
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం చోటుచేసుకుంది. జూలై 6 వరకు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదు కానున్నాయి.
నిన్న(మంగళవారం) బాపట్లలో 35.8, మచిలీపట్నంలో 35.6, తునిలో 35.5 విశాఖ ఎయిర్‌పోర్టు 34.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు( బుధవారం) కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.
దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నిన్న(మంగళవారం) రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అంతట నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల ముందుగానే దేశం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.
Southwest monsoon covered the entire country on 2nd July 2024. pic.twitter.com/d0QTxAP6Ps
— मौसम विज्ञान केंद्र जयपुर (@IMDJaipur) July 2, 2024
ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగా జూలై 2న విస్తరించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు రెండు మూడురోజు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మే30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఇక.. మరో నాలుగైదు రోజుల పాటు వాయువ్య, తూర్పు ఈశాన్య భారతంలో నైరుతి రుతుపవనాలు కదులుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment