జూరాల ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువకు పోటెత్తుతున్న వరద
సాక్షి, హైదరాబాద్/గద్వాల: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. రోజుకి 17 టీఎంసీల మేర నీరు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతోంది. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి స్థిరంగా నీటి ప్రవాహాలు కొనసాగుతుండటంతో దిగువన ఉన్న ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉధృతంగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే జూరాల నిండగా, శ్రీశైలంలో నిల్వలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆల్మట్టిలోకి శుక్రవారం సాయంత్రం 1.73 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు వచ్చి నీటిని వచ్చినట్లుగా దిగువ నారాయణపూర్‌కు వది లేస్తున్నారు.
నారాయణపూర్ ఇప్పటికే నిండటం, దానికి స్థానిక ప్రవాహాలు తోడవడంతో 1.83 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ప్రాజెక్టు నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాలకు శుక్రవారం సాయంత్రం 1.8 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అక్కడి నుంచి 1.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ కాల్వలకు నీటి పంపింగ్ కొనసాగుతోంది.
ఇక జూరాల నీటిని దిగువకు వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. నిన్న, మొన్నటి వరకు ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల మేర వరద రాగా, శుక్రవారం అది ఏకంగా 1.76 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 215 టీఎంసీలకుగాను 30.91 టీఎంసీలకు చేరింది. జూరాలకు తోడు తుంగభద్ర సైతం నిండటంతో అక్కడి నుంచి 69 వేల క్యూసెక్కుల ప్రవాహాలు దిగువ శ్రీశైలానికి వస్తున్నాయి. దీంతో శనివారంనాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment