ఇక తుపాన్‌లే దిక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తి నైరాశ్యం మిగిల్చాయి. ఆశించిన స్థాయి వర్షాల్లేక కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రవాహాలు లేక ప్రాజెక్టులన్నీ వట్టిపోయి కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల కాలం ముగియడంతో ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవాహాలు వస్తాయన్న ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికితోడు అక్టోబర్ తొలి వారం వచ్చినా ఈశాన్య రుతుపవనాల జాడ కానరావట్లేదు. 2009లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వేదవతి, తుంగభద్రలకు వచ్చిన భారీ వరద వల్ల శ్రీశైలం నిండగా ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆశలన్నీ అక్టోబర్ చివర, నవంబర్‌లో వచ్చే తుపా న్‌లపైనే ఆధారపడి ఉ న్నాయి.
నవంబర్‌లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్‌ల ప్రభావం కృష్ణా బేసిన్‌పై ఎక్కువగా ఉంటుందని, అవి వస్తేనే ప్రాజెక్టుల్లోకి ఆశిం చిన నీరు వస్తుందని, లేదంటే మున్ముందు నీటి కష్టాలు తప్పవని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కడా ప్రవాహాల జాడ లేదు. ఈ ఏడాది జూన్ మొదట్లో, సెప్టెం బర్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి 95 టీఎంసీల మేర మాత్రమే నీరొచ్చింది. ఇందులో శ్రీశైలానికి గరిష్టంగా 44.8 టీఎంసీలు, నాగార్జునసాగర్‌కు 12.5, జూరాలకు 29.77, పులిచింతలకు 9.40 టీఎంసీల మేర నీరొచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
గతేడాది ఇదే సమయానికి సాగర్‌లో 312.05 టీఎంసీల వాస్తవ నిల్వ సామర్థ్యానికిగానూ 311.15 టీఎంసీల నీరుండగా అది ప్రస్తుత ఏడాది 133.2 టీఎంసీలకు పడిపోయింది. శ్రీశైలంలో 215.8 టీఎంసీల సామర్థ్యానికిగానూ గతేడాది 177.9 టీఎంసీల మేర నీరుండగా అది ప్రస్తుతం 64.9 టీఎంసీలకే పరిమితమైంది. ఈ ఏడాది జూరాలకు కొద్దిపాటి ప్రవాహాలు తప్ప ఎక్కడా నీరు దిగువకు రాలేదు. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి పూర్తి స్థాయి నీరు రానందున, మున్ముందు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎగువన వర్షాలు కురిసినా అక్కడి నుంచి దిగువకు నీరొస్తుందన్న ఆశలు లేవు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రం కేవలం తుపాన్‌లపైనే ఆశలు పెట్టుకుంది. ఏటా అక్టోబర్ చివర, నవంబర్ మొదట్లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్‌ల ప్రభావం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై అధికంగా ఉంటుంది. గతంలో తుపాన్‌ల సమయంలో వచ్చిన నీటితోనే సాగర్ జలాశయంలోకి నీరు చేరి హైదరాబాద్ జంటనగరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తలేదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కోసారి నవంబర్ చివర, డిసెంబర్‌లోనూ కృష్ణా బేసిన్‌లో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని, అవి ఆశించిన మేర వచ్చినా ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.