‘గోదావరి’లో టెలిమెట్రీ అక్కర్లేదు | Telemetry is not required in Godavari Basin | Sakshi
Sakshi News home page

‘గోదావరి’లో టెలిమెట్రీ అక్కర్లేదు

Published Sun, May 27 2018 1:38 AM | Last Updated on Sun, May 27 2018 1:38 AM

Telemetry is not required in Godavari Basin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు చేస్తున్న నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న టెలిమెట్రీ వ్యవస్థను గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల పరిధిలో అమలు చేయాలన్న బోర్డు ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గోదావరి బేసిన్‌ పరిధిలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజెక్టులు, నీటి లభ్యత విషయంలో వివాదాలు లేనప్పుడు టెలిమె ట్రీ వ్యవస్థ ఎందుకని, అక్కర్లేదని తెలంగాణ చెప్పింది. దీనిపై ఇటీవల గోదావరి బోర్డుకు లేఖ రాసింది. 

అప్పటి వరకు పక్కన పెట్టండి.. 
గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, దేవాదుల, తుపాకులగూడెం తదితర ప్రాజెక్టుల పరిధిలోని 120 ప్రాంతాల్లో టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. దీనిపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఇరు రాష్ట్రాలను కోరింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలిపింది. గోదా వరి బేసిన్లో సరిపడా లభ్యత జలాలు ఉన్నాయని, ఇవికాక ఏటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తా యని తెలిపింది. గోదావరి, దాని ఉపనదులు, ప్రధా న డ్యామ్‌ ప్రాంతాల్లో 27 గేజ్‌ డేటా స్టేషన్లు ఉన్నాయని, ఇవన్నీ కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహిస్తున్నారని వివరించింది.

ఈ గేజ్‌ స్టేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాలు, వరద అంచనా, గణింపు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకమారు కృష్ణా బేసిన్‌లో టెలి మెట్రీ వ్యవస్థను అమలు పరిస్తే, తర్వాత భవిష్యత్తులో గోదావరి బేసిన్‌లో ఈ వ్యవస్థను అమలు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. అప్పటి వరకు టెలిమెట్రీ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని తెలి పింది. దీనిపై గోదావరి బోర్డు ఎలా స్పందిస్తుందన్న ది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే కృష్ణా బేసిన్‌ పరి« దిలో తొలి విడతలో 18, రెండో విడతలో 29 ప్రాం తాల్లో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు రెండేళ్ల కింద నిర్ణయించినా అమలు కాలేదు. దీంతో గోదావరి బేసిన్‌ పరిధిలో టెలిమెట్రీ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement