
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి ప్రత్యేకమైన విజన్ వుండాలి.మొదటగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి..ఆ తర్వాత ఆస్తులను రక్షించాలి. అందుకోసం పాలకులు అధికార యంత్రాంగంలో స్ఫూర్తిని నింపి.. చిత్తశుద్ధితో పని చేయాలి. తన పాలనలో అదే పని చేశారు తాను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు ప్రజాసేవకున్ని అని నిరూపించుకున్నారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మనసున్న నాయకునిగా అడుగులు వేశారు.
కరోనా సమయంలో రాజీలేని పోరాటం
ప్రజలకు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు..కరోనాలాంటి మహా విపత్తు సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా అడుగులు వేశారు. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యాత ఇచ్చి రాజీలేని పోరాట పటిమను ప్రదర్శించారు.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి..ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు సర్వత్రా వ్యాపించాయి. కరోనా రోగంతో కొంతమంది..భయంతో అనేక మంది చిగురుటాకుల్లా రాలిపోయిన అత్యంత భయానకమైన రోజులవి..
అలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగానే కాదు.. మానవత్వం ఉన్న నాయకునిగా పని చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో, నిపుణులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించి సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో భయమనేది పోగొట్టారు..
ఇంట్లో నుంచి జనం బయటకు రావాలంటేనే దడుసుకుంటున్న పరిస్థితుల్లో గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఆయన చేయించిన సేవలను జనం ఎప్పటికీ మరిచిపోరు. నిత్యం ఫీవర్ సర్వేలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని కరోనా భూతాన్ని తరిమికొట్టారు. ప్రజలకు కావాల్సిన మందులు దగ్గర్నుంచి ఆహార పదార్ధాల వరకు అన్నిటినీ అందించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా సేవా కార్యక్రమాలు దాదాపు రెండేళ్లపాటు కరోనా సమయంలో చేసి చూపించారు.ఒక ప్రభుత్వ పెద్దగా తన కిందనున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయవచ్చు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు.
మన ఇంట్లో వారే కష్టాల్లో ఉంటే మనం ఎలా స్పందిస్తామో అలా ఆయన పాలన సాగించారు. ఉచితంగానే కరోనా టెస్టులు చేయించటం దగ్గర్నుంచి...ప్రజలకు కావాల్సిన మందులను కూడా నేరుగా వారి ఇంటికి పంపించారు. పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయల ఖర్చయిన కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్పించి ఉచితంగానే చేయించారు. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం.
క్వారంటైన్ సెంటర్లలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వెయ్యి రూపాయల చొప్పున అందించటంతోపాటు, ప్రతి ఇంటికీ నెలకు రెండు సార్లు రేషన్ ను కూడా ఉచితంగా ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేయిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం, వ్యాపారాల కోసం వెళ్లిన వారు సైతం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో జగన్ పాలనలో ఉన్నాం కాబట్టే మేము బతికి బట్ట కట్టాం అనే మాట చాలామంది నోట విన్నాం.
వరద బాధితులకు కొండంత అండగా..
వరద బాధితులను కాపాడటంలో వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించటం దగ్గర్నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించటం వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వరదల సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అధికారుల కాళ్లకు అడ్డం పడే పనిని జగన్ ఏనాడూ చేయలేదు. ముందుగా అధికారుల సహాయక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక ప్రభుత్వ పెద్దగా పైనుంచి చూసుకునేవారు. అంతేకాదు.. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టి, బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారికి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పించారు. వరద సహాయ చర్యలకు ఇబ్బంది వుండదని తెలుసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో కలిసి మాట్లాడేటప్పుడు తమకు ఏమీ ఇవ్వలేదన్న మాట వారి నుంచి రాకూడదని ముందుగానే అధికారులకు గట్టిగా చెప్పారు.అక్కడక్కడ ఆకస్మిక తనిఖీలు చేసి బాధితులతో మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రకటించిన సాయమంతా అందిందా? అని నేరుగా బాధితులనే అడిగేవారు. అంతేకాదు.. మీ కలెక్టర్ కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో మీరే చెప్పండని కూడా ప్రశ్నించేవారు.

ప్రకృతి విపత్తుల సమయంలో జనంలోకి వెళ్లి, అందునా వరద బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ సాయం పూర్తిగా అందిందా? అని పాలకులు అడగడం ఒక విధంగా సాహసమే అవుతుంది. అయినాసరే ఆ విషయం తెలిసినా సరే వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు.తన ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాల మీద, తన అధికారుల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది.
ప్రతి ఏటా కృష్ణా, గోదావరి వరదల సమయంలో ముంపు బాధితుల విషయంలో అత్యంత ఉదారంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ తరచూ అధికారులతో చెప్పేవారు. మన సొంత మనుషులు ఆ బాధితుల్లో ఉంటే మనం ఎలా వ్యవహరిస్తామో అలా ఆలోచించండి అంటూ అధికారుల్లో స్ఫూర్తిని నింపి వారిలోని మానవత్వాన్ని బయటకు తీసేవారు. ఇదంతా కేవలం మనుషుల్ని ప్రేమిస్తేనే చేయగలం. ఆ ప్రేమ జగన్ లో పుష్కలం. ఆయన ఓదార్పు, పాదయాత్ర సమయాల్లోనేఅన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూశారు. అందుకే పాలకునిగా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలతో ప్రజల మనసులో జననేతగా పేరు సంపాదించుకున్నారు.
కృష్ణలంక వాసుల కష్టాలు తీర్చిన నాయకుడు
బుడమేరు వరదలు అనగానే బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు వుండదు. కృష్ణలంక వాసుల కష్టాలయితే పగవాడికి కూడా వద్దనేలాగా వుండేవి. కృష్ణానది పొంగితే అక్కడి వేలాది కుటుంబాల పరిస్థితి మరీ భయంకరం.. గతంలో ఆ ప్రాంత వాసులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక వారధి మీదుగా వెళ్తుండగా కృష్ణలంక వాసుల కష్టాలు కనిపించాయి. ఇక అంతే.. ఆయన వెంటనే అధికారులను పిలిపించి నది ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
రిటైనింగ్ వాల్ నిర్మించి మమ్మల్ని కాపాడంటూ ఏ ఒక్కరూ ఆయన్ను నేరుగా అడగకపోయినా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కళ్లారా వారి కష్టాలు చూశారు కాబట్టేఆయన ఆ పని మొదలుపెట్టారు. మొత్తం రూ.474 కోట్లు వ్యయం చేసి రెండున్నర కిలోమీటర్ల పొడవునా వాల్ నిర్మాణం చేపట్టారు.దీంతో సుమారు 80 వేల మందిని మొన్నటి వరదల నుంచి కాపాడటానికి వీలైంది.
పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఏ ఇబ్బందీ లేకుండా కృష్ణలంక ప్రాంత ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇదంతా కేవలం మనసున్న నాయకుడు వైఎస్ జగన్ వలనే సాధ్యం అయింది. ఎవరూ అడగకుండా అన్ని వేల మందికి ఉపయోగపడే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజల మనసుల్లో నిలిచారు వైఎస్ జగన్.
ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పదులసంఖ్యలో ప్రజాదరణ పథకాలు నిత్యం అమలయ్యేవి. దాంతో చాలావరకు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించింది. కీలక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..అందుకే వైఎస్ జగన్ మనసున్న నాయకుడయ్యారు. శనివారం(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు..
Comments
Please login to add a commentAdd a comment