కన్నీటి కృష్ణా!
♦ కృష్ణా బేసిన్‌లో తీవ్ర గడ్డు పరిస్థితులు
♦ గత ఏడాది ఇదే సమయానికి 700 టీఎంసీల రాక
♦ ఈ ఏడాది కేవలం ఇరు రాష్ట్రాలకు కలిపి 107 టీఎంసీలే
♦ కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇప్పటికే 900 టీఎంసీలకు పైగా నీటి రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పావువంతు జనాభాకు ఆసరాగా ఉన్న కృష్ణమ్మ ఈ మారు ఉసూరుమనిపించింది. సరైన వర్షాల్లేక, ఎగువ నుంచి ప్రవాహాలు కరువై కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ బోరుమంటున్నాయి.
మూడు మాసాల అనంతరం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వస్తున్నా అవేవీ రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీర్చేవి కావు. కిందటేడాది ఇదే సమయానికి కృష్ణా బేసిన్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 700 టీంసీలకు పైగా నీరురాగా అది ఈ ఏడాది కేవలం 100 టీఎంసీలకే పరిమితమైంది. సెప్టెంబర్ సైతం ముగింపునకు వస్తుండటంతో అవసరాల మేరకు నీరొస్తుందన్న ఆశలు లేవు. ఇలాంటి స్థితిలో భవిష్యత్ నీటి ఎద్దడిని ఎదుర్కోవడం తెలంగాణ, ఏపీలకు కత్తిమీద సామే.
811 టీఎంసీల్లో వచ్చింది వందే!
కృష్ణా బేసిన్‌లో తెలంగాణ, ఏపీలకు కలిపి 811 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాలున్నాయి. ఈ నీటిపైనే 50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు, కోటిన్నర జనాభా తాగు అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ ఏడాది అత్యల్ప వర్షాల వల్ల జూన్ నుంచి ఆగస్టు వరకు చుక్కనీరూ ప్రాజెక్టులోకి రాలేదు. సెప్టెంబర్ తర్వాత కొద్దిపాటి ప్రవాహాలు మొదలైనా అంతంత మాత్రమే. తుంగభద్రలో కొంతమేర నీరు రాగా, కృష్ణాలో జూరాల, శ్రీశైలానికే కొద్దిపాటి ప్రవాహాలు వచ్చాయి.
అధికారిక లెక్కల ప్రకారం జూరాలకు 17 టీఎంసీలు, శ్రీశైలానికి 43, సాగర్‌కు 9, పులిచింతలకు 9, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులకు మరో 30 టీఎంసీల నీరొచ్చింది. మొత్తంగా 108 టీఎంసీలు రాగా, ఇరు రాష్ట్రాలు సుమారు 50 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కృష్ణాలో 600 టీఎంసీలు, తుంగభద్రలో 70, సుంకేశులకు 39 టీఎంసీలు కలిపి మొత్తంగా 709 టీఎంసీల నీరొచ్చింది. అందులో 20 శాతం నీరు కూడా ఈసారి రాలేదు. గత ఏడాది సాగర్‌లో ఇదే సమయానికి 312 టీఎంసీల గరిష్ట నిల్వతో కళకళ్లాడగా ఇప్పుడు 132.18 టీఎంసీలకే పరిమితమైంది. శ్రీశైలంలోనూ 217 టీఎంసీల నిల్వకు గానూ గత ఏడాది పూర్తిగా నిండగా, ఇప్పుడు 63కు పడిపోయింది.
వందేళ్ల కిందటి పరిస్థితే..
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం పుష్కలంగా కృష్ణా జలాల లభ్యత ఉంది. కృష్ణాలో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులుండగా, 560 టీఎంసీలు లభ్యమైంది. ఇందు లో ఇప్పటికే 160 టీఎంసీలను వినియోగించుకోగా, 400 టీఎంసీల లభ్యత ఉంది. ఇక మహారాష్ట్రకు 585 టీఎంసీల కేటాయింపులుం డగా 320 టీఎంసీల నీరొచ్చింది.
ఇందులో 150 టీఎంసీలను వాడుకోగా, 170 టీఎంసీల లభ్యత ఉంది. ఈ లెక్కన మొత్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలను కలుపుకొని మొత్తంగా కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది నీటి లభ్యత వెయ్యి టీఎంసీలను దాటలేదు. గతం లో 1918-19లో అత్యంత కనిష్టంగా 1007 టీఎంసీలు మాత్రమే నీరొచ్చింది. ప్రస్తుతం వందేళ్ల కిందటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.