ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు లేనట్టే
బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం
రాష్ట్రంలో మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దారిమళ్లి, రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులనుబట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పనుంది. ఈనెల 22న (బుధవారం) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగాను బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుపానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నాయి.
అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం/తుపాను బంగ్లాదేశ్ వైపు మళ్లుతుండడం వల్ల దాని ప్రభావం ఏపీపై ఉండదు. అదే మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మళ్లీ కొన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలు..
రాష్ట్రంలో వారం రోజులుగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వడగాడ్పులు కూడా తగ్గాయి. తాజా అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను గాలిలో తేమను బంగ్లాదేశ్ వైపు లాక్కునిపోతుంది. దీనివల్ల మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 3 – 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మూడు రోజులు తేలికపాటి వానలు
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment