550.6 అడుగుల్లో 211.1 టీఎంసీల నిల్వ
మూడురోజుల్లో నిండనున్న సాగర్
శ్రీశైలంలోకి పెరిగిన వరద.. 4.89 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
883.3 అడుగుల్లో 206.1 టీఎంసీలు నిల్వ చేస్తూ 5.28 లక్షల క్యూసెక్కులు విడుదల
కృష్ణా ప్రధానపాయలో ఎగువన స్థిరంగా వరద
తుంగభద్ర డ్యామ్ నుంచి 1.82 లక్షల క్యూసెక్కులు దిగువకు
మంత్రాలయం వద్ద ప్రమాదకరంగా తుంగభద్ర ప్రవాహం
నేడు శ్రీశైలంలోకి ఇదే రీతిలో కొనసాగనున్న ప్రవాహం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కులు చేరుతుండడంతో నీటినిల్వ 550.6 అడుగుల్లో 211.1 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీవరద వస్తున్న నేపథ్యంలో మరో మూడురోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉద్ధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పదిగేట్లను 20 అడుగులు ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
విద్యుదుత్పత్తి చేస్తూ కుడికేంద్రం నుంచి 23,904 క్యూసెక్కులు, ఎడమకేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కుల నీరు సాగర్ వైపు ఉరకలెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేలు, మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 253 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధానపాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
ఆల్మట్టి ప్రాజెక్టులోకి 3.27 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఖాళీ ప్రదేశాన్ని నింపుతూ దిగువకు 3 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేస్తూ దిగువకు 2.85 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.
తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311.75 మీటర్లకు (సముద్రమట్టానికి) చేరుకుంది. తుంగభద్ర ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగనుంది.
తగ్గుతున్న గోదావరి వరద
పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. నదిలో కలుస్తున్న ఉపనదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ తగ్గుతుండటంతో నదిలో ప్రవాహం తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే నుంచి 8.06 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది.
ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద నీరు తగ్గుతూ 34.20 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేయడంతో మళ్లీ వరద పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment