబర్ చివర, డిసెంబర్‌లోనూ కృష్ణా బేసిన్లో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని, అవి ఆశించిన మేర వచ్చినా ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. -
కన్నీటి కృష్ణా!
♦ కృష్ణా బేసిన్లో తీవ్ర గడ్డు పరిస్థితులు ♦ గత ఏడాది ఇదే సమయానికి 700 టీఎంసీల రాక ♦ ఈ ఏడాది కేవలం ఇరు రాష్ట్రాలకు కలిపి 107 టీఎంసీలే ♦ కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇప్పటికే 900 టీఎంసీలకు పైగా నీటి రాక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పావువంతు జనాభాకు ఆసరాగా ఉన్న కృష్ణమ్మ ఈ మారు ఉసూరుమనిపించింది. సరైన వర్షాల్లేక, ఎగువ నుంచి ప్రవాహాలు కరువై కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ బోరుమంటున్నాయి. మూడు మాసాల అనంతరం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వస్తున్నా అవేవీ రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీర్చేవి కావు. కిందటేడాది ఇదే సమయానికి కృష్ణా బేసిన్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 700 టీంసీలకు పైగా నీరురాగా అది ఈ ఏడాది కేవలం 100 టీఎంసీలకే పరిమితమైంది. సెప్టెంబర్ సైతం ముగింపునకు వస్తుండటంతో అవసరాల మేరకు నీరొస్తుందన్న ఆశలు లేవు. ఇలాంటి స్థితిలో భవిష్యత్ నీటి ఎద్దడిని ఎదుర్కోవడం తెలంగాణ, ఏపీలకు కత్తిమీద సామే. 811 టీఎంసీల్లో వచ్చింది వందే! కృష్ణా బేసిన్లో తెలంగాణ, ఏపీలకు కలిపి 811 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాలున్నాయి. ఈ నీటిపైనే 50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు, కోటిన్నర జనాభా తాగు అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ ఏడాది అత్యల్ప వర్షాల వల్ల జూన్ నుంచి ఆగస్టు వరకు చుక్కనీరూ ప్రాజెక్టులోకి రాలేదు. సెప్టెంబర్ తర్వాత కొద్దిపాటి ప్రవాహాలు మొదలైనా అంతంత మాత్రమే. తుంగభద్రలో కొంతమేర నీరు రాగా, కృష్ణాలో జూరాల, శ్రీశైలానికే కొద్దిపాటి ప్రవాహాలు వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం జూరాలకు 17 టీఎంసీలు, శ్రీశైలానికి 43, సాగర్‌కు 9, పులిచింతలకు 9, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులకు మరో 30 టీఎంసీల నీరొచ్చింది. మొత్తంగా 108 టీఎంసీలు రాగా, ఇరు రాష్ట్రాలు సుమారు 50 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కృష్ణాలో 600 టీఎంసీలు, తుంగభద్రలో 70, సుంకేశులకు 39 టీఎంసీలు కలిపి మొత్తంగా 709 టీఎంసీల నీరొచ్చింది. అందులో 20 శాతం నీరు కూడా ఈసారి రాలేదు. గత ఏడాది సాగర్‌లో ఇదే సమయానికి 312 టీఎంసీల గరిష్ట నిల్వతో కళకళ్లాడగా ఇప్పుడు 132.18 టీఎంసీలకే పరిమితమైంది. శ్రీశైలంలోనూ 217 టీఎంసీల నిల్వకు గానూ గత ఏడాది పూర్తిగా నిండగా, ఇప్పుడు 63కు పడిపోయింది. వందేళ్ల కిందటి పరిస్థితే.. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం పుష్కలంగా కృష్ణా జలాల లభ్యత ఉంది. కృష్ణాలో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులుండగా, 560 టీఎంసీలు లభ్యమైంది. ఇందు లో ఇప్పటికే 160 టీఎంసీలను వినియోగించుకోగా, 400 టీఎంసీల లభ్యత ఉంది. ఇక మహారాష్ట్రకు 585 టీఎంసీల కేటాయింపులుం డగా 320 టీఎంసీల నీరొచ్చింది. ఇందులో 150 టీఎంసీలను వాడుకోగా, 170 టీఎంసీల లభ్యత ఉంది. ఈ లెక్కన మొత్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలను కలుపుకొని మొత్తంగా కృష్ణా బేసిన్లో ఈ ఏడాది నీటి లభ్యత వెయ్యి టీఎంసీలను దాటలేదు. గతం లో 1918-19లో అత్యంత కనిష్టంగా 1007 టీఎంసీలు మాత్రమే నీరొచ్చింది. ప్రస్తుతం వందేళ్ల కిందటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. -
ప్రొటోకాల్ తేలేనా?
8న కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం నీటి పంపిణీ, వినియోగంపై పునఃసమీక్ష కోరుతున్న తెలంగాణ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15పైనా స్పష్టత కోరే అవకాశం ఎజెండా అంశాలపై మొదలైన కసరత్తు హైదరాబాద్ కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ, నీటి వినియోగంపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ అంశాల్లో నెలకొన్న స్తబ్దతను నివారించే పనిని కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రారంభించింది. ఈ నెల 8న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశంలో ఉమ్మడిగా ప్రాజెక్టుల నిర్వహణపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులు, వినియోగం, ఆపరేషన్ ప్రొటోకాల్‌లపై భిన్న వాదనలు వినిపిస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య ఈ అంశాన్ని కొలిక్కి తేవడం అంత సులువు కాదన్నది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా తయారుచేసిన నీటి ప్రొటోకాల్స్‌లో మార్పులు చేయాలని పట్టుబడుతున్న తెలంగాణ.. ఈ అంశాన్నే మొదట తేల్చాలని బలంగా కోరే అవకాశాలున్నాయి. ప్రాధాన్యతల మార్పులు కోరే అవకాశం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంలో అనుసరించాల్సిన ప్రాధాన్యతల(ప్రొటోకాల్స్)ను పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవో 69, 107లపైనా బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇప్పటికే పలుమార్లు బోర్డుకు స్పష్టం చేసింది. ముఖ్యంగా చెన్నై తాగునీటి అవసరాలకు 3.75 టీఎంసీల నీటి కేటాయింపునకు తొలి ప్రాధాన్యమిస్తూ.. తెలంగాణ నీటి అవసరాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వడంపై అభ్యంతరం చెబుతోంది. కేవలం తెలుగు గంగకు నీటిని తీసుకెళ్లేందుకే కుట్ర పూరితంగా చెన్నై అవసరాలకు ప్రోటోకాల్‌లో తొలి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటోంది. ఇక విద్యుదుత్పత్తిలోనూ ఆంధ్రాకు అనుకూలంగానే ప్రోటోకాల్స్ ఉన్నాయని, ఎడమవైపున విద్యుదుత్పత్తి కేంద్రం ఉన్నా, దాని వినియోగంపై నియంత్రణ ఉందని తెలంగాణ అంటోంది. అలాగాకుండా స్వతంత్రంగా దానిని నడపుకొనేలా ప్రోటోకాల్ మార్చాలని వాదిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రోటోకాల్స్‌ను మార్చి తాజా మార్గదర్శకాలు రూపొందించడానికి.. సాగునీటి, ఇతర అవసరాలకు సంబంధించిన పూర్తి డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానికితోడు జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా పూర్తయి ఓ ఒప్పందానికి వస్తేనే ప్రోటోకాల్‌లో మార్పులు సాధ్యమవుతాయి. లేదంటే బోర్డు కొత్త మార్గదర్శకాలు తయారుచేసే వరకు.. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ప్రస్తుత ప్రోటోకాల్స్‌నే పాటించాల్సి ఉంటుంది. అంత సులువేం కాదు.. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్ నీటి వాడకంపై తెలంగాణ, ఏపీల మధ్య నలుగుతున్న వివాదాన్ని తేల్చడం అంత సులువేం కాదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 15వ అధికరణం కింద ఒక రాష్ట్రం తన పరిధిలోని నీటిని తన సరిహద్దులలో నచ్చిన రీతిలో వాడుకోవడానికి హక్కు కల్పించిందన్న విషయాన్ని తెలంగాణ గతంలోనే తెరపైకి తెచ్చింది. ఈ మేరకే కృష్ణాలో గుండుగుత్తగా జరిపిన కేటాయింపుల్లో ఏపీకి 512.04 టీఎంసీలు (63.14శాతం), తెలంగాణకు 298.96 టీఎంసీల (36.86 శాతం) వాటాలున్నాయని చెబుతూ... సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన నీటిని తెలంగాణ రాష్ట్రం సాగర్ నుంచి వాడుకుంది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని అక్కడే అదే సమయంలో వాడాలి తప్ప, మొత్తం కేటాయింపులను ఒకే దగ్గర వాడుకుంటామంటే కుదరదని వాదించింది. ఇలాంటి భిన్న వాదనల నేపథ్యంలో బోర్డు ఏం తేలుస్తుందన్నది కీలకంగా మారింది.