వరి పంటలో పొడుగు రకం అక్కుళ్ళు స్థానంలోకి పొట్టి రకం–స్వర్ణ ‘హైబ్రీడ్’ వచ్చినప్పుడు పాత–కొత్తల మధ్య అప్పట్లో జరిగిన ఆ మార్పు ఏమంత సాఫీగా అవలేదు. ఆ బియ్యంతో వాతం కలిగి కీళ్ళ నొప్పులు వస్తాయనీ, ఆ గడ్డి తిన్న పశువులు పాలు ఇవ్వవు అనీ అపోహలు ఊళ్ళల్లో ఉండేవి. ఇప్పుడు అదంతా చరిత్ర. అదే ‘పొట్టి’ వరి రకాలపై వందలకొద్దీ పరిశోధనలు జరిగిన తర్వాత, వస్తున్న పలు రకాల‘రిఫైండ్’ బియ్యం అన్నం ఇప్పుడు మనం తింటున్నాం.
ఒక అన్నం అనే కాదు, అది ఏ రంగమైనా కొత్తదనాన్ని అంత తేలిగ్గా అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండం. పైకి అది నిజమని ఒప్పుకోవడానికి మనం పెద్దగా ఇష్టపడం. కానీ, జీవితం ఏవో కొన్ని చట్రాల మధ్య స్తబ్ధుగా అలా సాగిపోవడంలో కూడా వొక నులివెచ్చని సౌఖ్యం ఉంటుంది. దాన్ని తప్పు పడుతూనే ప్రతి కాలంలోనూ కవులు, రచయితలు సమాజాన్ని జాగృతం చేసేది.
అది ఏ చట్రం అయినా కానీ, ఈ నులివెచ్చని సౌఖ్యం మనకు ఎలా ఉండాలి అంటే– కష్టం వస్తే చెప్పుకోవడానికి సమీపాన ఒక పెద్దమనిషి ఉండాలి. అతడు మనకంటే కొంచెం ఎత్తులో కూర్చుని అవసరమైతే మనల్ని గదమాయిస్తూ సలహా వంటిది చెప్పే వాడై ఉండాలి. అతడు చెప్పాలి మనం వినాలి. వెళ్ళిన పని అయ్యీ కానట్టుగా పాక్షికంగా జరగాలి. ఎందుకంటే, మన కష్టానికి కారణమైన వారికీ ఇదే పెద్దమనిషి పూచీ.
ఇదీ ఇన్నాళ్ళూ మనకు తెలిసిన లెక్క. మరి ఇప్పుడు అదేమీ కాదని ఆ స్థానంలోకి ఒక ‘వలంటీర్’ వచ్చాక, ఆ వెనుక ఒక సచివాలయం అనే ఆఫీసు... అక్కడిచ్చిన ఫిర్యాదు పైకి వెళ్లి కిందికి పరిష్కారం రావడం అంటే, మరీ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు ఏమిటి ఇదంతా?! అదే పని అయినా... మరీ ఇంత వేగిరం (‘ఎస్ ఆర్ నో’) తెమిలిపోతే ఎలా? ఆ తర్వాత ఏమిటి చేయడం? 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదే పెద్ద సమస్య అయింది. ఒకే ఒక్క ‘బటన్ నొక్కడం’ అనేది పైన చెప్పిన వైనం మొత్తానికి చోటు లేకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే, సామాన్యుల జీవనంలో ఎంతో విస్తరించుకుని ఉండే ఇంత పెద్ద ‘మెలోడ్రామా’ బొత్తిగా మాయమయింది.
సంప్రదాయ రాజకీయ సమాజంలో ఆధిపత్య కులాల పెద్దలకు ‘రికార్డు’లో వారికి ఎటువంటి హోదా లేకున్నా కేవలం ‘బై నేమ్’ వారు ఫోన్ చేసి రెవెన్యూ, పోలీస్ ఆఫీసుల్లో ‘పవర్’ చెలాయిస్తూ పనులు చేయించడం చాలా పాత విషయం. చట్టసభల్లో ఉండే నాయకులు ఇటువంటి ‘సెమీ వర్టికల్స్’ వలయాలు తమచుట్టూ ఏర్పడాలని, అటువంటివి వీలైనంత ఎక్కువగా ఉండేట్టుగానే వారు కూడా కోరుకుంటారు. ఎందుకంటే, ఎన్నికలప్పుడు ఓటర్లతో ‘లైవ్ నెట్ వర్క్’ ఉండే ‘ఛానెల్’ వాళ్లకు ఇదే! కుదిరితే ఏవో నామినేటెడ్ చైర్మన్ పదవులు లేదా ‘కాంట్రాక్టులు’ వీళ్ళకు ఎటూ ఉంటాయి. కౌన్సిలింగ్ పద్ధతి లేని రోజుల్లో చిన్న ఉద్యోగుల బదిలీలు వీళ్ళు అవలీలగా చేయించేవారు. వీరు కేంద్రంగా జరిగే లావాదేవీలు పార్టీల్లో చిన్నకులాల కార్యకర్తలకు అదొక మధ్యస్థాయి అదనపు వ్యాపారంగా సాగేది.
అయితే, దశాబ్దాలుగా ఇంత చిక్కటి వలయాలుగా అల్లబడిన అధికార చట్రం కూసాలను, ఐదేళ్ళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం–గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థతో ఎక్కడికక్కడ వదులు చేసేసింది. దాంతో ‘డెలివరీ సిస్టం’లో ఉండే ‘లీకేజీ’ల వద్ద ప్రయోజనం పొందే ‘కేడర్’ నష్టపోయి అసంతృప్తులు అయ్యారు.
‘పవర్ పాలిటిక్స్’లో జరిగే ఇటువంటి మార్పును నిజానికి ‘న్యూట్రల్ ఓటర్’ హర్షించాలి. అది జరగలేదు సరికదా– ‘మాది తీసి వాళ్లకు పెడుతున్నారు...’ అనే ఫిర్యాదు వద్దే వాళ్ళు ఆగిపోయారు. అలా ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అవసరాన్ని గడచిన పదేళ్ళలో అందరూ మర్చిపోయారు. ఇంతకీ జరిగింది ఏమిటి, మునుపున్న ‘సెమీ–వర్టికల్స్’ జాగాను గ్రామ సచివాలయాలలోని బహుజన యువతతో ‘హారిజాంటల్’గా జగన్ మార్చారు.
అయితే, సంప్రదాయ అధికార నిర్మాణ చట్రం ఎప్పుడూ భద్రత కోరుకుంటుంది. ఏ కారణం చేత అది బీటలకు గురైనా పార్టీలతో పనిలేకుండా మొత్తం రాజకీయ చిత్రంపై దాని పర్యవసానాలు ఉంటాయి. జగన్ పాలనలో ఏపీలో సుపరిపాలన లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలు మొదలైనట్టు తెలుస్తూనే ఉంది. కానీ జరిగింది ఏమిటి? సంప్రదాయ ‘పవర్ పాలిటిక్స్’ బహుళ అంచెలు (హైరార్కీ) కొంతమేర నిర్వీర్యం కావడం నిజమే. కానీ, ఈ స్వల్ప వ్యవధిలో ఆ స్థానంలోకి వచ్చిన ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ఆ పార్టీకి పాక్షికంగానే ఉపకరించాయి. ఆ కారణంగా, ఒక హక్కుగా ‘రాజ్యం’ ఇచ్చే సంక్షేమ ప్రయోజనాలు తీసుకుంటూనే, ఏ ఒక్క రాజకీయ పార్టీకి విశ్వాసంగా ఉండనక్కర లేదనే స్వేచ్ఛాశ్రేణులు ఏర్పడే కొత్త పరిస్థితికి అది దారితీసింది.
ఈ పార్టీ తీసుకున్న ఈ కొత్త వైఖరి వల్ల, అది తన ఓటర్లకు– ‘మీ మెడమీద ఇకముందు ఏ కాడి ఉండదు’ అని భరోసా ఇచ్చింది. గెలిచారా, ఓడారా అనేది అటుంచితే... రూపాంతర ప్రజాస్వామ్యం (‘ట్రాన్స్‌ఫార్మింగ్ డెమోక్రసీ’) దృష్టి నుంచి చూసినప్పుడు ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఇన్నాళ్ళూ కనిపించని చట్రాల మధ్య బంధించబడిన పక్షుల్ని ఇక స్వేచ్ఛగా బతకమని పంజరంలో నుంచి వాటిని బయటకు వదలడం వంటిది.
ఇంత చేసి– ‘మా పార్టీ వల్ల మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని జగన్ ‘ఆప్షన్’ ఇవ్వడం– ‘లిబరల్ డెమోక్రసీ’ వైఖరికి పరాకాష్ట. జనానికి అది అర్థం కాకపోతే, రాజకీయ పార్టీగా దానికి నష్టం అయితే కావొచ్చు. కానీ, దేశ రాజకీయాల్లో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రయోగం ఒక ‘కేస్ స్టడీ’ కానుంది. ఇప్పటికే నెదర్లాండ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా రీసెర్చ్ ఫెలో విగ్నేష్ కార్తీక్, జేఎన్‌యూ పరిశోధకుడు వి. చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో రెండు పక్షాల వైఖరిలోని వైవిధ్యాన్ని ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల
పత్రిక వ్యాసంలో వెలికి తీశారు.
– జాన్ సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment