చుక్క చుక్కకూ లెక్క | APWRIMS For Usage Of Every Raindrop | Sakshi
Sakshi News home page

చుక్క చుక్కకూ లెక్క

Published Sun, Oct 18 2020 7:28 PM | Last Updated on Sun, Oct 18 2020 7:31 PM

APWRIMS For Usage Of Every Raindrop - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను వినియోగించుకోవడంలోనూ వినూత్న రీతిలో యాజమాన్య పద్ధతులను అనుసరిస్తోంది. పన్ను, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు తదితర అంశాల ఆధారంగా సర్కార్‌ ఏటా బడ్జెట్‌ రూపకల్పన చేస్తుంది. ఇదే తరహాలో ప్రభుత్వం ఏటా నీటి బడ్జెట్‌ను రూపొందిస్తోంది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల సమాచారం, నియంత్రణ వ్యవస్థ)ను ఏర్పాటు చేసింది. ఏటా రాష్ట్రంలో కురిసే వర్షం, అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని నీటి ఆదాయంగా పరిగణిస్తోంది. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వ, భూగర్భ జలాలు, భూమి (ఒక మీటర్‌ లోతు)లో తేమ శాతం రూపంలో ఉన్న నీటిని నిల్వలుగా లెక్కిస్తుంది. ఆవిరిగా మారడం, సముద్రంలో కలిసే నీటిని, సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిని వ్యయంగా లెక్కిస్తుంది. ఈ లెక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జల వనరులను సంరక్షిస్తోంది.

జలాంధ్రప్రదేశ్‌.. 
రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటిదాకా సగటున 658.4 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 835.5 మి.మీల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 26.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. దీని వల్ల 4,693.02 టీఎంసీల నీరు వచ్చింది. 
కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా తదితర అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి 4,825.13 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. అంటే మొత్తంగా 9,518.15 టీఎంసీలు వచ్చాయి.
ఇందులో రవాణా, ఆవిరి రూపంలో 2,359.04 టీఎంసీలు వృథా అయ్యాయి. అంతర్రాష్ట్ర నదుల నుంచి వచ్చిన జలాల్లో 3,878.87 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. సాగునీటికి 746.97, తాగునీటికి 36.31, పారిశ్రామిక అవసరాలకు 22.08 టీఎంసీలు వినియోగించుకున్నారు. భూ ఉపరితలంపై వాగులు, వంకలు, కాలువలు, డ్రెయిన్‌లలో 1,438.59 టీఎంసీలు ఉన్నాయి. వీటిని ఖర్చయిపోయినట్లుగానే భావించాలి. ఈ లెక్కన మొత్తంగా 8,481.85 టీఎంసీలు ఖర్చయ్యాయి. (కృష్ణా నది.. అదే ఉధృతి)

రిజర్వాయర్లలో గత ఏడాది కంటే 49.49 టీఎంసీలు అధికం
కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో 591.42, గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలో 9.98, పెన్నా బేసిన్‌లోని రిజర్వాయర్లలో 195.15, వంశధార, నాగావళి, ఇతర బేసిన్‌లలోని రిజర్వాయర్లలో 67.43 వెరసి 863.98 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 49.49 టీఎంసీలు అధికంగా ఉన్నాయి.
చెరువుల్లో 80.02 టీఎంసీలు, భూగర్భ జలాల రూపంలో 184.79 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాల రూపంలో 164.80 టీఎంసీలు అధికంగా నిల్వ ఉన్నాయి. చెక్‌డ్యామ్‌లు, పంట కుంటల్లో 30.02 టీఎంసీలు, భూమిలో తేమ రూపంలో 671.89 టీఎంసీలు (గత ఏడాది కంటే 60.02 టీఎంసీలు అధికం) నిల్వ ఉన్నాయి.  
మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటి వరకు 1,830.76 టీఎంసీలు (గత ఏడాది కంటే 354.24 టీఎంసీలు అధికం) నిల్వ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో నీటి నిల్వల్లో ఈ ఏడాదే గరిష్టం కావడం గమనార్హం.

జల వనరుల సద్వినియోగంలో ప్రథమ స్థానం 
సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల కింద ఆన్‌ అండ్‌ ఆఫ్‌ విధానంలో నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని పొదుపు చేస్తూ అధిక ఆయకట్టుకు సర్కారు నీటిని అందిస్తోంది. 
తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నీటి రాక.. పోకను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. 
నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో, జల వనరులపై వాతావరణ ప్రభావం అంచనా వేయడంలో ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌కు మొదటి, రెండవ ర్యాంకులను.. అన్ని నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర జల వనరుల శాఖకు ఫస్ట్‌ ర్యాంక్‌ను నేషనల్‌ వాటర్‌ మిషన్‌ గతేడాది ప్రదానం చేయడం గమనార్హం. 

ఇదీ నీటి లెక్క (టీఎంసీల్లో) 

రాష్ట్రంలో కురిసిన వర్షం 4,693.02
అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చిన నీరు 4,825.13 
ఆవిరూపంలో నష్టం 2,359.04
కడలిలో కలిసిన నీరు 3,878.87
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు (ఇప్పటిదాకా) 805.36
రిజర్వాయర్లలో 863.97
చెరువుల్లో 80.02
భూగర్భజలాల రూపంలో 184.79
భూమిలో వంద సెంటీమీటర్ల లోతులో తేమ రూపంలో

671.89

చెక్‌ డ్యామ్‌లు, పంట కుంటల్లో 30.09

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement