సందర్భం
విజయవాడ నగర జీవనాడిపై ప్రకృతి కత్తి పడింది. అది సుడులు తిరుగుతూ చేసిన గాయం పొరలు పొరలుగా చర్మాన్ని కండరాలను చీల్చుకుంటూ ఇక్కడి పేదల ఎముకల్నీ పగలగొట్టి అందులోని మజ్జను తాకింది! జలసమాధిగా మారిన ఈ నగరంలో ఉత్తరాంధ్ర, దక్షణ కోస్తా, తెలంగాణ మూడూ ఉన్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాలు అంటే, సరే సరి. గడచిన పదేళ్ళలో అయితే, బీహార్, చత్తీస్ఘర్, ఒడిస్సా కూలీలు, పశ్చమ బెంగాల్ జరీ నేత పనివాళ్ళు, రాజస్థాన్ మార్బుల్ పనివాళ్ళు నగరంలో ఏడాది పొడుగునా కనిపిస్తున్నారు. వీళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాల మేళం కోసం ఏకంగా రాజస్థాన్ బ్యాండ్ బృందం ఒకటి మంగళగిరిలో ఉంటున్నది.
ఇవన్నీ సరే మరి ఇక్కడి స్థానికులు మాటేంటి? అనేది సహజంగానే వస్తున్నది. దీనికే సరైన సమాధానం ఇప్పుడు ‘బెజవాడ’ దగ్గర లేదు. ‘నేను ఏమిటి?’ అని ఆ నగరం కూడా తనకొక ‘ఇమేజి’ ఉండాలని అనుకున్నట్టుగా పెద్దగా కనిపించదు. ఊళ్ళ నుంచి బెజవాడకు జరిగిన వలసల్లో తొలితరం రైతు కుటుంబాల ఛాయలు ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయినట్లే. అవి కూడా వాళ్ళు తీస్తున్న సినిమాలు మాదిరిగానే- ‘పాన్ ఇండియా’ అయిపోయాయి. ఒకప్పుడు గవర్నర్ పేటలో మొదలైనవీరి ‘ఫైనాన్స్’ ఆఫీసులు ఇప్పుడు- ‘జూబిలీ హిల్స్’, ‘కావూరి హిల్స్’లో స్థిరపడ్డాయి. మరిక్కడ మిగిలింది ఎవరు? అనేది సమాధానం దొరకని ప్రశ్న. అయితే, శూన్యం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ప్రతి శూన్యం పూడ్చబడుతుంది. చలన లక్షణం సహజమైన ‘రూపాయి’ చుట్టూ ఉండే ‘యాక్టివిటి’ అనంతం కనుక, పైన చెప్పిన పలు ప్రాంతాలు నుంచి ఇక్కడికి నిరంతరాయంగా జరుగుతున్న వలసలు కారణంగా దీని సహజ లక్షణం పోగొట్టుకోకుండా, బెజవాడ జంక్షన్ అంటే, అది 24X7 సిటీగానే ఇప్పటికీ చెలామణిలో ఉంది. గత చరిత్రలో కూడా మొదటి నుంచి ఇదొక ‘ఫ్లాట్ ఫారం’ వచ్చేవాళ్ళకు పోయేవాళ్లకు ఇదొక అనుకూలమైన ‘వై - జంక్షన్’. ఇది తూర్పు నుంచి వచ్చే ‘జి.టి. లైన్’ ఉత్తరం నుంచి వచ్చే డిల్లీ లైన్ రెండు ఇక్కడ కలిసి చెన్నై వైపుకు వెళ్ళడంతో ఈ రెండింటికీ మధ్యన వున్న నగరంగా బెజవాడ నగరం ‘వైజంక్షన్’గా మారింది.
ఉత్తర భారతం నుంచి వింధ్య పర్వతాలను దాటి దక్షణాది పైకి వచ్చిన అన్ని సైన్య పటాలాలకు ‘నది’ - ఓడరేవు’ – ‘పీఠభూమి’ ఇలా మూడు వారికి అమిరింది ఇక్కడే! దాంతో ఈ ప్రాంతం ఏదీ తనకోసం పట్టించుకోకుండా, కాందిసీకుల గుడారాలకు మైదానమై, గుర్రాలకు పచ్చిక బయలై, వచ్చేపోయే వారికి వడ్డించే పూటకూళ్ళ ఇల్లు అయింది- బెజవాడ.
అలా మొదటి నుంచి ‘కంటోన్మెంట్’ లక్షణాలు బెజవాడకు దాని భౌగోళిక రూపం నుంచి సంక్రమించాయి. అలాగని దానికి ఇప్పుడు ఏదో చికిత్స జరగాలని కూడా ఇక్కడ మిగిలిన స్థానికులు అనుకోవడం లేదు. కానీ, రాష్ట్ర విభజన జరిగాక, ఈ ఊరిపై జరుగుతున్న ప్రయోగాలు మాత్రం అత్యాచారాన్ని తలపిస్తున్నాయి. ప్రతి ఊరికి ఒక ‘స్కేల్’ ఉంటుంది కదా. అభివృద్ధి పేరుతొ మనం ఏమి చేసినా అది ఆ ‘స్కేల్’ పరిధిలో కదా ఉండాల్సింది. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, స్థానికత స్పృహ లేని పరిపాలనతో ఎలా నెగ్గుకుని రావడం.
కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి వద్ద తూర్పు, పశ్చమ డెల్టా కాల్వలు ఒకటి గుంటూరు వైపు, మరొకటి బెజవాడ వైపు వెళతాయి. దాంతో ఒక్క బెజవాడ నగరంలో నుంచే బందరు కాల్వ , రైవస్ కాల్వ, ఏలూరు కాల్వలు వెళతాయి. వీటిలో నాలుగవది నగరానికి ఉత్తరం వైపున తూర్పు నుంచి పడమరకు ప్రవహించే బుడమేరు. ఇది పశ్చమ కృష్ణాజిల్లా, ఆ పైన ఖమ్మం జిల్లాల్లో కురిసే వర్షం కారణంగా అరుదుగా ప్రవహిస్తూ చివరికి ఇది కొల్లేరులో కలుస్తుంది. ప్రాంతాన్ని అలా ఉంచి, మళ్ళీ ప్రజల వద్దకు వద్దాం.
నగరంలో కాల్వలతో పాటుగా కొండలు కూడా ఎక్కువే కావడంతో, ఇక్కడికి జరిగే బ్రతుకుదెరువు వలసలకు ఈ రెండు నైసర్గిక అంశాలు ప్రధాన కారణాలు. బతకడానికి బెజవాడ కనుక వెళితే, అయితే కాల్వ ఒడ్డున లేదా కొండమీద ఒక్కడో ఒక చోట ‘ల్యాండ్’ కావడం మాత్రం తేలిక, అన్నట్టుగా ఒకప్పటి పరిస్థితి ఉండేది. అయితే, ఇవన్నీ తాటాకు గుడిసెలు. దాంతో ఎండాకాలం ఇక్కడ అగ్నిప్రమాదాలు తరుచుగా జరిగేయి. అలా ఒకేసారి కృష్ణ ఒడ్డున 450 ఇళ్ళు కాలిపోయినప్పుడు, వారికి ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇస్తే 1984లో ఏర్పడింది అజిత్ సింగ్ నగర్.
నగరంలోనే ఏర్పడిన మురికివాడల్లో 1990-95 మధ్య ‘ఓ.డి.ఏ.’ (ఓవర్సీస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’) పేరుతొ మురికివాడల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. దాంతో కొత్తగా పేదలు నివసించే ప్రాంతాల్లో వీధి లైట్లు, రోడ్లు, మంచినీరు, స్కూళ్ళు, వైద్య కేంద్రాలు, కమ్యునిటీ హాళ్ళు, వచ్చాయి. ఇదే సమయంలో మొదలైన ‘డ్వాక్రా’ పొదుపు సంఘాలు ఏర్పడడంతో ఈ కాలనీల్లో మహిళలు కొత్త వినియోగదారులు అయ్యారు. ఇదే కాలంలో నగరానికి పశ్చామాన బుడమేరుకు ఇవతల సింగ్ నగర్ వద్ద సుభాస్ చంద్ర బోస్ కాలనీ పేరుతొ 2000 ఇళ్ళతో మరొక కాలనీ ఏర్పడింది. నగరంలోని కాల్వ ఒడ్డున పేదలకు మురికివాడ నిర్వాసితులకు ఈ హౌసింగ్ కాలనీలో ఇల్లు కేటాయించారు. దీన్ని 1986 అక్టోబర్ లో అప్పటి గవర్నర్ కృష్ణ కాంత్ ప్రారంభించారు. అలా మరికొన్ని కాలనీలు పెరిగాయి.
ఆ తర్వాత నగరంలో నుంచి ఈ కాలనీలోకి రావడానికికొత్తగా ‘ఫ్లై ఓవర్’ వచ్చింది, దాంతో ఈ కాలనీలో ఉండే బలహీనవర్గాల ఉపాధి మెరుగైంది. దీని సమీపాన- ‘వాంబే’ (వాల్మీకి-అంబేద్కర్ ఆవాస్ యోజన) పేరుతొ ఆదివాసీలు కోసం మరొక కాలనీ ఏర్పడింది. ఈ రోజున నగరంలో అది ఏ రంగం అయినా- ‘సర్వీస్ ప్రొవైడర్స్’ మాత్రం ఈ ‘కాలనీలు’ నుంచి రావలసిందే. ఈ ముప్పై ఏళ్లలో ఈ కాలనీల రూపు రేఖలు మారిపోయాయి.
ఇప్పుడు ఇవి ఎగువ మధ్య తరగతి వర్గాల నివాసిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఒకప్పుడు సైకిళ్ళు, లూనాలు. టివీస్ బళ్ళు నుంచి ఇప్పుడు మోటార్ బైక్స్ స్థాయికి ఎదిగారు. వాటికి వాళ్ళు కట్టాల్సిన ‘ఇ.ఎం.ఐ’.లు అంటే, అవి ఎటూ ఉంటాయి. కానీ, ఊహించని రీతిలో వారి ఇళ్ళు నీటిలో మునిగి, కళ్ళముందు వారి విలువైన వస్తువులు అన్నీ నీళ్ళల్లో ధ్వంసమై ఇప్పుడు వారి కలలు చిద్రం అయ్యాయి. నష్టాల అంచనా జరగాల్సి వుంది.
ప్రభుత్వాలు మారడం కొత్త ఏమీ కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు ఎలా మారతాయి? బందరులో కృష్ణాజిల్లా కలక్టర్ ఉంటున్న రోజుల్లో కేవలం ఒక వారం పాటు విజయవాడ వచ్చి ‘క్యాప్ ఆఫీస్’లో బసచేసి, వరద నియంత్రణ పర్యవేక్షించి తిరిగి బందరు వెళ్ళడం జరిగేది. ఇదే ముఖ్యమంత్రి కాలంలో కృష్ణానదికి 1998లో రికార్డు స్థాయిలో 12లక్షల క్యూసెక్కుల వరద వస్తే, అప్పటి కలక్టర్ బి.ఆర్.మీనా ఒంటిచేత్తో కేవలం జిల్లా అధికారుల నిర్వహణలో వరద నియంత్రణ పనులు పూర్తి చేసారు. కానీ ఒకప్పటి కృష్ణాజిల్లా ఇప్పుడు రెండు అయింది. అదనంగా ‘ఎన్.డి.ఆర్.ఎఫ్.’ దళాలు వీరికి ఇప్పుడు అందుబాటులో వున్నాయి, అయినా అయినా వైఫల్యం?
‘ఒకప్పుడు బుడమేరుకు వరద వస్తే, కొల్లేరు సరస్సు పొంగి గుడివాడ వద్ద నందివాడ మండలంలో వరద వచ్చేది. కానీ ఇప్పుడు, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం కారణంగా విజయవాడ నగరం మునిగింది’ అంటున్నారు ఇరిగేషన్ అంశాలు తెలిసిన మాజీ ‘పిటిఐ’ కరస్పాండెంట్ కె.ఆర్. కె.రెడ్డి. (75) ‘కృష్ణా ‘కమాండ్ ఏరియా’ లో వచ్చే వరదలకు తెలంగాణ దక్షణ జిల్లాల్లో కురిసే వర్షపాతం కారణం కనుక, చిన్న చిన్న వాగులు వంకలు నీటి నిర్వహణకు ఎపి తెలంగాణ రెండు రాష్ట్రాల అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు భవిష్యత్తులో ఇటువంటి విపత్తుల నిరోధానికి పరిష్కారం అంటున్నారు. ఏదేమైనా అసంఖ్యాకులైన వర్ధమాన వర్గాల కుటుంబాల కలలు చిద్రం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యం మాత్రం సమీప ఎ.పి. చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగులుతుంది.
-జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment