ప్రకృతి సమయోచితంగా అందించే సూచనలను, దాని ముందు తలొంచి వినమ్రంగా స్వీకరించడం ఒక్కటే మనిషికి మిగిలిన ‘ఆప్షన్’. రాజైనా మంత్రి అయినా ఎవరైనా దాని ముందు ఒక్కటే. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం ఇదే సెప్టెంబర్ రెండున ‘కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా’ అయిన కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సాక్షాత్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందారు. మళ్ళీ తిరిగి అదే రోజు అదే కృష్ణాతీరం చూపించిన ఉగ్ర రూపం ముందు, యావత్తు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ స్తంభించి, నిస్తేజంగా ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చింది.
‘నేచర్ కోర్స్’ ఆరంభం,అంతం రెండూ ఎప్పటిలా అవి తమ సహజ మార్గంలో వచ్చి వెళ్ళిపోయాయి. అవాక్కయి జరిగింది ఏమిటి? అని వెనక్కి తిరిగి చూస్తే, బోధపడిన జ్ఞానం ఏమంటే, ప్రభుత్వ శాఖలు ఏడాది పొడ వునా ‘సీజన్’ స్పృహతో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అవ సరమైన బడ్జెట్ ఇస్తూ, ఒక శాఖ పనుల్లో మరొకరు వేలు పెట్టకుండా అందరూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కొంత కాలంగా అటువంటి క్రమశిక్షణకు తరచూ తూట్లు పడు తున్నది. నెల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రభు త్వంలో– ‘పొలిటికల్ గవర్నెన్స్’ ఉంటుంది, అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక ‘పొలిటికల్ ఎగ్జిక్యూ టివ్’ పరిమితులు ఎంతవరకు? అమలులో వున్న ‘ఫ్లడ్ మాన్యువల్స్’కు పునః సమీక్ష అవసరమా? అనే మీమాంసకు ‘2024 ఏపీ ఫ్లడ్స్’ ఒక నమూనా కానుంది.
ఎందుకంటే, ఇదే జిల్లాల్లో 1977 దివిసీమ ఉప్పెనలో 14,204 మంది దుర్మ రణం పాలైన చరిత్ర ఉంది. తదనంతరం ఏవీఎస్ రెడ్డి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా తక్షణ సహాయం, పునర్నిర్మాణ పనులు చేసిన చరిత్ర కూడా ఉంది. అయినా ఇదేమీ నిన్న కాక మొన్న పుట్టిన ‘జాగ్రఫీ’ కాదు కదా! తూర్పు కనుమల్లో కురిసే వర్షం నీటి ప్రవాహానికి ఒక సహజ మార్గం ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పడు సర్కారు జిల్లాలు అనేవారు. బ్రిటిష్ ప్రెసిడెన్సీ పాలనలో 200 ఏళ్ళ పాటు ఉన్న ప్రాంతం. అప్పట్లోనే ప్రతిదానికీ ఇక్కడ ‘సిస్టమ్స్’ ఏర్పడ్డాయి. అందుకే, ఇరవై ఏళ్ళ క్రితం వరకూ కృష్ణాజిల్లా కలెక్టర్ టేబుల్ పైన గార్డన్ మెఖంజే ‘ది మాన్యువల్ ఆఫ్ క్రిష్ణా డిస్ట్రిక్ట్’ విధిగా ఉండేది. అయినా ఇటువంటి విషయాల్లో మనం వెనక్కి చూడడం, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం మర్చిపోయి చాన్నాళ్లు అయింది.
మనకు తెలుసు, కదలిక (మొబిలిటీ), స్థిరత్వం (స్టాటిక్) రెండు భిన్నమైన వేర్వేరు అంశాలు. వరద అన్న వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు (సీబీఎన్) కదలిక మొదలయింది, ఇప్పటికీ అది ఇంకా ఆగలేదు. అయితే ‘శాటిలైట్ కమ్యూని కేషన్ సిస్టం’ వచ్చాక, ‘ఇ–గవర్నెన్స్’ వంటి ఆధునిక సాంకే తికత అందుబాటులో ఉండడం వల్ల పరిపాలనా యంత్రాంగం కదలకుండా ఉన్నచోట నుంచే ముందుగా వాతావరణ హెచ్చరికలు తెలుసుకుని, విపత్తు తీవ్రతను అంచనా వేస్తూ, దిగువకు క్షేత్ర సిబ్బందికి సూచనలు ఇస్తూ నష్టనివారణ చర్యలు తీసుకుంటుంది. రెండవ దశలో విపత్తు తర్వాత క్షేత్ర స్థాయి సిబ్బంది (మొబిలిటీ) సహాయ, పునరావాస, పునర్ని ర్మాణ పనులలోకి దిగుతారు. ఇలా ఇది రెండు దశల ప్రక్రియ.
అంటే, పాలనా యంత్రాంగం కదలకుండా ఉన్నచోట నుంచే తమ విధుల్లో ఉంటే, ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’గా సి.ఎం. సీబీఎన్ నిత్యం కదులుతున్నారు. దాంతో ఇక్కడే మన కొచ్చే అనుమానం, ‘అధికారం’ అనేది కదిలేదా (మొబిలిటీ) లేక స్థిరంగా (స్టాటిక్)గా ఉండేదా? అది కదిలేదే కనుక అయితే, మళ్ళీ దానికి ఏదో ఒక పేరుపెట్టి అది ‘రాజధాని’ అంటూ దానికుండే ‘ఫ్లోటింగ్’ లక్షణాన్ని ‘స్టాటిక్’గా మారుస్తూ, దాన్ని ఒక గాటన కట్టే ప్రయత్నం ఏమిటి? దాని చుట్టూ ఇంత పరిపాలనా యంత్రాంగం, ప్రభుత్వ నిధులు కేంద్రీకృతం ఏమిటి? ఈ దృష్టితో చూసినప్పుడు, అధికారం అనేది ఒక ‘సాఫ్ట్ వేర్’ మాదిరిగా దృశ్యమానం కాని అమూర్త అంశం అని స్పష్టం అవుతున్నది.
దాంతో ‘అధికారం’ లేదా దాన్ని మనం చలాయించే ప్రాంతమైన ‘రాజధాని’ ఇవి రెండు కూడా స్థిరంగా ఉండని ‘మొబిలిటీ’ అంశాలు అయినప్పుడు, ‘అధికారం’ అనే ఈ మొత్తం కసరత్తు ఒక ‘వర్చువల్’ భావన అనే అభిప్రాయం వద్దకు మనల్ని తీసుకువెళుతున్నది. దీనర్థం ప్రభుత్వ యంత్రాంగం అన్నప్పుడు మౌలిక వసతులు అనబడే ఆఫీసులు, అధికారులకు సిబ్బందికి నివాసాలు ఉంటే అవి సరిపోతాయి. రాజ్యంలో – ఒక వ్యవస్థకు ఉండే ఇటువంటి అమూర్త స్వభావాన్ని రాజకీయాలలోకి వచ్చిన తొలి రోజు ల్లోనే ఎన్.టి. రామారావు– ‘కేంద్రం ఒక మిథ్య’ అనడంలో మనకు కనిపిస్తుంది.
ఇక్కడే పైన పేర్కొన్న తేదీల్లో అమరావతిలో కురిసిన వర్షపాతం ఎంతో వరద పరిస్థితి ఏమిటో మనకు తెలియాలి. ‘ఆ ప్రాంతంలోని 29 గ్రామాల్లో 25 పూర్తిగా మునిగాయనీ, ఆగస్టు 31న ఒక్క రోజులో అమరావతి వాతావరణ కేంద్రంలో 28 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యిందనీ, ‘క్యుములోనింబస్’ మేఘాలు, బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారణాలుగా కేవలం మూడు గంటల్లో 15 సెం.మీ. వర్షపాతం నమోదు అయిందనీ’ పేరు చెప్పడానికి ఇష్టపడని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారి ఒకరు చెప్పినట్టుగా సెప్టెంబర్ పదిన ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక రాసింది.
కొల్లేరు సరస్సులో నీటిమట్టం సాధారణంగా రెండు మీటర్లు ఉంటుంది. వరద కారణంగా అది సెప్టెంబర్ ఒకటిన 3.2 మీటర్లు ఉండగా 8వ తేదీకి 3.35 మీటర్లకు పెరిగింది, 9వ తేదీకి కొల్లేరు ప్రాంత గ్రామాలకు వరద ముంపు ప్రకటించారు. 10వ తేదీకి అది 3.42 మీటర్లుకు పెరిగింది. చివరిగా ప్రకృతి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము అనేది ఒక్కటే ఏ తరంలో అయినా మిగులుతున్న ప్రశ్న.
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment